గ్రీన్​ ఫీల్డ్​ రోడ్ల భూసేకరణకు కసరత్తు.. ఫోర్త్ సిటీ మీదుగా వేసేందుకు ప్లాన్​

గ్రీన్​ ఫీల్డ్​ రోడ్ల  భూసేకరణకు కసరత్తు.. ఫోర్త్ సిటీ మీదుగా వేసేందుకు ప్లాన్​
  • ఓఆర్ఆర్​ ఎగ్జిట్ల నుంచి ట్రిపుల్ ​ఆర్​ వరకు 9 రోడ్ల నిర్మాణం
  • కావాల్సింది 918 ఎకరాలు
  • 568 ఎకరాల పట్టా భూములు సేకరించడమే పెద్ద టాస్క్​ 
  • మొదటి దశలో ఓఆర్ఆర్​నుంచి ఆమన్​గల్​వరకు రోడ్​నిర్మాణం
  • త్వరలో టెండర్లు పిలవాలని నిర్ణయం

హైదరాబాద్​సిటీ, వెలుగు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రీజినల్​రింగ్​రోడ్(ట్రిపుల్ ఆర్)ను ఓఆర్ఆర్​కు కలిపేందుకు ప్రతిపాదించిన గ్రీన్​ఫీల్డ్​రోడ్ల నిర్మాణానికి ప్రపోజల్స్​సిద్ధమయ్యాయి. ఈ పనులను హెచ్ఎండీఏకు చెందిన హైదరాబాద్​గ్రోత్​కారిడార్​ కార్పొరేషన్​(హెచ్​జీసీఎల్) సంస్థ చేపడుతోంది. సీఎం రేవంత్​రెడ్డి మానస పుత్రిక ఫోర్త్​సిటీ మీదుగా గ్రీన్​ఫీల్డ్​రోడ్లను ట్రిపుల్​ఆర్​వరకూ నిర్మిస్తారు.

మొత్తం 9 రోడ్లను ఔటర్​ రింగ్​రోడ్​ ఎగ్జిట్​పాయింట్ల నుంచి ఫోర్త్​సిటీ మీదుగా ట్రిపుల్​ఆర్​వరకూ నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ ప్రపోజల్స్​కు సర్కారు గ్రీన్​సిగ్నల్​కూడా ఇచ్చిందని, రోడ్ల నిర్మాణం పూర్తయితే ఫోర్త్​సిటీ డెవలప్​మెంట్​తో పాటు ట్రిపుల్​ఆర్​వరకూ కనెక్టివిటీ ఏర్పడుతుందని అధికారులు చెప్తున్నారు. ఈ రోడ్లన్నీ 300 అడుగులతో నిర్మించనున్నారు. దీనికి కావాల్సిన భూమి కోసం ఇప్పటికే హెచ్​జీసీఎల్​అధికారులు భూసేకరణ నోటిఫికేషన్​జారీ చేశారు. ఔటర్ రింగ్​రోడ్​నుంచి ట్రిపుల్​ఆర్​వరకు దాదాపు 41 కిలోమీటర్ల మేర భూములను సేకరించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు.

మొదటగా ఫోర్త్​సిటీ నుంచే.. 

గ్రీన్​ఫీల్డ్​ రోడ్లను ఓఆర్ఆర్​ఎగ్జిట్​పాయింట్ల నుంచి నిర్మించనున్నారు. ఓఆర్ఆర్​కు 17 ఎగ్జిట్​పాయింట్లు ఉండగా, ఇందులో 9 పాయింట్ల నుంచి రోడ్లను నిర్మించనున్నారు. మొదట రావిర్యాల ఓఆర్ఆర్​ఎగ్జిట్​నంబర్​13 నుంచి ఫోర్త్​సిటీ మీదుగా కొంగర కుర్ధు నుంచి కొంగరకలాన్, మీర్​ఖాన్​పేట వరకూ 18 కి.మీ రోడ్డును.. ముచ్చెర్ల, కుర్మిద్ద, కడ్తాల్, ముద్విన్, ఆమన్​గల్​మీదుగా ఆకుతోటపల్లి వరకూ ట్రిపుల్​ఆర్​ను కలుపుతూ రోడ్డును నిర్మించాలని ప్రతిపాదించారు.

భూ సేకరణ 50 శాతం పూర్తికాగానే ఈ రోడ్డును నిర్మించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం త్వరలోనే టెండర్లు పిలవనున్నారు. 9 రోడ్లకు 918 ఎకరాలను సేకరించేందుకు నోటిఫికేషన్​జారీ చేసినట్టు అధికారులు తెలిపారు.

348 ఎకరాలకు సమస్య లేదు

గ్రీన్​ఫీల్డ్​రోడ్ల నిర్మాణానికి అవసరమైన 918 ఎకరాలను సేకరించడమే పెద్ద టాస్క్​లా మారింది. ప్రభుత్వం సేకరించనున్న ఈ భూముల్లో 568 ఎకరాల వరకు పట్టా భూములు, 169 ఎకరాలు ఫారెస్ట్​ భూములు, టీజీ ఐఐసీకి చెందిన156 ఎకరాలు, ప్రభుత్వ భూములు 23 ఎకరాలు ఉన్నాయి. ప్రభుత్వ, ఫారెస్ట్​ భూములు సేకరించడం కష్టం కాదని, పట్టా భూములు సేకరించడానికే ప్రయత్నాలు చేస్తున్నట్టు అధికారులు చెప్పారు. ట్రిపుల్​ఆర్​పూర్తయ్యే నాటికి మీర్​ఖాన్​పేట నుంచి ఆమన్​గల్, తోటపల్లి వరకూ రోడ్లు పూర్తి చేయాలని టార్గెట్​పెట్టుకున్నారు.