హైడ్రాకు చట్టం.!చెరువు జాగాల్లో ఇండ్లు కడ్తే ఇక జైలుకే

హైడ్రాకు చట్టం.!చెరువు జాగాల్లో ఇండ్లు కడ్తే ఇక జైలుకే
  • రూపొందించేందుకు రాష్ట్ర సర్కారు కసరత్తు
  • చెరువు జాగాల్లో ఇండ్లు కడ్తే ఇక జైలుకే
  • లక్షల్లో జరిమానాలు, కఠిన శిక్షలతో మరిన్ని పవర్స్​
  • పార్కులు, నాలాలు, ప్రభుత్వ స్థలాలకూ వర్తింపు
  • ప్రస్తుతం జీవో తెచ్చినా.. చట్టబద్ధత తీసుకురావాలని నిర్ణయం
  • మున్సిపల్, రెవెన్యూ, జీహెచ్ఎంసీ, జలమండలి,హెచ్ఎండీఏ నుంచి హైడ్రాకు సిబ్బంది

హైదరాబాద్, వెలుగు: హైడ్రాకు సర్వాధికారాలు ఇచ్చేందుకు రాష్ట్ర సర్కారు కసరత్తు చేస్తున్నది. చెరువు జాగాల్లో ఇండ్లు కడ్తే భారీ జరిమానాలు వేయడంతోపాటు.. కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నది. అక్రమ నిర్మాణాల కూల్చివేతలతోనే ఆగకుండా.. భవిష్యత్తులో ఏ ప్రభుత్వం ఉన్నా ఎఫ్​టీఎల్, బఫర్​జోన్లు, నాలాలు, పార్కులు కబ్జాలు కాకుండా పక్కా ప్లాన్​ చేస్తున్నది.  ఇప్పటికే హైడ్రాను జీవో రూపంలో తీసుకొచ్చి, అమలు చేస్తున్నప్పటికీ.. మరింత పవర్​ఫుల్​గా ఉండేందుకు చట్టం చేయాలని భావిస్తున్నది. హైడ్రాతో కొన్ని శాఖల  సమన్వయం విషయంలోనూ మార్పులు చేయాలని  నిర్ణయించిన ప్రభుత్వం.. ఇందుకు తగ్గట్టు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నది. 

నోటీసుల దగ్గర నుంచి కూల్చివేతల వరకు పూర్తిగా హైడ్రా ఆధ్వర్యంలోనే చేసేలా మార్పులు తీసుకువస్తున్నది. దీనిపైనా తాత్కాలికంగా జీవోలు తీసుకురావడమా? లేదా నేరుగా హైడ్రాకు చట్టబద్ధత కల్పించడమా ? అనే దానిపై కసరత్తు తుది దశకు చేరుకున్నది. ఈ మేరకు అధికారులు సీఎం రేవంత్ రెడ్డి ముందు రెండు ప్రతిపాదనలు ఉంచినట్టు తెలిసింది.  ఇందులో ఒకటి ఉత్తర్వుల(జీవో) రూపంలో హైడ్రాకు తాత్కాలికంగా అన్ని పవర్స్​ ఇవ్వడం.. రెండోది చట్టం తీసుకురావడం. నోటీసుల దగ్గర నుంచి కూల్చివేతల వరకు.. ఎవరైనా కోర్టుకు వెళ్తే కూడా హైడ్రా నుంచే రెస్పాండెంట్​ గా ఉండేలా పూర్తి అధికారాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.

