ప్రభుత్వం కీలక నిర్ణయం: నవంబర్ 4 నుంచి కార్తీకమాసం... దేవాలయాల బాట ప్రత్యేక కార్యక్రమం

ప్రభుత్వం కీలక నిర్ణయం: నవంబర్ 4 నుంచి కార్తీకమాసం...  దేవాలయాల బాట ప్రత్యేక కార్యక్రమం
  • కార్తీకమాసం నుంచి దేవాలయాల బాట
  • ఆలయాలను సందర్శించనున్న అధికారులు
  • భక్తులతో కలిసి ప్రత్యేక పూజలు.. సమీక్షలు
  • ప్రతి సోమవారం గుళ్లు దర్శించేలా కార్యాచరణ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో దేవాదాయ శాఖ వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నది. గత బీఆర్ఎస్  సర్కారు  నిర్లక్ష్యంతో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన కార్యక్రమాలు ముందుకు సాగలేదు. కాంగ్రెస్  ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమాలకు నాంది పలుకుతున్నది. ఇందులో భాగంగా వచ్చే కార్తీకమాసం నుంచి ‘దేవాలయాల బాట’ కార్యక్రమానికి అంకురార్పణ చేయబోతున్నది. 

ఈ కార్యక్రమంలో భాగంగా దేవాదాయ శాఖ అధికారులు ఆలయాలను సందర్శించడంతో పాటు భక్తులతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. కార్తీకమాసం, ధనుర్మాసంలో తప్పనిసరిగా అధికారులు దేవాలయాలకు వెళ్లేలా ప్రభుత్వం కార్యాచరణ అమలు చేస్తున్నది. మంత్రి కొండా సురేఖ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిసింది. వచ్చే నెల 4 నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాన్ని కీసరగుట్ట లేదా  ఉమ్మడి వరంగల్  జిల్లా రామప్ప, వెయ్యి స్తంభాల ఆలయాల్లో ఏదోక ఆలయం నుంచి  ప్రారంభించి తొలి కార్తీకపూజ చేయనున్నట్లు సమాచారం. అంతేకాకుండా, పలు ఆలయాల్లో విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. 

దేవాదాయ శాఖ పరిధిలో 704 ఆలయాలు.. 

రాష్ట్రంలో ప్రస్తుతం  704 ఆలయాలు దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నాయి. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ఆలయాలకు, ప్రముఖ ఆలయాలకు ఈవో ఒకరు ఉన్నారు. చిన్నచిన్న ఆలయాలకు వాటి ప్రాధాన్యతను బట్టి రెండు, మూడు మండలాల్లోని ఆలయాలకు కలిపి ఒక ఈవోను ఏర్పాటు చేశారు. ఈ ఆలయాలను పర్యవేక్షిస్తున్న ఈవోలు ఆలయాల అభివృద్ధిపై దష్టి సారించడం లేదని తెలుస్తోంది. ఆలయాల్లో అవసరమైన సౌకర్యాలు కల్పించడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు.  ఈ నేపథ్యంలో భక్తులు, పర్యాటకులకు గ్యాప్ తగ్గించేందుకు కసరత్తు చేస్తున్నది. 

కాగా.. కార్తీకమాసం, ధనుర్మాసం, అధిక శ్రావణమాసం, మహాశివరాత్రులు, శ్రావణమాసం ఇలా ప్రత్యేక దినాల్లో ఉత్సవ, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అయితే, ఈవోలకు ఎక్కువ ఆలయాల బాధ్యతలు ఉండటంతో విధిగా అన్ని ఆలయాల్లో జరిగే పూజల్లో పాల్గొనేలా చర్యలు చేపడుతున్నారు. ప్రతి మాసంలో ప్రతి సోమవారం ఏదోక ఆలయం సందర్శించి.. అక్కడే సమీక్షలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నది. భక్తులతో కలిసి పూజల్లో పాల్గొనడంతోపాటు ఆలయాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, సౌకర్యాలు, సమస్యలు తదితర అంశాలపై వారితో చర్చించనున్నారు. 

విగ్రహాలకు ప్రాణప్రతిష్ట

రాష్ట్రంలో ఆలయాలు 12 ఏళ్లకు పైబడితే తిరిగి ఆ దేవాతామూర్తుల విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం చేపట్టనున్నారు.  అందుకోసం దాతల నుంచి విరాళాలు సేకరించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సమాచారం. అలాగే, కుంభాభిషేకాలు నిర్వహించేందుకు శ్రీకారం చుట్టబోతున్నారు. సంప్రోక్షణ, తదితర కార్యక్రమాలను చేపట్టి భక్తులను, పర్యాటకులను ఆకట్టుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. అంతేకాకుండా, క్యూఆర్  కోడ్  సిస్టంతో పూజలు, ఆలయాల్లో అన్నదానం కార్యక్రమాలకు విరాళాలు సేకరించనున్నారు. అన్ని దేవాలయాల వెబ్ సైట్లను ఒకే గొడుకు కిందకు తీసుకొచ్చేందుకు త్వరలోనే ప్రత్యేక యాప్ ను దేవాదాయశాఖ తయారు చేయనున్నది. ప్రముఖ దేవాలయ వివరాలు, స్థల పురాణం, ఆలయాల నేపథ్యంవివరాలు అందుబాటులో ఉంచనున్నారు.

ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యం..
 
ప్రతి ఆలయం పరిధిలోని ప్రజాప్రతినిధులను పూజల్లో భాగస్వాములను చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి నుంచి వార్డు, సర్పంచ్, ఎంపీటీసీలు, జడ్పీటీసీల ఇతర ప్రజాప్రతినిధుల వరకు అందరూ ఆలయాలకు వచ్చి భక్తులతో పాటు నిత్యపూజల్లో పాల్గొనేలా చూడాలని ఈవోలకు సూచనలు చేసినట్లు తెలిసింది. దీని ద్వారా ఆలయాల సమస్యలను ఆ సందర్భాల్లో వివరిస్తే దాతలు ముందుకొచ్చి నిధులు కేటాయించే అవకాశం ఉందని ఆలోచిస్తున్నారు. కార్తీకమాసం, ధనుర్మాసంలో ఆలయాల్లో రద్దీ ఉండే అవకాశం ఉంది కాబట్టి అధికారులు, సిబ్బంది సమన్వయంతో భక్తులకు సౌకర్యాలు కల్పించాలని, ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యం పెంచేందుకు ఇప్పటికే మార్గదర్శకాలు రూపొందించినట్లు సమాచారం.