
హైదరాబాద్, వెలుగు: ఏపీ అక్రమంగా చేపడుతున్న పోలవరం లిఫ్ట్ ఇరిగేషన్, గోదావరి- బనకచర్ల ప్రాజెక్టులపై చర్చించాల్సిందేనని తెలంగాణ డిమాండ్ చేసింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీకి తెలంగాణ సర్కారు తాజాగా లేఖ రాసింది. సుప్రీంకోర్టు ఆదేశాలు, కేంద్ర జలశక్తిశాఖ ఆదేశాలకు అనుగుణంగా పోలవరంతో తెలంగాణలో ముంపు ప్రభావంపై చర్చించేందుకు పీపీఏ ఈ నెల 27న ప్రత్యేకంగా ఏపీ, తెలంగాణలతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ దానికి సంబంధించిన ఎజెండాను పీపీఏకు పంపింది. అందులో ఏపీ కొత్తగా చేపట్టిన గోదావరి - బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించాలని కోరింది. ఈ ప్రాజెక్టుకు తెలంగాణ నీటి హక్కులకు భంగం కలుగుతుందని, ఈ అంశంపై చర్చించాలని తెలిపింది.