- జరిమానా, బ్యాంకు గ్యారెంటీ, ఇద్దరు ష్యూరిటీలతో వడ్ల కేటాయింపు
- బీఆర్ఎస్ పాలనలోని పాత పద్ధతులకు స్వస్తి
- కొత్త మార్గదర్శకాలు జారీ చేసిన రాష్ట్ర సర్కారు
నిజామాబాద్, వెలుగు: కస్టమ్ మిల్లింగ్ కోసం తీసుకున్న వడ్లు పక్కదారి పడితే ఊరుకోమంటూ కాంగ్రెస్ సర్కారు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. రెండేండ్లలో ఒక్కసారికి మించి వడ్లను మాయం చేస్తే జరిమానాలు విధిస్తామని తెలిపింది. ఇందు కోసం బ్యాంకు గ్యారెంటీని, ఇద్దరి ష్యూరిటీలతోనే కొత్తగా సీఎంఆర్ వడ్లు కేటాయించాలని ఆదేశించింది.
డిఫాల్టర్ అయితే ఇక కష్టమే
జిల్లాలో చిన్నా పెద్ద కలిపి 203 రైస్ మిల్స్ ఉన్నాయి. వాటి కెపాసిటీని ప్రామాణికంగా తీసుకొని ఖరీఫ్, యాసంగి సీజన్లో సీఎంఆర్ వడ్లను కేటాయిస్తారు. వడ్లను రైస్‌గా చేసి గవర్నమెంట్‌కు పంపడానికి కస్టం మిల్లింగ్ ఛార్జ్‌ను చెల్లిస్తారు. ఖరీఫ్‌లో ప్రతి క్వింటాల్ వడ్లకు 68 కిలోల బియ్యం, యాసంగి సీజన్లో 67 కిలోల చొప్పున విధిగా పంపాలి. సీఎంఆర్ సేకరణకు ప్రతి సీజన్లో సర్కారు గడువు విధిస్తుంది.
కేవలం మిల్లింగ్ ఛార్జ్ కోసం తీసుకునే వడ్లను కొందరు మిల్లర్లు ఏకంగా మార్కెట్లో అమ్మేస్తున్నారు. తర్వాత మరోసీజన్లో ఇబ్బంది లేకుండా కొత్త కేటాయింపులు పొందుతున్నారు. వాటి తాలూకు రైస్ ఎఫ్‌సీఐ గోదాంకు చేరే దాకా భరోసా లేదు. ఈ రకంగా జనవరి 2024 నాటికి తొమ్మిది మంది రైస్ మిల్లర్లు రూ. 52.88 కోట్ల విలువ 2.44 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు మాయం చేశారు.
వారందరిపై ఆర్ఆర్ యాక్ట్ కింద పోలీస్ కేసులు నమోదయ్యాయి. మరో 30 మంది మిల్లర్ల నుంచి నిరాశాజనకంగా రైస్ సప్లై నడుస్తోంది. గత బీఆర్ఎస్ సర్కారు ఆధ్వర్యంలోని కొన్ని విధానాలు అవినీతికి మూల కారణమయ్యాయి. ఇక నుంచి లొసుగులకు చాన్స్ లేకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ పాలసీ రూపొందించింది. దీని ప్రకారం ఒకసారికి మించి తప్పు చేసే మిల్లర్లకు షరతులు విధించి సీఎంఆర్ వడ్లు పంపుతారు.
రెగ్యూలర్‌గా ఉంటే ఇబ్బంది లేదు
క్రమం తప్పకుండా సీఎంఆర్ రైస్ అప్పగించే మిల్లర్లకు ఏ ఢోకా లేదు. వారికి గవర్నమెంట్ అండదండ ఉంటుంది. రెండేండ్ల కాలంలో ఏదైనా కారణంతో ఒక సీజన్ రైస్ సకాలంలో పంపనట్లయితే వాటిని రాబట్టుకునే దాకా ఆఫీసర్లు వదలరు. రెండోసారి వడ్లు కేటాయించుకోడానికి మిల్లర్ బ్యాంకు గ్యారెంటీ ఇవ్వాలి. ప్లస్ రైస్ మిల్లర్ల అసోసియేషన్ నుంచి ఇద్దరు మిల్లర్లు ష్యూరిటీ ఉండాలి. రైస్ కూడా 125 అప్పగించాలి. అంటే వంద కిలోల బియ్యం ఇవ్వాల్సిన చోట 125 కిలోలు గవర్నమెంట్‌కు ఇవ్వాల్సి ఉంటుంది.
మిల్లర్లకు నోటీసులు
గవర్నమెంట్ రూపొందించిన కొత్త ఆర్డర్స్ అందుకున్న సివిల్ సప్లయి ఆఫీసర్లు స్లో మిల్లింగ్ చేస్తున్న 30 మందికి శుక్రవారం నోటీసులు ఇచ్చారు. డిఫాల్టర్ కింద పడితే ఏం జరుగుతుందో చెబుతున్నారు. 2023-– 24 ఖరీఫ్ సీజన్ రైస్ సేకరణ స్పీడప్ చేశారు. 3.21 మెట్రిక్ టన్నుల బియ్యంలో ఇప్పటికి 1.05 టన్నులు సేకరించారు. మిగితా వాటిని సెప్టెంబర్ గడువుతో పూర్తి చేసి యాసంగి బియ్యం కలెక్ట్ చేయడానికి ప్లాన్ ప్రిపేర్ చేశారు.