
- క్లస్టర్ల వారీగా పంటలపై రిపోర్టు ఇవ్వాలని వ్యవసాయ శాఖ ఆదేశాలు
- ఫీల్డ్ లెవెల్‌లో వివరాలు సేకరిస్తున్న ఏఈవోలు
- పంటలను కాపాడేందుకు జిల్లాల్లో స్పెషల్ టీమ్‌లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎండల తీవ్రతకు పంటలను కాపాడేందుకు సర్కారు ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎక్కడెక్కడ పంటలు ఎండుతున్నాయో నివేదిక ఇవ్వాలని వ్యవసాయ శాఖను ఆదేశించింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో ఏఈవోలు వివరాలు సేకరిస్తున్నారు. యాసంగిలో నీటి వసతి లేని చోట ఆరు తడి పంటలకు బదులు వరి సాగు చేయడం వల్లే పలు ప్రాంతాల్లో పంటలు ఎండుతున్నాయని అధికారులు అంచనాకు వచ్చారు. రాష్ట్రంలో ఈ యాసంగిలో 73.65 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి.
ఇందులో ఏకంగా 56.13 లక్షల ఎకరాల్లో వరి వేశారు. నిరుటితో పోలిస్తే మొత్తం సాగులో 8 లక్షల ఎకరాలు పెరగగా, 5 లక్షల ఎకరాల్లో వరి అదనంగా సాగైంది. మార్చిలోనే ఎండలు మండుతుండడం, భూగర్భ జలాలు అడుగంటడంతో బావులు, బోర్ల కింద వేసిన వరి పంట ఎండుతోంది. పలుచోట్ల ఆయకట్టు చివరి భూముల్లోనూ ఈ పరిస్థితి ఉందని ఆఫీసర్లు చెప్తున్నారు. ఫీల్డ్ లెవల్‌లో సర్వే తర్వాత దీనిపై మరింత క్లారిటీ రానుంది. గ్రామాలు, క్లస్టర్ల వారీగా ఎండుతున్న పంటల వివరాలు పంపించాలని శనివారం క్షేత్రస్థాయి అధికారులను వ్యవసాయ శాఖ ఆదేశించింది. దీంతో ఏఈవోలు తమ క్లస్టర్ పరిధిలోని గ్రామాల్లో నీటి వసతులు, వరి సాగు తదితరాలపై వివరాలను సేకరించి గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా రిపోర్టును వ్యవసాయ శాఖకు అందించనున్నారు.
పంటలు ఎండకుండా ప్రత్యేక టీమ్‌లు..
ఎండల తీవ్రత, నీటి ఎద్దడి నేపథ్యంలో వరి పొలాలు ఎండకుండా చర్యలు తీసుకోవాలని సీఎస్ శాంతి కుమారి ఆదేశించారు. ఈ మేరకు మార్చి 3న కలెక్టర్లు, ఇరిగేషన్ ఇంజనీర్లు, జిల్లా అగ్రికల్చర్ , హార్టీకల్చర్ ఆఫీసర్లతో వీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు. యాసంగిలో సాగైన వరి పంటకు నీటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఎప్పటికప్పుడు గ్రౌండ్ లెవల్‌లో పరిస్థితిని సమీక్షించాలన్నారు. మండల స్థాయిలో తహసీల్దార్, మండల అగ్రికల్చర్ ఆఫీసర్లతో పాటు ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన డీఈఈ, ఏఈఈలతో ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేయాలన్నారు.
వీరు ఎలక్ట్రిసిటీ విభాగాలకు చెందిన డీఈఈ, ఏఈఈలతో సమన్వయం చేసుకొని పంట పొలాలు ఎండకుండా నిఘా పెట్టాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను జిల్లా పరిపాలనా యంత్రాంగానికి నివేదించాలని సూచించారు. ఎప్పటికప్పుడు రైతులకు అవగాహన కల్పిస్తూ నీటిని వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఆఫీసర్లు ఫీల్డ్ విజిట్ చేసి క్షేత్రస్థాయి అధికారులకు అవసరమైన సూచనలు సలహాలు, టెక్నికల్ సపోర్ట్ అందించాలని ఆదేశించారు.
గ్రామాల్లో నీటి నిర్వహణ కమిటీలు..
గ్రామాల్లో సాగు నీటి నిర్వహణ కోసం కమిటీలు వేయాలని అధికారులను కలెక్టర్లు ఆదేశించారు. రైతులను సమన్వయం చేయడం, సాగు నీరు అందరికీ అందేలా చూసే బాధ్యతను ఆ కమిటీలకు అప్పగించాలన్నారు. అంతేకాకుండా మండలం, రెవెన్యూ డివిజన్ల వారీగా కమిటీలు వేసి వారం వారం సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తూ, రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.