తెలంగాణ ప్రభుత్వం 2016లో మిషన్ భగీరథ పథకం ప్రారంభించింది. 25 వేల గ్రామాల్లో రెండున్నర కోట్ల ప్రజల దాహార్తి తీర్చడానికి దాదాపు రూ.75 వేల కోట్ల బడ్జెట్ కేటయింపులు జరిగాయి. గోదావరి, కృష్ణా జలాలను 53+32 మొత్తం 85 నుంచి 100 టీఎంసీల నీటిని తోడి, ప్రతిరోజు ఇంటింటికీ100 లీటర్ల మంచినీళ్లను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా జిల్లాల్లో భగీరథ పనులు పూర్తయ్యాయి. నీటి సరఫరా కొనసాగుతున్నది. ఈ పథకం నిర్వహణను పదేండ్లపాటు కొనసాగించేందుకు 11 ఏజెన్సీలకు ప్రభుత్వం బాధ్యత అప్పగించింది. నీటిని శుద్ధి చేసి ఇంటింటికీ సప్లై చేసే క్రమంలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అలాంటి సమస్యలను సంబంధిత ఏజెన్సీలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ పథకం పనిలో స్కిల్డ్, సెమి స్కిల్డ్, అన్ స్కిల్డ్ వర్కర్లను కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించారు. తాత్కాలిక పనులకు మాత్రమే కాంట్రాక్ట్ కార్మికులను నియమిచాలని అనేక కార్మిక చట్టాలు చెబుతున్నాయి. నిత్యం ప్రజలకు నీరందించాల్సిన మిషన్ భగీరథ పథకం తాత్కాలికమైనది కాదు. కానీ కాంట్రాక్ట్ పద్ధతిలో కార్మికులను నియమించుకొని, పనికి తగిన ప్రతిఫలం ఇవ్వకుండా ఏజెన్సీలు వెట్టిచాకిరి చేయిస్తున్నాయి. మరోవైపు కనీస వేతనాలు అమలుచేస్తున్నట్లు, తప్పుడు లెక్కలు చూపి లబ్ధిపొందుతున్నాయి.
పథకం ఆదర్శమే.. మరి కార్మికులు?
రాష్ట్రంలో కార్మికులకు చెల్లించే వేతనాలకు సంబంధించి ఒక పాలసీ అంటూ ఏదీ లేదు. ఏజెన్సీలు కార్మిక చట్టాలను, నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాయి. ఆయా సంస్థల ఒత్తిళ్లకు కార్మిక శాఖ అధికారులు కూడా కనీసం అటువైపు తొంగిచూడలేని పరిస్థితి ఉంది. రాష్ట్రంలో16 వేల మంది మిషన్ భగీరథ కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నది. మిషన్ భగీరథ పథకం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని, కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డు ఇచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వం పదేపదే ప్రచారం చేసుకుంటున్నది. ఎన్నికల్లోనూ ప్రచార అస్త్రంగా వాడుకుంటున్నది. ఇందులో తప్పు లేదు. కానీ ఇంటింటికీ నీరందించడంలో ఉన్న కార్మికుల శ్రమ గురించి, వారి కష్టాల గురించి ప్రభుత్వం ఆలోచించాలి. భగీరథ కార్మికుల జీవన స్థితిగతులను, ఉద్యోగ భద్రత, కనీస వేతనాలను, చట్టబద్ధహక్కులను ఇప్పటికైనా పట్టించుకోవాలి.
పని ఎక్కువ.. వేతనం తక్కువ
మిషన్ భగీరథలో లైన్ మెన్, సూపర్ వైజర్, వాచ్ మెన్, ఫిట్టర్, ఫిల్టర్ బెడ్ ఆపరేటర్, వాల్ ఆపరేటర్, పంప్ ఆపరేటర్, గార్డెనర్స్ పనిచేస్తున్నారు. లైన్ మెన్ లు రోజుకు సుమారు 50 కిలోమీటర్ల పైగా తమ సొంత టూ వీలర్ పై వెళ్లి చెకప్ చేయాల్సి ఉంటుంది. వీరికి కనీసం పెట్రోలు అలవెన్స్ లేదు. వారికి వచ్చే రూ. 9,700 జీతంతోనే పెట్రోల్ పోసుకొని డ్యూటీ చేయాలి. ఫిల్టర్ బెడ్ లో పనిచేసేవారు ఉదయం 4 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు, ఆ తర్వాత 5 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు రెండు షిఫ్ట్ ల వారీగా డ్యూటీలు చేస్తారు. మూడు షిఫ్ట్ లో చేయాల్సిన పనిని, 8 గంటల పని విధానాన్ని అమలు చేయకుండా, ఏజెన్సీలు రెండు షిఫ్ట్ లు పెట్టి12 గంటల పని భారాన్ని మోపుతున్నాయి. సేఫ్ వాల్ క్లీనింగ్ చేయాలంటే కార్మికులు నానా అవస్థలు పడాల్సిందే. 50 ఫీట్ల పొడవు, వెడల్పు, లోతుతో సేఫ్ వాల్ క్లీనింగ్ చేయాలి. ఇది ప్రమాదకరం. పనిలో భాగంగా ప్రమాదాలు జరిగితే ఏజెన్సీలు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పైప్ లైన్ డ్యామేజ్ రిపేర్ చేస్తూ జేసీబీకి తాడు కట్టి, పైపు పైకి లేపుతుంటే తాడు తెగి రాము అనే ఫిట్టర్ కు(సూర్యాపేట జిల్లాలో) నడుం విరిగింది. ఏజెన్సీలు నలుగురు చేయాల్సిన పనిని ఇద్దరితో చేయిస్తున్నాయి. సెలవులు లేవు, పీఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, వేతనాలు సకాలంలో రావు, పర్మినెంట్ ఊసే ఉండదు, ఉపాధికి గ్యారెంటీ లేదు. ఇలా భగీరథ కార్మికుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. 2021లో రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం వివిధ కేటగిరీల వారీగా ప్రభుత్వ రంగ సంస్థల లో పనిచేసే వారికి వేతనాలు పెంచింది. భగీరథ కార్మికుల జీతాలు మాత్రం పెంచలేదు. తాగు నీరందిస్తున్న కార్మికుల పట్ల ప్రభుత్వం సానుకూల వైఖరి ప్రదర్శించి ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
- గంట నాగయ్య ఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకులు