డేటా ఎంట్రీ పైసలు ఇయ్యలే.. జిల్లాలో 2,60,498 కుటుంబాల సమగ్ర సర్వే

డేటా ఎంట్రీ పైసలు ఇయ్యలే..  జిల్లాలో 2,60,498 కుటుంబాల సమగ్ర సర్వే
  • డేటా అప్ లోడ్ చేసిన 2,724 మంది ఆపరేటర్లు 
  • ఆపరేటర్లకు ఇవ్వాల్సినవి రూ.72 లక్షలు 
  • నాలుగు నెలలైనా ఇంకా పైసలు ఇయ్యలే

యాదాద్రి, వెలుగు : సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ముగిసి నాలుగు నెలలు కావస్తోంది. తాత్కాలికంగా నియమించుకున్న ఆపరేటర్లు డేటా ఎంట్రీ కంప్లీట్​చేశారు. డేటా ఎంట్రీ చేసిన ఆపరేటర్లకు ఇంకా సర్కారు పైసలు ఇవ్వలేదు. ఆఫీసర్లను అడిగితే ప్రాసెస్​లో ఉందని చెబుతున్నారు. ప్రజల 'సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల' సమగ్ర ముఖచిత్రం ఆవిష్కరించడానికి ప్రభుత్వం గతేడాది నవంబర్​లో సర్వే నిర్వహించిన సంగతి తెలిసిందే. 

కచ్చితమైన సంఖ్య రాబట్టడానికి పెద్ద ఎత్తున యంత్రాంగాన్ని రంగంలోకి దించింది. ఎడ్యుకేషన్​డిపార్ట్​మెంట్​సహా వివిధ డిపార్ట్​మెంట్ల నుంచి 191 మంది సూపర్​వైజర్లు, 1910 ఎన్యుమరేటర్లను తీసుకున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం.. యాదాద్రి జిల్లాలో 2.04 లక్షల కుటుంబాలు ఉండగా, 2,60,498 కుటుంబాలు ఈ సర్వేలో పాల్గొన్నాయి. అనంతరం సర్వేకు సంబంధించిన ఫారాలను జిల్లా ఆఫీసర్లకు సూపర్​వైజర్లు, ఎన్యుమరేటర్లు అందించారు. 

2.60 లక్షల కుటుంబాల డేటా ఎంట్రీ..

సర్వే ముగియడంతోనే సంబంధించిన డేటా ఆన్​లైన్​లో ఎంట్రీ చేయడానికి ఆపరేటర్లను నియమించుకున్నారు. వీరిలో వివిధ డిపార్ట్​మెంట్లకు చెందిన 540 మంది ఎంప్లాయీస్​​ఉండగా, డేటా ఎంట్రీపై అవగాహన ఉన్న స్టూడెంట్స్, యూత్​ 2,184 మందిని తాత్కాలికంగా నియమించుకున్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్​ఒక ఫారం​ఎంట్రీ చేస్తే రూ.15, తాత్కాలికంగా నియమించుకున్న ఆపరేటర్లకు ఒక్కో ఫారం ఎంట్రీ చేసినందుకు రూ.30 చొప్పున ఇస్తామని ఆఫీసర్లు చెప్పారు. దీంతో వీరందరూ జిల్లాలోని ఎంపీడీవో ఆఫీసుల్లో స్పీడ్​గా డేటా ఎంట్రీ చేశారు. 

సూపర్​వైజర్లు, ఎన్యుమరేటర్లకు పేమెంట్ ఓకే..

వివిధ డిపార్ట్​మెంట్ల నుంచి సర్వేలో సూపర్​వైజర్లుగా వ్యవహరించిన 191 మందికి పేమెంట్ చేశారు. వీరిలో ఒక్కొక్కరికీ రూ.12 వేల చొప్పున రూ. 22.92 లక్షలు చెల్లించారు. అదేవిధంగా 1,910 ఎన్యుమరేటర్లకు ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున రూ.1.91 కోట్లు పేమెంట్ చేశారు. 

నాలుగు నెలలు కావస్తున్నా.. ఆపరేటర్లకు ఇస్తలే..

ఆఫీసర్ల గైడ్​లైన్స్​ప్రకారం 2,60,498 కుటుంబాల డిటైల్స్​డేటాను ఎంట్రీ చేసిన ఆపరేటర్లకు నాలుగు నెలలు కావస్తున్నా పేమెంట్​చేయడం లేదు. వివిధ డిపార్ట్​మెంట్ల నుంచి వచ్చిన 540 ఆపరేటర్లు 39,194 కుటుంబాలకు చెందిన డేటాను ఎంట్రీ చేశారు. ఈ లెక్కన ఒక్కో ఫారానికి రూ.15 చొప్పున రూ.5,87,910 చెల్లించాల్సి ఉంది.

అదే విధంగా తాత్కాలికంగా నియమించుకన్న 2,184 మంది ఆపరేటర్లు 2,21,304 కుటుంబాలకు చెందిన డేటా ఎంట్రీ చేశారు. ఈ లెక్కన ఒక్కో ఫారానికి రూ.30 చొప్పున రూ.66,39,120 చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తానికి సంబంధించి ఆపరేటర్లు పలుమార్లు ఆఫీసర్లను అడుగుతున్నా.. ప్రాసెస్ పూర్తయిందని, అప్రూవ్ కాగానే పేమెంట్ చేస్తామని చెబుతున్నారు. 

పేమెంట్​ఇస్తలేరు 

వారం రోజులపాటు రోజుకు 70 నుంచి 80 కుటుంబాలకు సంబంధించిన డేటా ఎంట్రీ చేశాం. నాలుగు నెలలు కావస్తోంది. పలుమార్లు ఆఫీసర్లను పేమెంట్ అడిగినా అప్రూవ్​కాగానే ఇస్తామని చెబుతున్నారు. నాకు రూ.12 వేలు రావాల్సి ఉంది. అమౌంట్ వస్తే అవసరాలకు పనికి వస్తాయనుకుంటే రావడం లేదు.- ఓ ప్రైవేట్​ఆపరేటర్​