Also Read:-ఖమ్మంలో తీరని వెతలు

 ఇందుకు తగ్గట్టుగా ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్, రెవెన్యూ,  జీహెచ్ఎంసీ, పురపాలక, పంచాయతీరాజ్, వాల్టాకు సంబంధించిన చట్టాల్లో ఆక్రమణలకు సంబంధించి ఎలాంటి నిబంధనలు ఉన్నాయో ఆయా శాఖల అధికారులు నివేదిక తయారు చేశారు. కేవలం నోటీసులు ఇచ్చి కబ్జాలు, అక్రమ నిర్మాణాలు తొలగించడమే కాకుండా.. భూముల పరిరక్షణ, చెరువులు, కుంటలు, పార్కులు, నాలాల రక్షణ కూడా హైడ్రానే చూడనున్నది. ఒక్కసారి కూల్చివేతలు పూర్తి చేసిన తర్వాత.. మళ్లీ ఎవరైనా  కొత్తగా చెరువులు, కుంటలను కబ్జా చేసి అక్రమ నిర్మాణం చేపడితే.. వారికి భారీ జరిమానా విధించడంతో పాటు ఇతర కఠిన చర్యలు తీసుకోవాలని యోచిస్తున్నది.  ఫలితంగా కొత్తగా కబ్జాలు, అక్రమ నిర్మాణాలు లేకుండా అడ్డుకోవచ్చని ప్రభుత్వం భావిస్తున్నది. వివిధ శాఖల్లో ఉన్న వివిధ రకాల చట్టాల్లో కబ్జాలు, అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు ఎలాంటి రూల్స్​ ఉన్నాయి ? వాటిని హైడ్రాకు అప్పగించే అవకాశం ఉందా? లేదా? అనే దానిపైనా ఒక నివేదికను తయారు చేశారు.  ఒకవేళ ఏదైనా శాఖ నుంచి అధికారాలు బదలాయించే అవకాశం లేనప్పుడు చట్టం తీసుకువస్తే ఎలా ఉండలానే దానిపైనా చర్చిస్తున్నారు. జీవో ఇస్తే ఏమైనా లీగల్​ చిక్కులు వస్తాయా? అనేదానిపైనా కూడా అధ్యయనం చేసినట్టు తెలిసింది. 

ఆయా శాఖల నుంచి హైడ్రాలో ప్రాతినిధ్యం  

చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ భూములు ఏయే శాఖ పరిధిలో ఉన్నాయో.. ఆయా డిపార్ట్​మెంట్ల నుంచి పైస్థాయి ఆఫీసర్లను హైడ్రాలోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీంతో డిపార్ట్​మెంట్లలో ఇప్పటికే ఉన్న పరిరక్షణ చట్టాలకు తగ్గట్టుగా.. హైడ్రా చట్టాన్ని రూపొందించాలనుకుంటున్నది.   దీంతో ఎక్కడా.. ఎలాంటి ఇబ్బంది ఉండదని భావిస్తున్నది. ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్, రెవెన్యూ,  జీహెచ్​ఎంసీ, పురపాలక, పంచాయతీరాజ్ శాఖల నుంచి ఉద్యోగులను నియమించనున్నారు.  కొత్తగా ఎలాంటి అక్రమ నిర్మాణం కట్టకుండా ఉండేందుకు.. అలాంటి ఆలోచన వస్తేనే భయభ్రాంతులకు గురయ్యేలా భారీ జరిమానాలు విధించనున్నట్టు తెలిసింది. 

 ఈ మొత్తం లక్షల్లో ఉంటుందని అంటున్నారు. దాంతోపాటు ఒకే వ్యక్తి పలుమార్లు ఎఫ్​టీఎల్​, బఫర్​ జోన్లు, పార్కులు, నాలాలు కబ్జాలు చేసినట్టు గుర్తిస్తే జైలు శిక్ష  విధించేందుకూ సిద్ధమవుతున్నది. ఇదిలా ఉంటే గండిపేట, హిమాయత్ సాగర్ చెరువుల పరిరక్షణ కూడా జల మండలి నుంచి హైడ్రా పరిధిలోకి తీసుకు వచ్చేందుకు కసరత్తు పూర్తయింది. నోటీసులు అయినా సరే.. కూల్చివేతలైనా సరే.. అన్నీ హైడ్రా ఆధ్వర్యంలోనే చేపట్టేలా ఏర్పాట్లు చేసింది.  రాష్ట్ర హై-కోర్టు జారీ చేసిన ఆదేశాలను పరిగణనలోకి తీసుకుంటూ  ప్రభుత్వ స్థలాలు, చెరువులు, ప్రభుత్వ  ఆస్తుల పరిరక్షణ కోసం హైడ్రాకు మరిన్ని అధికారాలు, సిబ్బందిని  అప్పగించేందుకు ప్రభుత్వం సర్వత్రా సిద్ధమవుతున్నది.