- 9న సోనియా గాంధీ బర్త్‌డే సందర్భంగా ఇచ్చేందుకు ప్లాన్
- గత ప్రభుత్వ హయాంలో బెనిఫిషర్స్ లిస్టు తయారీ..
- ఇప్పుడు ముంపు బాధితులకు ప్రయార్టీ ఇస్తూ కొత్త లిస్ట్!
- పాతలిస్టులో పేరున్న లబ్ధిదారుల్లో ఆందోళన
భద్రాచలం, వెలుగు : భద్రాచలంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల్లో టెన్షన్ నెలకొంది. గత ప్రభుత్వ హయాంలో తయారు చేసిన లిస్టు ప్రకారం కాకుండా కొత్త లిస్టు రెడీ చేస్తున్నారనే ప్రచారంతో పలువురు లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పుడు ముంపు బాధితులే ప్రయార్టీగా లిస్టు తయారు చేస్తున్నట్లు సమాచారం. కాగా డిసెంబరు 9న సోనియా గాంధీ బర్త్ డే సందర్భంగా డబుల్ ఇండ్ల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇటీవల రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భద్రాచలంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించారు. ఏఎంసీ కాలనీలో 106, మనుబోతుల చెరువు ప్రాంగణంలో 144 మొత్తం 250 ఇండ్లు నిర్మాణం తుదిదశలో ఉంది. వీటిని పంపిణీకి సిద్ధం చేయాలని మంత్రి ఐటీడీఏ ట్రైబల్ వెల్ఫేర్ ఇంజినీర్లను ఆదేశించారు. తొలుత 150 ఇండ్లను రెడీ చేస్తామని వారు మంత్రికి హామీ ఇచ్చారు. వాటి పనులు చకచక జరుగుతున్నాయి.
నాటి గ్రామసభలో ఇలా...!
రెండేండ్ల కింద భద్రాచలంలో గ్రామసభ నిర్వహించిన అనంతరం బెనిఫిషర్స్ లిస్టు ఫైనల్ చేశారు. 117 ఇండ్లను ముందుగా ఇవ్వాలని నిర్ణయించారు. దివ్యాంగులకు 15, క్యాన్సర్ పేషెంట్లకు 4, మిగిలిన 98 ఇళ్లను ఎస్టీలకే ఇవ్వాలని నిర్ణయించారు. కానీ నాటి బీఆర్ఎస్ సర్కారు హయాంలో లిస్టును ఆ పార్టీ నాయకులే కొందరు అడ్డుకున్నారు. తాము సూచించిన లబ్ధిదారులకే ఇండ్లు ఇవ్వాలని పట్టుబట్టడంతో అక్కడితో ఆ కార్యక్రమం ఆగిపోయింది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఇండ్లను నిరుపయోగంగా ఉంచకూడదని పంపిణీకి చర్యలు చేపట్టింది.
Also Read :- మల్లన్న ఆలయంలో మరో వివాదం
కానీ పాత లిస్టును పక్కనపెట్టి మరో లిస్టు ప్రకారం బెనిఫిషర్లను ఎంపిక చేస్తున్నారనే ప్రచారంతో గతంలో ఎంపికైన వారు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల వరదల కారణంగా తరుచూ ముంపునకు గురవుతున్న కాలనీ వాసులకు డబుల్‌బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించాలని ఆఫీసర్లు యోచిస్తున్నారు. అయ్యప్పకాలనీ వెనుక భాగంలో 47 మందికి, అశోక్నగర్కొత్తకాలనీలో 32 మందికి, అంబసత్రం వద్ద ముగ్గురు ముంపు బాధితులకు కొత్తగా డబుల్‌బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కానీ ముంపు బాధితులు మాత్రం తమకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వద్దని, ఇంటి స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆగిన నిర్మాణాలకు అడిషనల్ఫండ్స్..
అర్ధంతరంగా నిలిచిపోయిన నిర్మాణాలను కొనసాగించేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అడిషనల్ ఫండ్స్ రిలీజ్ చేశారు. వీటితో 250 ఇళ్లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. విద్యుత్ మీటర్లు, లైన్లు, కరెంట్, తాగునీటి వసతికి నల్లాలు ఏర్పాటు ఇతర సౌకర్యాల కల్పనకు రూ.4కోట్లు రిలీజ్ చేశారు. 250 ఇండ్లను పూర్తిచేసి బెనిఫిషర్లకు అందజేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.
ఇంకా నిర్ణయించలేదు
డబుల్బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ విషయమై నేటికీ ఇంకా ఏమీ నిర్ణయించలేదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పంపిణీ ప్రక్రియ ఉంటుంది. ప్రజెంట్ కొన్ని ఇండ్లను రెడీ చేస్తున్నారు. తుది దశలో ఉన్న ఇండ్లకు పెండింగ్‌పనులు పూర్తి చేస్తున్నారు.
శ్రీనివాస్, తహసీల్దారు, భద్రాచలం