నర్సాపూరా​ లేక వరంగలా: సోలార్ పైలట్ ప్రాజెక్టు ఎంపికపై ప్రభుత్వం కసరత్తు

  • యాదాద్రి భువనగిరి జిల్లాలోనూ భూ పరిశీలన
  • తొలి విడతలో 231 ఎకరాల్లో ప్లాంట్ల ఏర్పాటు
  • 9 జిల్లాల్లో 719 ఎకరాల ఆలయ భూముల గుర్తింపు

హైదరాబాద్, వెలుగు:  ప్రభుత్వ భూముల్లో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్ర సర్కార్‌‌‌‌‌‌ కసరత్తు చేస్తుంది. ఎండోమెంట్ భూములను స్వయం సహాయక సంఘాలకు లీజుకు ఇచ్చి సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా మెదక్ జిల్లాలోని నర్సాపూర్ లేదా వరంగల్ జిల్లాలోని రంగన్న దర్వాజను ఎంపిక చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీంతో పాటు యాదాద్రి భువనగిరి జిల్లాలోనూ ప్లాంట్ ఏర్పాటుకు భూములను పరిశీలించారు. నర్సాపూర్‌‌‌‌లో ప్లాంట్ నిర్మించేందుకు అనువుగా ఉండగా.. వరంగల్‌‌లో ఏర్పాటు చేసే అంశంపైనా పరిశీలిస్తున్నారు. రాష్ట్రంలో 9 జిల్లాల్లో పలు ఆలయాలకు సంబంధించిన 719.12 ఎకరాలను గుర్తించారు. తొలి విడతలో 231 ఎకరాల్లో ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. 

రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే యోచన..

మెదక్ జిల్లా నర్సాపూర్‌‌‌‌లోని లక్ష్మీనారాయణ స్వామి ఆలయానికి 127.37 ఎకరాల భూమి ఉంది. ఈ భూములు విద్యుత్ సబ్ స్టేషన్‌‌కు 2 కిలోమీటర్ల పరిధిలో ఉన్నాయి. దీంతో 100 ఎకరాల్లో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వరంగల్ జిల్లా రంగన్న దర్వాజలోని సీతా రామచంద్రస్వామి ఆలయానికి 24.17 ఎకరాలు ఉండగా.. 21.34 ఎకరాల్లో ప్లాంట్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నది. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం భుజలాపురంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి 20.33 ఎకరాల భూమి ఉండగా.. 15.33 ఎకరాల్లో ప్లాంట్ పెట్టాలని యోచిస్తున్నది.

తొలి ప్రాజెక్టు సక్సెస్ అయితే సోలార్ పవర్ ప్లాంట్లను రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం విస్తరించనుంది. కాగా, ఎండోమెంట్ అధికారులు హైదరాబాద్, మెదక్, నల్గొండ, మహబూబ్‌‌నగర్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోనూ ఆలయ భూములను గుర్తించారు. ఈ పవర్ ప్లాంట్ల ఏర్పాటు ద్వారా మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు ఆలయాలకు సైతం ఆదాయం సమకూరుతుందని భావిస్తున్నారు.