ఆర్వీ అసోసియేట్​కు ట్రిపుల్‌‌ ఆర్‌‌ సౌత్ డీపీఆర్ బాధ్యతలు

ఆర్వీ అసోసియేట్​కు ట్రిపుల్‌‌ ఆర్‌‌ సౌత్ డీపీఆర్ బాధ్యతలు
  • ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: రీజనల్ రింగ్ రోడ్ ( ఆర్ఆర్ఆర్ )సౌత్ పార్ట్ డీపీఆర్ రూపొందించే టెండర్ ను ఆర్వీ అసోసియేట్ కు అప్పగిస్తూ ఆర్ అండ్ బీ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 6 కంపెనీల్లో  ఆర్వీ అసోసియేట్ కే టెండర్ దక్కింది. 6 నెలల్లో ట్రిపుల్ ఆర్ సౌత్ కు డీపీఆర్ రెడీ చేసి ప్రభుత్వానికి అందచేయాల్సి ఉంటుంది. ఇందుకు రూ.12 కోట్లు ఈ కన్సల్టెన్సీకి చెల్లించేందుకు అడ్మినిస్ర్టేటివ్ సాంక్షన్ ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ట్రిపుల్ ఆర్ సౌత్ పార్ట్ డీపీఆర్ కు ఆర్ అండ్ బీ అధికారులు టెండర్లు పిలవగా సరైన స్పందన రాకపోవడంతో రెండోసారి పిలిచారు. సౌత్ పార్ట్ నిర్మాణాన్ని చేపట్టాలని కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో విజ్ఞప్తి చేసింది. ఈ అంశంపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

 ఈ రహదారి మంజూరైనప్పుడు ప్రాథమికంగా ఖరారైన అలైన్‌‌మెంట్‌‌ ప్రకారం చౌటుప్పల్‌‌-–ఆమనగల్‌‌-–సంగారెడ్డి వరకు 189 కిలోమీటర్లుగా పేర్కొన్నారు. ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వం నిర్మించే ఆలోచనతో ప్రైమరీ అలైన్‌‌మెంట్‌‌లో మార్పులు చేశారు. కొత్త అలైన్‌‌మెంట్‌‌ ప్రకారం..మరో 11 కిలోమీటర్లు పెరిగి రోడ్డు మొత్తం 200 కిలోమీటర్లు అయింది. దీనికి డీపీఆర్‌‌ ఇవ్వాలంటూ టెండర్‌‌ నోటీసులోనూ పేర్కొన్నారు. అలాగే.. కేంద్ర ప్రభుత్వ రూల్స్ కు అనుగుణంగా డీపీఆర్ రెడీ చేయాలని టెండర్ దక్కించుకున్న కంపెనీకి స్పష్టం చేసినట్టు అధికారులు చెబుతున్నారు. 

దానిని కేంద్రానికి సమర్పించి, ఆ ప్రకారంగా రహదారి నిర్మాణం చేపట్టాలని మరోసారి రిక్వెస్ట్ చేయాలని రాష్ట్ర సర్కారు భావిస్తున్నది. ట్రిపుల్ ఆర్ నార్త్ పార్ట్ కు ఇప్పటికే కేంద్రం టెండర్లు పిలవగా త్వరలో ఓపెన్ చేయనున్నారు. అయితే, సౌత్ పార్ట్ డీపీఆర్ కు 6 నెలలు టైమ్ ఇవ్వటం, నిర్మాణంపై కేంద్రం స్పష్టత ఇవ్వకపోవటంతో ఈ పార్ట్ పనులు లేట్ అవ్వనున్నాయి.