మంచిర్యాల -అంతర్గాం బ్రిడ్జి రద్దు .. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

మంచిర్యాల -అంతర్గాం బ్రిడ్జి రద్దు .. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
  •  గోదావరిపై హైలెవల్ బ్రిడ్జి రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
  • 2018లో రూ.125 కోట్లతో శాంక్షన్ చేసిన అప్పటి సీఎం కేసీఆర్
  • అంచనా వ్యయం రూ.164 కోట్లకు పెంపు.. టెండర్, సాయిల్ టెస్ట్ పూర్తి
  • ప్రత్యామ్నాయంగా ముల్కల్ల–ముర్మూర్ బ్రిడ్జికి రూ.450 కోట్లతో ప్రపోజల్స్

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల–-అంతర్గాం​గోదావరి బ్రిడ్జిని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ స్పెషల్ చీఫ్​ సెక్రటరీ వికాస్​రాజ్ ​ఆర్డర్స్​ జారీ చేశారు. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలను కలుపుతూ గోదావరిపై హైలెవల్​బ్రిడ్జి నిర్మించాలని చాలాకాలంగా డిమాండ్ ఉంది. ఈ క్రమంలోనే 2018లో రూ.125 కోట్లతో బ్రిడ్జిని శాంక్షన్ ​చేస్తున్నట్టు అప్పటి సీఎం కేసీఆర్ ప్రకటించారు. 2019 ఎలక్షన్స్​ తర్వాత రెండోసారి బీఆర్ఎస్​గవర్నమెంట్​అధికారంలోకి వచ్చి కేసీఆర్​ మళ్లీ సీఎం అయినప్పటికీ బ్రిడ్జికి మోక్షం కలగలేదు.

 ప్రజలు, ప్రతిపక్షాల నుంచి విమర్శలు రావడంతో 2023 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మూడేండ్ల క్రితం పనులకు గ్రీన్​సిగ్నల్​ఇచ్చారు. అంచనా వ్యయాన్ని రూ.125 కోట్ల నుంచి రూ.164 కోట్లకు పెంచి టెండర్​ కాల్​చేయగా, వల్లభనేని కన్​స్ట్రక్షన్స్​ సంస్థ దక్కించుకుంది. వెంటనే సాయిల్​ టెస్టింగ్​ చేసి బ్రిడ్జి వర్క్​ స్టార్ట్​ చేయడానికి అంతా రెడీ చేశారు. అయితే ఇతర ఏరియాల్లో చేసిన ఇతర పనులకు సంబంధించిన కోట్ల రూపాయలను కాంట్రాక్టర్​కు ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఈ బ్రిడ్జి పనులను నిలిపివేశారు. 

రూ.450 కోట్లతో మరో బ్రిడ్జికి ప్రపోజల్స్

2023 ఎన్నికల్లో కాంగ్రెస్​ గవర్నమెంట్​అధికారంలోకి రావడం, మంచిర్యాల ఎమ్మెల్యేగా ప్రేమ్​సాగర్​రావు గెలవడంతో మంచిర్యాల–-అంతర్గాం బ్రిడ్జికి బ్రేక్​ పడ్డది. ఈ బ్రిడ్జి నిర్మాణంతో మంచిర్యాల, పెద్దపల్లి మధ్య దాదాపు 18 కిలోమీటర్ల దూరం తగ్గుతున్నప్పటికీ హెవీ వెహికల్స్ పూర్తిగా మంచిర్యాల టౌన్​నుంచి రాకపోకలు సాగించాల్సి ఉంటుంది. దీంతో జిల్లా కేంద్రంలో ట్రాఫిక్​ రద్దీ పెరగడం, కాలేజీ రోడ్డు ఇరుకుగా ఉండడం, ​రైల్వే ఓవర్​ బ్రిడ్జి దగ్గర సమస్యలు తలెత్తే అవకాశం ఉండడంతో ఈ బ్రిడ్జిని రద్దు చేస్తామని ఎమ్మెల్యే పీఎస్సార్ ​ప్రకటించారు. దీనికి ప్రత్యామ్నాయంగా ఇటు ముల్కల్ల, అటు ముర్మూర్​నడుమ గోదావరిపై రూ.450 కోట్ల అంచనాతో మరో హైలెవల్​ బ్రిడ్జి నిర్మాణానికి ప్రపోజల్స్​ రూపొందించి ప్రభుత్వానికి పంపారు. 

