
- సబ్సిడీలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది
- బ్యాంకర్లతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం అమలు చేస్తున్న స్వయం ఉపాధి పథకాలకు లోన్లు ఇవ్వాలని బ్యాంకర్లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు. రాష్ట్ర అభివృద్ధిలో బ్యాంకర్ల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి పథకాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నదన్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ పదేండ్లు సంక్షేమ కార్పొరేషన్లను నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. సబ్సిడీలు, మార్జిన్ మనీ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని తెలిపారు.
ప్రజాభవన్‌లో శుక్రవారం స్టేట్ లెవల్ బ్యాంకర్ల సమీక్షా సమావేశం జరిగింది. మంత్రి తుమ్మలతో కలిసి భట్టి విక్రమార్క పాల్గొని మాట్లాడారు. ‘‘నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలి. రూ.6 వేల కోట్ల విలువైన ఉపాధి పథకాలను ఆదివారం రేవంత్ రెడ్డి వనపర్తిలో ప్రారంభిస్తారు. దావోస్లో రూ.1.80 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. వ్యవసాయ రంగానికి బడ్జెట్లో రూ.52వేల కోట్లు కేటాయించినం. రూ.22 వేల కోట్ల రైతుల రుణాలు మాఫీ చేసినం.
రుణమాఫీతో రైతులు, బ్యాంకర్లకు మేలు జరిగింది. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నం. వెయ్యి మెగావాట్ల ఉత్పత్తే లక్ష్యంగా సోలార్ కంపెనీలతో ఎంవోయూ కుదుర్చుకున్నం. మహిళలను ప్రోత్సహించేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలి’’అని భట్టి అన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రూ.22 వేల- కోట్ల పంట రుణాలు మాఫీ చేసినప్పటికీ.. బ్యాంకర్లు టార్గెట్ చేరుకోకపోవడం అగ్రికల్చర్ సెక్టార్కు ఇబ్బందిగా మారుతున్నదని అన్నారు.
మూడెకరాలలోపు రైతులకు రైతు భరోసా నిధులు..
మూడెకరాలలోపు రైతు భరోసా లబ్ధిదారుల వివరాలను గ్రామాల్లో ఫ్లెక్సీల ద్వారా ప్రదర్శించాలని అధికారులను భట్టి విక్రమార్క ఆదేశించారు. మూడు ఎకరాల వరకు సాగు భూమి ఉన్న అన్నదాతలకు రైతు భరోసా నిధుల విడుదల ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలన్నారు. శుక్రవారం ప్రజాభవన్‌లో వ్యవసాయ శాఖల అధికారులతో భట్టి సమీక్ష నిర్వహించారు. లబ్ధిదారుల వివరాలు గ్రామ కూడళ్లలో అందరికీ కనిపించేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని భట్టి సూచించారు.