ఫస్ట్​ టైమ్ పల్లెల్లో ప్లాస్టిక్​ వేస్ట్​ మేనేజ్​మెంట్ యూనిట్లు

ఫస్ట్​ టైమ్ పల్లెల్లో ప్లాస్టిక్​ వేస్ట్​ మేనేజ్​మెంట్ యూనిట్లు
  • ఒక్కో యూనిట్​కు రూ.64 లక్షల చొప్పున 100 యూనిట్ల నిర్మాణం
  • స్వచ్ఛ భారత్ మిషన్-గ్రామీణ్​కు రూ.516.40 కోట్లు
  • గ్రామీణ ప్రాంతాల్లో 1,90,166 వ్యక్తిగత టాయిలెట్లు 
  • ఒక్కో టాయిలెట్​కు రూ.12 వేల చొప్పున రూ.228.19 కోట్లు

హైదరాబాద్, వెలుగు:ప్లాస్టిక్, బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత (ఓడీఎఫ్‌‌‌‌ ప్లస్‌‌‌‌) పల్లెలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నది. ఇందు కోసం స్వచ్ఛ భారత్​ మిషన్–గ్రామీణ్​ కు రూ.516.40 కోట్లు మంజూరు చేసింది. ఇందులో కేంద్రం వాటా 60 శాతం, తెలంగాణ ప్రభుత్వం వాటా 40 శాతం ఉంటుంది. దీనికి సంబంధించిన ఫైల్ కు మంత్రి సీత‌‌‌‌క్క శనివారం ఆమోదం తెలిపారు. గ్రామాల్లో స్వచ్ఛ భారత్​ మిషన్​(ఎస్ బీఎం) ద్వారా పలు పనులు చేపట్టేలా కార్యాచరణ రూపొందించింది. 

ఇందులో భాగంగా తొలిసారిగా గ్రామాల్లో ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌‌‌‌మెంట్ (పీడబ్ల్యూఎం) యూనిట్లు నెలకొల్పేందుకు ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. క్లస్టర్ స్థాయిలో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్లను ఏర్పాటు చేసేలా ప్లాన్ చేసింది. ఒక్కో యూనిట్ కు రూ.64 లక్షలు కేటాయించనుండగా.. మొదటి దశలో రాష్ట్ర వ్యాప్తంగా 100 యూనిట్లు స్థాపించాలని భావిస్తున్నది. ఇందుకోసం రూ.64 కోట్లు ఎస్​బీఎం నిధులను విడుదల చేసింది. ఈ యూనిట్ల నిర్మాణానికి కలెక్టర్లు అనుమతులు ఇవ్వనున్నారు. మండలాల్లో యూనిట్లను ఏర్పాటు చేసేందుకు అనువైన ప్రాంతాలను గుర్తించాలని డీఆర్డీవో లను ఆదేశించింది. ప్రతిరోజూ కనీసం 700 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను ఈ యూనిట్‌‌‌‌కు చేర వేయాలి.

 ఆయా మండలాల క్లస్టర్‌‌‌‌లోని పంచాయతీల్లో రోజూ ప్లాస్టిక్ వ్యర్థాల పరిమాణాన్ని అంచనా వేయాలి. దాని ఆధారంగా యూనిట్ల స్థాపనకు సరైన ప్రదేశాలను గుర్తించాలి. రోడ్డు కనెక్టివిటీ, విద్యుత్, నీటి సౌకర్యం ఉన్న ప్రాంతంలోనే యూనిట్ ఏర్పాటు చేయనున్నారు. యూనిట్​ కోసం అనుమతులు పొందిన తర్వాత పని మూడు దశల్లో గ్రౌండింగ్ చేసి జియో ట్యాగింగ్​చేయాలని ఆదేశించింది. ప్రతి యూనిట్​పై ఎస్​బీఎం లోగో, ట్యాగ్‌‌‌‌లైన్ పెయింట్ తో వేయనున్నారు. 

1,90,166 వ్యక్తిగత టాయిలెట్ల నిర్మాణం.. 

ఈ ఏడాది గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛ భారత్ నిధులతో వ్యక్తిగ‌‌‌‌త టాయిలెట్ల నిర్మించనున్నారు. ఒక్కో టాయిలెట్ కోసం రూ. 12 వేల  చొప్పున కేటాయించారు. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 1,90,166  వ్యక్తిగత టాయిలెట్ల కోసం రూ.228.19 కోట్లు మంజూరు చేసింది. పర్యాటక, మతపరమైన ప్రదేశాలు, పాఠశాలలు, మార్కెట్ స్థలాలు, ఆసుపత్రులు, బస్ స్టాండ్లు, మండల కేంద్రాల్లో అవసరమైన ప్రాంతాలు, జనం రద్దీని బట్టి కామ‌‌‌‌న్ సానిటేష‌‌‌‌న్ కాంప్లెక్స్ లు (సాముహిక టాయిలెట్లు) నిర్మించనున్నారు. 

ఇందుకోసం ఒక్కో కాంప్లెక్స్ కు రూ.3 ల‌‌‌‌క్షల చొప్పున కేటాయించనున్నారు. మొత్తం 410 కామన్ సానిటేషన్ కాంప్లెక్స్ ల (సీఎస్​సీ) నిర్మాణం కోసం రూ.12.30 కోట్లు మంజూరు చేసింది. వీటి నిర్మాణం కోసం 70 శాతం ఎస్​బీఎం, 30 శాతం 15వ ఆర్థిక సంఘం కేటాయించనున్నది. గ్రామాల్లో కంపోస్ట్ గుంటలు నిర్మించనున్నది. ఒక్కొక్క యూనిట్​కు రూ. రూ.1.50 లక్ష మంజూరు చేసింది. వ్యక్తిగత సోక్ పిట్ల నిర్మాణానికి ఒక్కొక్క యూనిట్ కు రూ.6,500 కేటాయించింది. 10,200 యూనిట్ల కమ్యూనిటీ సోక్ పిట్ల నిర్మించనున్నది. ఒక్కొక్క యూనిట్​కు రూ.92,747 ఖర్చు చేయనున్నది. వీటి కోసం 70 శాతం ఎస్​బీఎం(జీ), 30శాతం ఆర్థిక సంఘం నిధులు కేటాయించనున్నది.

వ్యర్థాలతో ఉత్పత్తులు..  

ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌‌‌‌మెంట్ యూనిట్లు గృహాలు, వ్యాపారాలు, రద్దీ ప్రాంతాలతోపాటు వివిధ వనరుల నుంచి  ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి వాటిని రెసిన్ గుర్తింపు కోడ్‌‌‌‌ల(ఆర్ఐసీఎస్) ఆధారంగా వివిధ రకాల వస్తువులుగా మార్చుతారు. ప్రాసెస్ చేసిన ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ లేదా ఇతర రికవరీ ప్రక్రియల ద్వారా వివిధ ఉత్పత్తులను తయారు చేస్తారు. పునర్వినియోగానికి పనికిరాని ప్లాస్టిక్ వ్యర్థాలను దహనం చేయడం గానీ, ల్యాండ్‌‌‌‌ ఫిల్లింగ్ చేయడం చేస్తారు. ప్లాస్టిక్‌‌‌‌ను రీసైక్లింగ్ చేయడంతో విలువైన వనరులు ఆదా చేయవచ్చని, ఉద్యోగ అవకాశాలను పెంపొందించవచ్చని, కాలుష్యం తగ్గించి పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడతాయని ప్రభుత్వం భావిస్తుంది.