
- కృష్ణా, గోదావరి, సరస్వతి పుష్కరాల ఏర్పాట్లపై ప్రభుత్వం ఫోకస్
- ఈ నేపథ్యంలో కుంభమేళా నిర్వహణపై ప్రయాగ్ రాజ్ లో అధికారుల పర్యటన
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రాబోయే పుష్కరాలకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నది. ఈ ఏడాది మే నెలలో కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు, 2027లో గోదావరి, 2028లో కృష్ణా పుష్కరాలు జరగనున్నాయి. అయితే, పుష్కారాలకు ఎలాంటి ఏర్పాట్లు చేయాలనే దానిపై ప్రభుత్వం అప్పుడే కసరత్తు ప్రారంభించింది. ఇటీవల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రయాగ్ రాజ్‌లో 45 రోజుల పాటు నిర్వహించిన మహా కుంభమేళా తీరుపై ఫోకస్ పెట్టింది.
కుంభమేళాకు యూపీ ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేసిందనే వివరాలను తెలుసుకునేందుకు రాష్ట్రం నుంచి ఎండోమెంట్, టూరిజం, ఎడ్యుకేషన్, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బీ శాఖలకు చెందిన 10 మంది అధికారుల బృందం రెండ్రోజుల పాటు ప్రయాగ్ రాజ్‌లో పర్యటించి సోమవారం తిరిగి హైదరాబాద్ చేరుకుంది. యూపీ అధికారులతో నిర్వహించిన భేటీలో సేకరించిన వివరాలను అధికారుల బృందం వెల్లడించింది.
వారం పది రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డికి ఆ పర్యటన నివేదికను అందజేస్తామని అధికారులు తెలిపారు. మహా కుంభమేళా నిర్వహణ కోసం రెండేళ్ల ముందే యోగి సర్కారు ప్రిపరేషన్ చేసిందని చెప్పారు. 10 వేల ఎకరాల్లో ఒక జిల్లా విస్తీర్ణంలో మేళాకు ఏర్పాట్లు చేసిందని, ఆ మేళాకు అధికారిగా జిల్లా కలెక్టర్ కు బాధ్యతలు అప్పగించిందని పేర్కొన్నారు. డీఐజీ రేంజ్ అధికారిని పర్యవేక్షణకు నియమించారని తెలిపారు.
అన్ని శాఖల సమన్వయంతో నిర్వహణ
‘‘అన్ని శాఖల సమన్వయంతో కుంభమేళాను యూపీ సర్కారు విజయవంతంగా నిర్వహించింది. విద్యుత్ అంతరాయం లేకుండా సబ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. 2 వేల ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం కల్పించారు. వారణాసి, లక్నోను కూడా టూరిజం స్పాట్లుగా చేశారు. 2 వేల కెమెరాలతో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు” అని అధికారులు వివరించారు. ఈ బృందంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ, అదనపు కమిషనర్ కృష్ణవేణి ఉన్నారు.