
- చికిత్స పొందిన రోగులకు ఫోన్ చేసి, అందిన సేవలపై ఆరా
- కంప్లైంట్స్ ఆధారంగా సేవలను మెరుగుపర్చాలని ప్రభుత్వం నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలను మెరుగుపర్చేందుకు రాష్ట్ర సర్కారు త్వరలో ఫీడ్‌బ్యాక్ సర్వీస్‌ను అందుబాటులోకి తేనుంది. కార్పొరేట్ తరహాలో ఓపీ సమయంలో ప్రతి రోగి ఫోన్ నంబర్ తీస్కుని, చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యాక వారికి కాల్ చేసి, అందిన సేవల గురించి వివరాలు సేకరిస్తారు. వాటి ఆధారంగా సంబంధిత డిపార్ట్‌మెంట్‌లో సేవలను మెరుగుపర్చేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోనున్నారు.
అలాగే, ఆస్పత్రుల్లో ఫిర్యాదులు, సూచనల స్వీకరణ కోసం ప్రత్యేకంగా ఒక గ్రీవెన్స్ సెల్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఫోన్ ద్వారా కంప్లైంట్లను స్వీకరించేలా టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులోకి తేనున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులను కార్పొరేట్ హాస్పిటల్స్ మాదిరిగా తీర్చిదిద్దాలని గతంలో మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. అందులో భాగంగానే సర్కారు దవాఖాన్లకు బ్రాండ్ నేమ్ తీస్కురావాలని నిర్ణయించారు. ఆస్పత్రుల ఆంబియెన్స్ మార్చడంతో పాటు, వైద్య సేవలపై రోగుల అభిప్రాయాలను తెలుసుకునే ఫీడ్‌బ్యాక్ సర్వీస్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
కార్పొరేట్ స్థాయి సేవలతో సర్కారు దవాఖాన్లకు బ్రాండింగ్
ప్రభుత్వ ఆస్పత్రిలో అడుగుపెట్టగానే ఏది ఎక్కడుందో చెప్పేవారే ఉండరు. జిల్లాల నుంచి వచ్చే గ్రామీణ ప్రాంత ప్రజలకు గాంధీ, ఉస్మానియా, నిలోఫర్ వంటి పెద్దాసుపత్రుల్లో ఏది ఎక్కడుంటదో అర్థంకాదు. ఓపీ ఒక దగ్గరుంటే డాక్టర్ కన్సల్టింగ్ రూం మరో బిల్డింగ్‌లో ఉంటుంది. టెస్టులు, ల్యాబ్‌లు ఇంకో చోట ఉంటాయి. దీంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆస్పత్రుల్లో శానిటేషన్ సమస్య గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చాలా ఆస్పత్రుల్లో ముక్కుమూసుకొని టాయిలెట్లకు వెళ్లాల్సిన పరిస్థితి.
వీటన్నిటీకి చెక్ పెట్టేలా ప్రభుత్వ ఆస్పత్రులకు బ్రాండింగ్ తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు మంచి లుక్ ఉండేలా ఆస్పత్రులను తీర్చిదిద్దనుంది. రిసెప్షన్, అడ్వైజరీ సిబ్బంది, గ్రీనెన్స్ సెల్ తదితర ఏర్పాట్లను చేయనుంది. రోగులకు అడ్వైజ్ చేయడానికి ప్రత్యేక సిబ్బంది నియమించనుంది. హోదాను బట్టి సిబ్బందికి ప్రత్యేక డ్రెస్ కోడ్‌నూ కేటాయించనుంది. శానిటేషన్ కోసం ఆస్పత్రుల సూపరిండెంట్ల కింద ప్రత్యేక వ్యవస్థను తేనుంది. ఆ విధంగా వైద్య సేవలు, శానిటేషన్ సేవలు కార్పొరేట్ స్థాయిలో అందించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
ఓపీ విధానంలో మార్పులు, ఫీడ్‌బ్యాక్ సిస్టమ్ ఏర్పాటు
పేషెంట్ ఆస్పత్రిలో అడుగుపెట్టిన నుంచి డిశ్చార్జి అయ్యేంతవరకు దవాఖానలో చికిత్స ఏవిధంగా అందిందో ఫోన్ కాల్ ద్వారా తెలుసుకుంటారు. ఇందుకు ఓపీ విధానంలోనూ పలు మార్పులు చేయనున్నారు. ఓపీ టైంలోనే పేషెంట్ల నుంచి ఫోన్ నంబర్ తీసుకునే విధానాన్ని ఏర్పాటు చేస్తారు. ఆపై ఫీడ్‌బ్యాక్ టీం అదే నంబర్‌కు కాల్ చేసి డాక్టర్ కన్సల్టింగ్, టెస్టులు, సర్జరీలు, మందులు... ఇలా ప్రతీ సర్వీసు గురించి పేషెంట్‌ను అగిడి వివరాలు సేకరిస్తారు. ఏయే సర్వీసులో పేషెంట్ ఇబ్బందులు పడ్డారో నోట్ చేసుకుంటారు.
పేషెంట్ చెప్పినదాన్ని బట్టి, ఏయే విభాగాల్లో ఎక్కడ లోపం ఉందో తెలుసుకుని, మరో పేషెంట్ విషయంలో ఆ ఇబ్బందులు కలగకుండా చర్యలు తీస్కుంటారు. దీనిద్వారా ఆస్పత్రి సిబ్బందిలో పారదర్శకత పెరగడంతో పాటు రోగులకు మెరుగైన, వేగవంతమైన సేవలు అందుతాయని ప్రభుత్వం భావిస్తోంది. తొలుత ఈ ఫీడ్ బ్యాక్ సిస్టమ్‌ను కొన్ని పెద్దాస్పత్రుల్లో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేసి, అనంతరం రాష్ట్రవ్యాప్తంగా జిల్లా, ఏరియా ఆస్పత్రులకు విస్తరించాలని ప్రభుత్వం ఆలోచనలో ఉంది.