- మిగులు జలాల్లో వాటాలు తేలకుండానే ఏపీ ప్రాజెక్టు చేపడుతున్నదని ఫైర్
హైదరాబాద్, వెలుగు: గోదావరి–బనకచర్ల (జీబీ) లింక్ ప్రాజెక్టును అడ్డుకోవాలని కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ), గోదావరి రివర్మేనేజ్మెంట్బోర్డు (జీఆర్ఎంబీ), కృష్ణా రివర్‌మేనేజ్‌మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)ను తెలంగాణ కోరింది. పోలవరం నుంచి బనకచర్లకు రోజూ 2 టీఎంసీల చొప్పున 200 టీఎంసీలను తీసుకెళ్లేందుకు ఏపీ కసరత్తు చేస్తున్నదని, దాని వల్ల తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలుగుతుందని తెలిపింది. ఈ మేరకు సీడబ్ల్యూసీ, జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీలకు ఇరిగేషన్‌శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా బుధవారం లేఖ రాశారు. ‘‘ఏపీ నాగార్జునసాగర్కుడికాల్వను పెద్దది చేసి బొల్లాపల్లి రిజర్వాయర్‌కు నీటిని తరలించనున్నది.
అక్కడి నుంచి 31 కిలోమీటర్ల మేర టన్నెల్తవ్వి రాయలసీమ ప్రాంతంలోని పెన్నా బేసిన్‌కు తరలించేందుకు నిర్ణయం తీసుకున్నది. వాస్తవానికి 2016లోనే గోదావరి–పెన్నా అనుసంధానానికి నాటి ఏపీ సర్కార్ ప్రయత్నించింది. అందులో భాగంగా చింతలపూడి, పట్టిసీమ ఎత్తిపోతల పథకాల కోసం నిర్ణయం తీసుకుంది. దీనిపై బ్రజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌లో కేసు వేసి వాదనలు వినిపించాం. గోదావరి మిగులు జలాల్లో తెలంగాణ వాటా తేల్చేదాకా గోదావరి–-పెన్నా అనుసంధానానికి అనుమతి ఇవ్వవద్దని కోరాం” అని లేఖలో పేర్కొన్నారు. ‘‘బచావత్ ట్రిబ్యునల్ప్రకారం గోదావరి బేసిన్‌లోని 1,486 టీఎంసీలే వినియోగించుకునేలా ప్రాజెక్టులను నిర్మించారు.
తెలంగాణ, ఏపీలకు 968, 518 టీఎంసీల చొప్పున పంచారు. ఆపైన మిగులు జలాల లెక్కలను తేల్చలేదు. కానీ లెక్కలు తేలని మిగులు జలాల ఆధారంగా ఏపీ గోదావరి–బనకచర్ల లింక్ ను చేపట్టడం సరికాదు. టెక్నికల్కమిటీ అనుమతులు లేకుండా, అపెక్స్‌కౌన్సిల్‌లో ఆమోదం పొందకుండా, గోదావరి బోర్డుకు డీపీఆర్‌ను ఇవ్వకుండా ప్రాజెక్టును ముందుకుతీసుకెళ్లడం ఆక్షేపనీయం. త్వరలో బోర్డు సమావేశం ఏర్పాటు చేసి దీనిపై చర్చించాలి” అని కోరారు.
పోలవరం కుడికాల్వకు 10 వేల క్యూసెక్కులే..
జీబీ లింక్‌లో పోలవరం కుడి కాలువ సామర్థ్యాన్ని 17,500 క్యూసెక్కుల నుంచి 38 వేల క్యూసెక్కులకు పెంచాలని ఏపీ నిర్ణయించిందని.. కానీ 1980లో బచావత్ట్రిబ్యునల్ పోలవరం కుడి కాలువ సామర్థ్యాన్ని కేవలం 10 వేల క్యూసెక్కులకే అనుమతించిందని లేఖలో రాహుల్‌బొజ్జా గుర్తు చేశారు. అయితే సీడబ్ల్యూసీకి చెందిన 95వ టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ(టీఏసీ)లో మాత్రం రోజుకు 1 టీఎంసీ లేదా 12,252 క్యూసెక్కులను మాత్రమే ఈ కాలువ నుంచి తరలించడానికి టెక్నికల్అనుమతులు ఇచ్చారని చెప్పారు.
‘‘ఏపీలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యేదాకా తాత్కాలిక ఏర్పాట్లలో భాగంగా తాడిపూడి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. ఈ పథకంలోని కాలువను 80 కిలోమీటర్ల నుంచి 178 కిలోమీటర్ల దాకా విస్తరిస్తున్నారు. తాడిపూడి కెనాల్ సామర్థ్యం కూడా 1400 క్యూసెక్కుల నుంచి 10 వేల క్యూసెక్కులకు పెంచుతున్నారు. తాజా నిర్ణయాలతో శాశ్వత ప్రాజెక్టుగా తాడిపూడిని మార్చుతున్నారు” అని పేర్కొన్నారు.