ఓయూ దుస్థితికి కారకులెవరు?

తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యకు తలమానికం ఉస్మానియా యూనివర్సిటీ. ఈ సమాజానికి ఎంతో మంది మేధావులు, రాజకీయనాయకులు, శాస్త్రవేత్తలను అందించడంలో కీలక భూమిక పోషిస్తోంది. అటువంటి యూనివర్సిటీ నేడు ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అనాలోచిత నిర్ణయాల వలన కునారిల్లుతుంది. ఓయూను విద్యా, పరిశోధన రంగాల్లో మేటిగా నిలపడం పాలన వ్యవస్థను గాడిలో పెట్టడం వలన ఓయూ పునర్ వైభవం దిశగా దూసుకెళ్తుంది అని ఇటీవల ఒక పత్రికలో వీసీ వ్యాసం రాసారు. ఇందులోని అంశాలు ఒకటి అర మినహా అన్ని అసత్యాలు, అర్థ సత్యాలతో కూడుకున్నవి. ఆయన పదవీ బాధ్యతలు చేపట్టిన రెండు సంవత్సరాలుగా అందుకు భిన్నంగా పాలన సాగించారు. వర్సిటీలో విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా తన సొంత ఎజెండా అమలు చేయడానికి అధికారాన్ని అడ్డుపెట్టుకున్నారు. విద్యార్థులకు ఏనాడు తరగతి గదిలో పాఠాలు బోధించలేదు. విద్యార్థుల ఫీజులు భారీగా పెంచారు, కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు, పరిశోధనలు కుంటుపడేలా చేశారు.  పరిశోదన విద్యార్థులకు ఫెలోషిప్​లు లేవు. పరిశోధనలకు కాలపరిమితి విధించి విద్యార్థుల  అడ్మిషన్లు రద్దు చేయడం. తక్షుల పేరిట నిధుల వృధా.  ఒకరకంగా వర్సిటీని నిర్వీర్యం చేశారు. తిరిగి మళ్లీ ఆయనే వర్సిటీ పునర్ వైభవం అంటూ  రాస్తున్నారు. కానీ ఇంతకు ముందు వీసీ లు అలా కాకుండా మొదట అవర్లోనే క్లాస్ రూములో విద్యార్థులకు పాఠం బోధించి ఆ తరువాత పాలన వ్యవహారాలలో నిమగ్నమయ్యేవారు. ఆ విధంగా తన తోటి ఆచార్యులకు కూడా మార్గదర్శకంగా నిలిచేవారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు.

భారంగా ఫీజుల పెంపు

ఓయూలో  విద్యార్థుల ఫీజులను భారీగా పెంచారు. ప్రస్తుతం యూనివర్సిటీ లో అమలులో ఉన్న ఫీజులను ఒకేసారి పదింతలుగా  పెంచారు. ఈ  ఫీజులు ప్రయివేట్ కాలేజీలు, యూనివర్సిటీలలో ఉన్నవిధంగా ఉన్నాయి. దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రభుత్వ యూనివర్సిటీలో ఫీజులు పెంచడం అనేది పరోక్షంగా ప్రయివేట్ యూనివర్సిటీ లను ప్రోత్సహించడమే అవుతుంది. అందువలన గ్రామీణ ప్రాంతాల నుండి ఓయుకు చదువుకోవడానికి వచ్చే పేద విద్యార్థులకు ఈ నిర్ణయం  ఆశనిపాతమైంది. కావున వెంటనే యూనివర్సిటీ యాజమాన్యం ఫీజుల పెంపు విషయంలో మొండిగా పోకుండా పునరాలోచించి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. 

విస్మరణకు గురవుతున్న పరిశోధన

మేము పరిశోధనలకు పెద్ద పీట వేస్తున్నామని చెప్పుకోవడం కాదు నాణ్యమైన పరిశోధనలు జరగాలంటే  విద్యార్థులకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించాలి. యూనివర్సిటీలో నాణ్యమైన పరిశోధనలు జరగాలి అవి సమాజానికి ఉపయోగపడేవిధంగా ఉండాలి. కానీ ఓయూలో పరిశోధన విద్యార్థులకు గత రెండు సంవత్సరాలుగా ఎటువంటి ఫెలోషిప్ లు ఇవ్వకపోవడం వలన  వారు తమ పరిశోధనలు సకాలంలో పూర్తిచేయలేకపోతున్నారు. కానీ పరిశోధన  విద్యార్థులంతా ఖచ్చితంగా వారి కాలపరిమితి లోనే తమ పరిశోధనలు పూర్తి చేయాలి లేదంటే అడ్మిషన్లు రద్దు చేస్తామని వీసీ సర్క్యులర్ జారీ చేయడంతో  చేసేదేమీ లేక కొందరు తమ పరిశోధనలు పూర్తిచేశారు. కానీ ఇంకా వందల మంది తమ పరిశోధనను పూర్తి చేయలేకపోయారు. దానితో వారి అడ్మిషన్లు రద్దు అయ్యాయి. ఇటువంటి అనాలోచిత నిర్ణయాల వలన నాణ్యమైన పరిశోధనలు జరుగకపోగా అసలు పరిశోధనల ఉద్దేశ్యం నీరుగారే ప్రమాదం ఉంది.  ఇది తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించడమే. 