పెరిగిన వ్యయం... తగ్గని దూరం

మంచిర్యాల, పెద్దపల్లి మధ్య దూరాభారం తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా మంచిర్యాల–-అంతర్గాం బ్రిడ్జిని గత ప్రభుత్వం శాంక్షన్ ​చేసింది. ప్రస్తుతం మంచిర్యాల, శ్రీరాంపూర్, గోదావరిఖని, బసంత్​నగర్​ నుంచి రాజీవ్​ రహదారి మీదుగా పెద్దపల్లికి వెళ్లాలంటే 40 కి.మీ. ప్రయాణించాలి. మంచిర్యాల–-అంతర్గాం బ్రిడ్జి పూర్తయితే దాదాపు 18 కిలోమీటర్ల దూరం తగ్గేది. మంచిర్యాల నుంచి నేరుగా బసంత్​నగర్ ​రాజీవ్​ ఫోర్​లైన్​కు చేరుకోవచ్చు. కొత్తగా ప్రతిపాదించిన ముల్కల్ల–-ముర్మూర్​ బ్రిడ్జి నిర్మాణంతో ఈ రెండు జిల్లా కేంద్రాల మధ్య కేవలం 5కి.మీ. దూరమే తగ్గుతుంది. 

పైగా అంచనా వ్యయం రూ.164 కోట్ల నుంచి రూ.450 కోట్లకు అంటే దాదాపు రూ.300 కోట్లు పెరుగుతుంది. అంతర్గాం బ్రిడ్జికి కేవలం 15 ఎకరాల భూమి అవసరం కాగా.. ముల్కల్ల–-ముర్మూర్ బ్రిడ్జికి సుమారు 100 ఎకరాల భూములు సేకరించాల్సి ఉంటుందని అంచనా. ఇప్పటికే ముల్కల్ల శివారులో ఎన్​హెచ్​63 గ్రీన్​ హైవేకు భూములు ఇవ్వబోమని రైతులు ఆందోళనలు చేస్తున్నారు. అటు ఎల్లంపల్లి ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులు కూడా ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారు.

రాజకీయ రంగు

గోదావరిపై హైలెవల్ ​బ్రిడ్జి నిర్మాణం విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్​ నాయకులు రాజకీయ విమర్శల దాడి చేసుకుంటున్నారు. అంతర్గాం శివారులో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్​ రావు భూములు ఉండడంతో వాటికి డిమాండ్​ పెంచుకునేందుకే ఈ బ్రిడ్జిని శాంక్షన్ ​చేయించుకున్నాడని, దీంతో ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉండదని ఎమ్మెల్యే ప్రేమ్​సాగర్​ రావు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే పీఎస్సార్​ కేవలం కమీషన్ల కోసమే అంతర్గాం బ్రిడ్జిని రద్దు చేయించి రూ.450 కోట్లతో ముల్కల్ల–-ముర్మూర్​బ్రిడ్జిని తెరపైకి తీసుకొచ్చాడని మాజీ ఎమ్మెల్యే దివాకర్​ రావు విమర్శిస్తున్నారు. ముల్కల్ల శివార్లలో రియల్​ఎస్టేట్ ​బూమ్​పెంచి కమీషన్లు దండుకోవడమే ఆయన ఉద్దేశమని మండిపడుతున్నారు. ఏదేమైనా ఇలాంటి పరిస్థితుల్లో రైతులను ఒప్పించి, గిట్టుబాటు నష్టపరిహారం ఇప్పించి భూసేకరణ కష్టమేనని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.