10 లక్షల ఎల్​ఆర్​ఎస్ అప్లికేషన్లు .. చెరువు, సర్కారు జాగాలో ప్లాట్స్ వే

10 లక్షల ఎల్​ఆర్​ఎస్ అప్లికేషన్లు .. చెరువు, సర్కారు జాగాలో ప్లాట్స్ వే
  • మిగతా అప్లికేషన్ల ప్రాసెస్ స్పీడప్
  • అప్లికేషన్ రిజెక్ట్ అయితే చెల్లించిన ఫీజు వాపస్
  • సబ్ రిజిస్ట్రార్ లకు ఎల్ఆర్ఎస్ లింకప్  
  • నేటి నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో లే అవుట్ రెగ్యులరైజేషన్(ఎల్ఆర్ఎస్)కు దరఖాస్తు చేసిన ప్లాట్లలో 10 లక్షల వరకు చెరువులు, ప్రభుత్వ భూముల్లోనే ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎల్​ఆర్​ఎస్​ కోసం మొత్తం 25 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో 40 శాతానికి పైగా ప్లాట్లు ఇలా చెరువు శిఖాలు, ప్రభుత్వ భూముల్లోనే ఉండడం గమనార్హం. ఈ తరహా ప్లాట్ల లెక్కతేల్చే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. ప్లాట్లు ప్రభుత్వ భూమిలో ఉంటే రెవెన్యూ, చెరువు ఎఫ్ టీఎల్ కు 200 మీటర్లు పరిధిలో ఉంటే ఇరిగేషన్ శాఖకు పంపాలని అధికారులను ఆదేశించింది. అలాగే ఈ రెండు కేటగిరీల వారీగా అప్లికేషన్లను డివైడ్ చేసి సర్వే నంబర్లతో సహా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్(సీజీజీ)కు పంపాలని తెలిపింది.

మార్చి 31లోపు చెల్లిస్తే 25 శాతం రాయితీ

ఫీల్డ్ వెరిఫికేషన్ అవసరం లేకుండా రూల్స్​ప్రకారం ఉన్న దరఖాస్తులను అధికారులు వెంటనే క్లియర్ చేస్తున్నారు. వాటికి తరువాతి(సెకండ్) చార్జీలను ఆటోమేటిక్ గా జనరేట్ చేయనున్నారు. ఇటీవల జారీ చేసిన జీవో28 ప్రకారం సెకండ్ ఫీజును మార్చి 31లోపు చెల్లిస్తే 25 శాతం రాయితీ ఇవ్వనున్నారు.  రూల్స్​ప్రకారం ఉన్న ప్లాట్లను  సోమవారం నుంచి  రిజిస్ట్రేషన్​ చేయనున్నట్టు అధికారులు తెలిపారు.  ఇందు కోసం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. మున్సిపాలిటీల్లో మొత్తం 14,56,762 అప్లికేషన్లు ఉండగా ప్రభుత్వ ఉత్తర్వులకు ముందు 4.80 లక్షల అప్లికేషన్లు క్లియర్ అయ్యాయి. గత ఐదురోజుల్లో 20 వేల అప్లికేషన్లు క్లియర్​ అయ్యాయని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు.