రక్తహీనతపై ఫోకస్ స్టూడెంట్ల ఆరోగ్యానికి ప్రాధాన్యత

రక్తహీనతపై ఫోకస్ స్టూడెంట్ల ఆరోగ్యానికి ప్రాధాన్యత
  • ఎనీమియా ముక్త్ తెలంగాణకు పటిష్ట చర్యలు
  • జిల్లాలో వెయ్యి మంది విద్యార్థులకు 5-6 గ్రాముల్లోపే రక్తం 
  • పౌష్టికాహార లోపాన్ని అరికట్టేందుకు ప్రణాళిక

ఆసిఫాబాద్, వెలుగు: విద్యార్థుల్లో రక్తహీనత నిర్మూలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ‘ఎనీమియా ముక్త్ తెలంగాణ’ పేరుతో కార్యక్రమం చేపట్టి విద్యార్థుల ఆరోగ్యంపై  ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఈ క్రమంలోని రక్తహీనతతో బాధపడుతున్న పిల్లల బ్లడ్​ శాంపిల్స్​సేకరించి రాష్ట్రీయ బాల స్వస్థ బృందాలు.. వారిలో హిమోగ్లోబిన్ శాతం, ఎత్తు, బరువు చూశారు. 5వ తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు రక్త పరీక్షలు చేశారు. అయితే చాలా మంది పిల్లలు రక్తహీనత సమస్యతో బాధపడుతున్నట్లు పరీక్షల్లో వెల్లడైంది. సాధారణంగా 12 గ్రాముల కంటే ఎక్కువగా ఉండాల్సిన రక్తం.. చాలా మందిలో తక్కువగా ఉన్నట్లు తేలింది. అత్యల్పంగా 5 నుంచి 6 గ్రాముల రక్తంతో జిల్లాలో వెయ్యి మంది విద్యార్థులు ఉన్నట్లు గుర్తించారు.

రక్తహీనతతో ఎదుగుదలపై ప్రభావం

శరీరంలో ఐరన్ లోపం కారణంగా రక్తహీనత ఏర్పడుతుంది. దీంతో అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. శరీరానికి ఆక్సిజన్ సరఫరా కాక పిల్లలు మానసిక, శరీరక ఎదుగుదల దెబ్బ తింటుంది. ఫలితంగా పిల్లలు శారీరక, మానసిక రుగ్మతల బారిన పడతారు. చురుకుదనం తగ్గిపోయి ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, క్లాస్​ యాక్టివిటీస్​లో పాల్లొనలేకపోతారు. ఇతర పిల్లలతో పోలిస్తే బలహీనంగా, డల్​గా కనిపిస్తారు. 

అవగాహన లేకనే సమస్యలు

ఆసిఫాబాద్​జిల్లాలోని వెనుకబడిన ప్రాంతాల్లో అవగాహన లోపం, పరిస్థితుల ప్రభావం పిల్లలకు శాపంగా మారుతోంది. గవర్నమెంట్ స్కూళ్లలో చదువుతున్న గ్రామీణ ప్రాంతాల పిల్లలే రక్తహీనతలో అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. పల్లెలు, ఏజెన్సీ ఏరియాల్లో పిల్లల ఆరోగ్యం పట్ల అధికారులు అవగాహన కల్పించకపోవడం దీనికి తోడు ప్రజల పేదరికంతో పిల్లలు నిర్లక్ష్యానికి గురవుతున్నారు. కొన్నేండ్లుగా ఈ విషయం పై పకడ్బందీ చర్యలు చేపట్టకపోవడంతోనే సమస్య పెరుగుతూ వచ్చింది.

 స్కూళ్లలో మధ్యాహ్న భోజనం సైతం నాణ్యంగా అందించకపోవడం సమస్యలకు కారణమైంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టింది. పిల్లలకు పక్కాగా పోషకాహారం అందేలా చర్యలు తీసుకుంటోంది. అంగన్వాడీలు, స్కూళ్లలో సమతుల పోషకాహారం అందిస్తోంది. కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, అడిషనల్ దీపక్ తీవారీ ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

ఆసిఫాబాద్ జిల్లాలో 5వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు విద్యార్థుల్లో ఉన్న రక్తహీనత

పరీక్షించిన మొత్తం స్టూడెంట్స్ 17,498
బాలికలు 10,994,  బాలురు 6,504
9 నుంచి 12 గ్రాములు 
బాలికలు 2,321, బాలురు 1367
7 నుంచి 8 గ్రాములు
 బాలికలు 5,135, బాలురు 2,502
5 నుంచి 6 గ్రాములు
బాలికలు 929, బాలురు 298

రక్తహీనత ఉన్న స్టూడెంట్స్​పై ప్రత్యేక దృష్టి

రక్తహీనతకు పౌష్టికాహారం లోపమే కారణం. ఈ సమస్యతో బాధపడుతున్న విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాం. ఆకుకూరలు, పండ్లు, పాలు, గుడ్లు తీసుకునేలా అవగాహన కల్పిస్తున్నాం. ఐరన్ మాత్రలు అందజేస్తున్నాం.  ఎప్పటికప్పుడు పిల్లల ఆరోగ్యంపై వాకబు చేస్తున్నాం.

డాక్టర్ నరేందర్, ఆర్ బీఎస్ కే, నోడల్ ఆఫీసర్, ఆసిఫాబాద్