ఏపీ ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్టు కింద కడుతున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేసన్ ప్రాజెక్టును వెంటనే నిలిపి వేయాలని కోరుతూ.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్.. NGTలో పిటీషన్ వేయనున్నట్లు తెలిపారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి.. ఇప్పటికే ఇరిగేషన్ అధికారులను ఆదేశించినట్లు అసెంబ్లీలో ప్రకటించారాయన.
ఇరిగేషన్ ప్రాజెక్టులపై శ్వేతపత్రంపై జరిగిన చర్చ సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వల్ల కృష్ణా జిలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని.. మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు నీళ్ల విషయంలో అన్యాయం జరుగుతుందని.. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తయితే.. కృష్ణా జలాలను ఏపీ రాష్ట్రం దోచుకువెళుతుందని.. బురదను కూడా మిగలదని ఆందోళన వ్యక్తం చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
కేసీఆర్ ప్రభుత్వం కళ్లు మూసుకుని ఉండటం వల్లే ఇంత దూరం వచ్చిందని.. టెండర్ ప్రక్రియ సమయంలోనూ కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండటం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చిందని.. అందుకే ఇప్పటికైనా సీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిలిపివేయాలనే డిమాండ్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.