బ్లాక్ గ్రాంట్ నిధులు తీసుక రావడంలో విఫలం

ప్రభుత్వం నుండి యూనివర్సిటీ కి రావాల్సిన బ్లాక్ గ్రాంట్ నిధులు వర్సిటీకి తేవడంలో వీసీల వైఫల్యం ఉంది. తెలంగాణ వ్యాప్తంగా వర్సిటీలు నేడు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీకి ప్రభుత్వం నుండి ప్రతి నెల ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్లకు మాత్రమే నిధులు విడుదల చేస్తుంది. కానీ వర్సిటీ అభివృద్ధికి అంతర్గత నిధులతోనే కాలం వెళ్లదీస్తున్నాయి.  ప్రభుత్వం వర్సిటీలకు ఇవ్వాల్సిన బ్లాక్ గ్రాంట్ నిధులు ఇచ్చి  యూనివర్సిటీలని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. వాటిని ప్రభుత్వంతో కొట్లాడి తెచ్చుకునే పని వీసీలపై ఉంది. 

పోలీసు పహారాలో వీసీ పాలన

వీసీ చాంబర్ ముందు నిత్యం ఇరవై మంది సెక్యూరిటీ గార్డ్సు, పది మంది పోలీసులను కాపలా పెట్టుకొని పాలన సాగించడం బాగాలేదు. పహారాలో పాలన చేసే అవసరం ఏమొచ్చింది? ఇంతకు ముందు వీసీలు ఎవరూ ఇలా చేయలేదు. విద్యార్థులు, అధ్యాపకుల సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత వీసీ భుజస్కంధాలపై ఉంది. కానీ సమస్యలు పరిష్కరించాల్సిన వారే పట్టించుకోకపోతే వర్సిటీ ఎలా అభివృద్ది చెందుతుంది? ఓయూలో  పరిస్థితులు ఈవిధంగా ఉంటే పునర్ వైభవం అంటూ ప్రచారాలు చేసుకోవడం హాస్యాస్పదమే అవుతుంది. దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న తెలంగాణ రాష్ట్రంలో ఓయూ దుస్థితి ఈ విధంగా ఉంటుందని ఎవరూ ఊహించి ఉండరు. తెలంగాణ తెచ్చుకున్నది అధికారం కోసం మాత్రమే కాదు, విద్యా వైద్యంలో మనం మొదటి స్థా నంలో ఉండాలనే    . కానీ తెచ్చుకున్న తెలంగాణ ఇవాళ అలా లేదనేందుకు ఓయూ పరిస్థితే అందుకు నిదర్శనం. 

నిధులు, స్టాఫ్ ఉండని  రీసెర్చ్ సెంటర్లు

ఓయూ లో రీసెర్చ్ సెంటర్ల ను చూస్తే ఒకింత బాధ కలుగుతుంది. ప్రాంతీయ పట్టణ పర్యావరణ అధ్యయన కేంద్రం  ఓయూలో ని ఒక రీసెర్చ్ సెంటర్. తొమ్మిది రాష్ర్టాల కు చెందిన  దీని ప్రాంతీయ కార్యాలయం ఓయూలో ఉంది. ఇక్కడ పట్టణ పర్యావరణ సంబంధిత సమస్యల పరిష్కారాల కై మునిసిపల్  సిబ్బందికి శిక్షణ ఇవ్వడమే కాకుండా, పరిశోధనలు కూడా చేపడతారు. ఈ సెంటర్ కు నిధులు గ్రాంట్ల రూపంలో కేంద్రంలోని మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ నుండి వస్తాయి.   అయినా కొందరు  ఉద్యోగులను తొలగించారు.  ఇది ఇలా ఉంటే ఈ మధ్యనే ఓయూలో మూడు కొత్తగా రీసెర్చ్ సెంటర్లు నెలకొల్పారు. కానీ ఈ సంస్థలకు నిధులు లేవు. కేవలం అలంకార ప్రాయంగా మాత్రమే వాటికి బోర్డులు తగిలించారు. అక్కడ సిబ్బంది కూడా లేరు. ఇది ఓయూలో రీసెర్చ్ సెంటర్ల వాస్తవ  పరిస్థితి. 
- డా. పెంట కృష్ణ,ఉస్మానియా యూనివర్సిటీ