- రాజకీయ బెదిరింపులు, దాడుల నేపథ్యంలో సర్కారు నిర్ణయం
- ఇప్పటికే ఉన్న సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగులపై రాజకీయ నాయకులు బెదిరింపులకు పాల్పడినా.. దాడులు చేసినా కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులను భయబ్రాంతులకు గురి చేయడమే కాకుండా.. విధులను ఆటంకపరుస్తూ దాడులకు దిగే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది. ఉద్యోగులను బెదిరించేలా పొలిటికల్ లీడర్లు చేస్తున్న కామెంట్స్‌ను కూడా ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నది. అవమానకరంగా, అభ్యంతరకరంగా మాట్లాడటంపైనా ఏ రకంగా ముందుకు వెళ్లాలనే దానిపై రిపోర్ట్ ఇవ్వాలని ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు సమాచారం. లగచర్ల, దిలావర్పూర్ ఘటనలతోపాటు జిల్లా కలెక్టర్ పట్ల మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అవమానకరంగా, ఇష్టారీతిన మాట్లాడిన దానిపై ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఉద్యోగులకు భరోసాగా ఉండేలా చర్యలు తీసుకోనున్నట్టు సమాచారం.
సర్కారు సీరియస్
రాష్ట్ర ప్రభుత్వంలో విధులు సరిగ్గా నిర్వర్తించకుండా ఉద్యోగులను ఎవరైనా బెదిరింపులకు గురిచేస్తే వారిపై యాక్షన్ తీసుకునేందుకు అవకాశం ఉన్నది. కేసులు నమోదు చేసి.. రెండేండ్లపాటు జైలు శిక్ష లేదా జరిమానా లేదంటే రెండూ అమలు చేయొచ్చు. ఇటీవల మాజీ మంత్రి కేటీఆర్.. జిల్లా కలెక్టర్ ను సన్నాసి అంటూ మాట్లాడారు. అదే సమయంలో ఉద్యోగులను గుర్తు పెట్టుకుంటామని.. తమ ప్రభుత్వం వచ్చాక సంగతి తేలుస్తాం అంటూ హెచ్చరిస్తున్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉద్యోగుల విషయంలో కామెంట్స్ చేశారు.
కాకపోతే జాగ్రత్తగా పనిచేసుకోవాలని, తప్పులు చేయొద్దని, అలా చేస్తే తాము వచ్చాక చర్యలు ఉంటాయని అన్నారు. కానీ ఇప్పుడు కేటీఆర్ ఏకంగా బెదిరించేలా మాట్లాడడంపై అటు ఉద్యోగ సంఘాలు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే కలెక్టర్ పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఐఏఎస్, ఐపీఎస్ సంఘాలతోపాటు ఉద్యోగ సంఘాలు ఖండించాయి. ఇక లగచర్ల, దిలావర్పూర్ ఘటనలపైనా ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నది. ఇప్పటికే లగచర్ల ఇష్యూలో కేసులు నమోదు చేయడంతోపాటు అరెస్ట్‌లు కూడా చేసింది. భూసేకరణ మాత్రమే కాకుండా ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాల్లో అధికారులపై దాడులు చేయకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తున్నది.