![ప్లీజ్.. అప్పు ఇవ్వండి..కేంద్రానికి రాష్ట్ర సర్కార్ మరో లెటర్](https://static.v6velugu.com/uploads/2022/05/Telangana-government-letter-to-the-Center_CgJ3puyMit.jpg)
హైదరాబాద్, వెలుగు: అప్పు కోసం రాష్ట్ర సర్కార్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఎంతో కొంత అప్పుకోసం అనుమతి ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఆర్బీఐ బాండ్ల వేలంలో పాల్గొనేందుకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖకు బుధవారం రాష్ట్ర ఆర్థిక శాఖ లేఖ రాసింది. ఏప్రిల్లో రూ.3 వేల కోట్లు తీసుకోలేకపోయామని, ఈ నెలలో బాండ్ల వేలం ద్వారా రూ.8 వేల కోట్లు సేకరించుకోవాల్సి ఉన్నా.. అనుమతి ఇవ్వకపోవడంతో అప్పు పుట్టడం లేదని సర్కారు ఆ లేఖలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర బడ్జెట్లోని రూ.2.56 లక్షల కోట్లలో అవసరాల దృష్ట్యా పలు పథకాల అమలుకు రూ.59,632 కోట్లను అప్పుల ద్వారా సమీకరించుకునేందుకు బడ్జెట్ పెట్టుకున్నామని, ఇప్పుడు అప్పు ఇవ్వకుంటే వాటిపై ఆధారపడిన పనులన్నీ ఆగిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నట్టు సమాచారం. గతంలో ఆర్బీఐకి ఇచ్చిన ఇండెంట్ ప్రకారం ఈ నెల 31న రూ.3 వేల కోట్లను అప్పుగా తీసుకోవాల్సి ఉందని, కనీసం వాటికైనా అనుమతినివ్వాలని కోరినట్టు తెలుస్తోంది. గ్యారంటీ రుణాలు, ఇతరత్రా వాటిపై ఎలాంటి దాపరికాలు లేకుండా పూర్తి సమాచారం ఇస్తున్నామని, రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని లేఖలో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. ఏపీ, జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానా, పంజాబ్ వంటి రాష్ట్రాలకు లోన్లు ఇస్తున్నారని, తెలంగాణకూ అవకాశం ఇవ్వాలని కోరినట్టు చెబుతున్నారు.
రైతుబంధు ఉండటంతోనేనా?
వచ్చే నెల నుంచి ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానుంది. జూన్ మొదటి వారం నుంచే రైతులకు రూ.5 వేల చొప్పున రూ.7400 కోట్లు రైతుబంధు సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగులకు జీతాలిచ్చేందుకు చాలా టైం తీసుకుంటోంది. ఫస్ట్ తారీఖుకే జీతాలు ఇవ్వాల్సి ఉన్నా.. 15 రోజులు ఆలస్యంగా ఇస్తోంది. ఇటు ఐఏఎస్ల జీతాలూ ఐదో తేదీ తర్వాతే జమ అవుతున్నాయి. వాటికి తోడు రైతుబంధునూ ఇవ్వాల్సి ఉండడంతో నిధుల సమీకరణ తలకు మించిన భారంగా మారింది. జూన్లో ఇంకో రూ.4 వేల కోట్లకు సర్కార్ ఇండెంట్ పెట్టుకుంది. ఈ నెలతోనే ఈ ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్ ముగుస్తుంది. దీంతో ఈ నెలలో రూ.3 వేల కోట్లు అప్పుగా తీసుకుంటే జీతాలకు కొంత సర్దుబాటు చేసి.. మిగతా నిధులను రైతుబంధుకు ఇవ్వాలని రాష్ట్ర సర్కార్ యోచిస్తోంది. దాంతో పాటు జూన్ నుంచే దళితబంధు పథకాన్ని మొదలు పెట్టాలని భావిస్తుండడంతో అప్పు కోసం రాష్ట్ర సర్కార్ మరోసారి కేంద్రానికి విజ్ఞప్తి చేసిందని తెలుస్తోంది.
వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సులు
ఆర్బీఐ బాండ్ల వేలం, గ్యారంటీ రుణాల విషయంలో పర్మిషన్ రాకపోవడంతో.. వేస్ అండ్మీన్స్ అడ్వాన్సులు తీసుకోవాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. వేస్ అండ్ మీన్స్ కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.1,728 కోట్లు అడ్వాన్సులుగా తీసుకునేందుకు లిమిట్ ఉంది. ఓవర్ డ్రాఫ్ట్ కింద జూన్లో మరో రూ.2 వేల కోట్లు సమకూర్చుకునేలా ప్లాన్ చేసినట్టు ఆఫీసర్లు చెప్తున్నారు. దీనికి ఆర్బీఐ ఓకే చెప్పాల్సి ఉంటుంది. ఇవి బడ్జెట్ పరిధిలో ఉండవు. గ్యారంటీలతోనూ సంబంధం ఉండదు.