మా ప్రాజెక్టులకు అనుమతివ్వండి: కేంద్రానికి లేఖ

మా ప్రాజెక్టులకు అనుమతివ్వండి: కేంద్రానికి లేఖ
  • మా ప్రాజెక్టులకు అనుమతివ్వండి
  • కేంద్ర జలశక్తి శాఖకు తెలంగాణ లేఖ


హైదరాబాద్‌‌, వెలుగు :ప్రాజెక్టులకు అనుమతులివ్వాలని కేంద్ర జలశక్తి శాఖను తెలంగాణ కోరింది. కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌‌ కుమార్‌‌కు ఇరిగేషన్‌‌ స్పెషల్‌‌ సీఎస్‌‌ రజత్‌‌ కుమార్‌‌ బుధవారం లేఖ రాశారు. గోదావరి నదిపై నిర్మిస్తోన్న ఆరు ప్రాజెక్టుల డీపీఆర్‌‌లను సీడబ్ల్యూసీతో పాటు జీఆర్‌‌ఎంబీకి సమర్పించామని, వాటికి వీలైనంత త్వరగా అనుమతులు ఇప్పించాలని కోరుతూ 2021 సెప్టెంబర్‌‌ 7న సీఎం కేసీఆర్‌‌ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌‌ షెకావత్‌‌కు లేఖ రాశారని ఇందులో గుర్తు చేశారు. చనాకా–కొరాట, చౌట్‌‌పల్లి హన్మంతరెడ్డి లిఫ్ట్‌‌ స్కీం, ముక్తేశ్వర్‌‌ (చిన్న కాళేశ్వరం) లిఫ్ట్‌‌ స్కీంల డీపీఆర్‌‌లను అప్రైజల్‌‌, టెక్నికల్‌‌ క్లియరెన్స్‌‌ల కోసం సీడబ్ల్యూసీ ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో గోదావరి బోర్డుకు పంపిందన్నారు.

ఏప్రిల్‌‌ 27న నిర్వహించిన గోదావరి బోర్డు 13వ మీటింగ్‌‌లో ఈ ప్రాజెక్టుల అనుమతులపై చర్చించామని, బోర్డు ఈ ప్రాజెక్టులకు పర్మిషన్‌‌లకు సంబంధించిన డీటైల్డ్‌‌ నోట్స్‌‌తో పాటు తమ అబ్జర్వేషన్స్‌‌తో కూడిన మీటింగ్‌‌ మినిట్స్‌‌ను మే నెలలో సీడబ్ల్యూసీకి సమర్పించిందన్నారు. టెక్నికల్‌‌ అడ్వైజరీ కమిటీ ఈ ప్రాజెక్టుల పర్మిషన్‌‌లపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, ఐదు నెలలు గడుస్తున్నా దీనిపై ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. వెంటనే స్పందించి ఈ మూడు ప్రాజెక్టులకు క్లియరెన్స్‌‌ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.