
- కలెక్టర్లకు పలు గైడ్ లైన్స్ జారీ చేసిన హౌసింగ్ కార్పొరేషన్
హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో పాటించాల్సిన పలు గైడ్ లైన్లను ఖరారు చేస్తూ హౌసింగ్ కార్పోరేషన్ ఎండీ వీపీగౌతమ్ సర్క్యులర్ జారీ చేశారు. వీటిని కలెక్టర్లకు గురువారం పంపారు. ఇంటి నిర్మాణం కోసం.. ముగ్గు పోసిన తర్వాత బేస్ మట్టం పనులు ఆరంభించే ముందు స్థలం ఫొటో తీసి, దాన్ని ఇందిరమ్మ యాప్ లో మొబైల్ ఫోన్ ద్వారా జియో కోఆర్డినేట్స్ నమోదు చేయాలని ఎండీ సూచించారు. ఇంటి నిర్మాణ వైశాల్యం 400 చదరపు అడుగులకు తగ్గకుండా ఉండాలని.. రెండు గదులు, ఒక వంటగది, బాత్రూంతో సహా ఇంటిని నిర్మించాలని తెలిపారు.
ప్రతి దశలోనూ ఫొటోలు తీసి మొబైల్ ద్వారా ఇందిరమ్మ అప్ తో అప్లోడ్ చేయాలని, వీటి ఆధారంగానే లబ్ధిదారులకు చెల్లింపులు చేస్తామని స్పష్టం చేశారు. పాత ఇంటిని అనుకోనిగాని, ఇప్పటికే ఉన్న ఇంటికి అదనపు గదులుగాని, కొంతవరకు కూల్చి వేసిన వాటికిగాని ఈ స్కీమ్ ద్వారా నిర్మాణం చేయరాదని వివరించారు. ఈ అంశాలను కలెక్టర్లు పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. గతంలో నిర్మాణం ప్రారంభించి కొంతవరకు నిర్మించిన ఇండ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇందిరమ్మ స్కీమ్ మంజూరు చేయరాదన్నారు. ఇండ్లను కలిపి కట్టుకోవడానికి అనుమతించరాదని, ఒకటే ఫ్యామిలీలో ఉన్న కుటుంబ సభ్యులకు ఒక ఇల్లు మాత్రమే ఇవ్వాలన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులందరికీ కలెక్టర్లు సరైన ఆదేశాలు ఇవ్వాలని ..గైడ్ లైన్స్ తప్పనిసరిగా పాటించే లాగా చూడాలన్నారు. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా చూడాలని కలెక్టర్లను ఎండీ గౌతమ్ ఆదేశించారు.