- మార్కెట్ రేటుకు తగ్గట్టు పరిహారం ఇచ్చేలా ప్రతిపాదనలు
- భూసేకరణ చట్టాన్ని సవరించే యోచనలో రాష్ట్ర సర్కారు
- రైతులకు న్యాయం చేసే దిశగా మార్పులు చేయాలని నిర్ణయం
- ఇప్పటికే అనుకున్న పనులకు50 వేల ఎకరాలు అవసరం
- బీఆర్ఎస్ హయాం నుంచి సజావుగా సాగని భూసేకరణ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వివిధ అభివృద్ధి పనుల కోసం చేపట్టే భూసేకరణకు కొత్త విధానం తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ మేరకు ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నది. బహిరంగ మార్కెట్ లో ఎంత ధర ఉందో అంతకు దగ్గరగా రైతులకు పరిహారం ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నది. 2013 భూసేకరణ చట్టంలో ఏ రకమైన మార్పులు చేస్తే రైతులకు మేలు జరుగుతుందన్న విషయంపై కసరత్తు చేస్తున్నది. రైతులను సంతృప్తి పరిచి భూములు తీసుకోవడం వల్ల కోర్టుల్లో కేసులు ఉండవని, ప్రాజెక్టులను కూడా త్వరితగతిన పూర్తి చేయవచ్చని ప్రభుత్వం భావిస్తున్నది.
రాష్ట్రంలో వివిధ అభివృద్ధి పనులకు, ప్రాజెక్టులకు, ఇండస్ట్రియల్ కారిడార్లకు పెద్ద ఎత్తున భూ సేకరణ చేయాల్సి ఉంది. ప్రస్తుతం అనుకున్న ప్రాజెక్టులకే దాదాపు 40 వేల నుంచి 50 వేల ఎకరాలు కావాల్సి ఉంది. గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో చేపట్టిన భూ సేకరణపై రైతుల ఆందోళనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. మల్లన్న సాగర్, కొండపోచమ్మతోపాటు మున్సిపాలిటీల మాస్టర్ ప్లాన్లు, ఇండస్ట్రీలకు సంబంధించి భూములు కోల్పోయిన రైతుల నుంచి తీవ్ర నిరసనలు ఎదురయ్యాయి. చాలాచోట్ల లాఠీచార్జీలు, అరెస్టులు కూడా జరిగాయి. అప్పట్లో ప్రతి పక్షంలో ఉన్న రేవంత్‌రెడ్డి సైతం రైతుల పక్షాన కొట్లాడారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడం, రేవంత్‌రెడ్డి సీఎం కావడంతో రైతులకు పరిహారం విషయంలో మార్పులు చేయాలని అధికారులకు సూచించారు.
కోర్టు వద్దన్నా.. సవరణలు చేసి అమలు..
యూపీఏ ప్రభుత్వం 2013లో పార్లమెంట్లో తెచ్చిన భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు ఎంతైనా పరిహారం ఇచ్చుకునే వెసులుబాటు రాష్ట్రాలకు ఉన్నది. అయితే ఈ భూసేకరణ చట్టానికి సంబంధించి 123 జీవోను గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. అది భూములు కోల్పోతున్న రైతుల హక్కులను కాలరాస్తుందని అప్పట్లో హైకోర్టు కొట్టేసింది. అయినప్పటికీ చట్టంలో కొన్ని సవరణలు చేస్తూ గత ప్రభుత్వం దాన్నే అమలు చేసింది. పునరావాసం, పునర్నిర్మాణానికి బదులుగా ఒకేసారి ఏకమొత్తం పరిహారం చెల్లించేలా నిబంధనల్లో మార్పుచేసింది. దీంతో భూసేకరణలో రైతుల నుంచి ఇంకింత వ్యతిరేకత ఎక్కువైంది.
సర్కారు విలువ కంటే నాలుగు రెట్లు!
2013 భూసేకరణ చట్ట ప్రకారం పరిహారం, ఆర్ అండ్ ఆర్ ఇవ్వాలని ప్రస్తుత రాష్ట్ర సర్కారు భావిస్తున్నది. దీని ప్రకారం.. సేకరించే భూమి ప్రభుత్వ మార్కెట్ విలువ ఆధారంగా గ్రామీణ ప్రాంతాల్లో నాలుగు రెట్ల వరకు, పట్టణ ప్రాంతాల్లో రెండు రెట్ల వరకు అదనంగా నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. పట్టణాభివృద్ధి కోసం సేకరించినట్లయితే ఆ భూమిని అభివృద్ధి చేసిన తర్వాత అందులో యజమానులకు 20 శాతం భూమి ఇవ్వాలి. ఇక పరిశ్రమలకు అయితే 25 శాతం వాటా ఇవ్వాలనే నిబంధనలున్నాయి. అయితే ప్రభుత్వ మార్కెట్విలువలు బాగా తక్కువగా ఉండడంతో నాలుగు రెట్లు చేసినప్పటికీ కూడా రైతులకు బహిరంగ మార్కెట్ ధర మొత్తం రావడం లేదు. ఇది కూడా ప్రభుత్వానికి సమస్యగా మారింది.
ఇప్పటికే భూసేకరణ చేస్తున్న కొన్ని ప్రాంతాల్లో మార్కెట్విలువలు సవరించి.. బహిరంగ మార్కెట్ రేటు వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. ఇందులో ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం భూములు ఉన్నాయి. గతంలో రూ.లక్ష, రూ.రెండు లక్షలలోపే ఉన్న ఎకరం భూముల ధరలను రూ.7–9 లక్షల వరకు ప్రభుత్వం సవరించింది. దీంతో వీటికి నాలుగు రెట్లు.. అంటే యావరేజ్‌గా ఎకరాకు రూ.30 లక్షల వరకు అందేలా మార్చారు.
ఇదే పద్ధతిని భూసేకరణ చేయాలనుకుంటున్న ప్రతి ప్రాంతంలో మార్కెట్ రేట్లను సవరించి చేయాలనే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తున్నది. 2013 భూసేకరణ చట్టంలోని 107 సెక్షన్ ప్రకారం.. అధికంగా పరిహారం చెల్లించేందుకు లేదా ఈ చట్టంలో పేర్కొన్న పునరావాసం, పునర్నిర్మాణం ప్రయోజనాలకన్నా మెరుగైన ప్రయోజనాలను అందించేందుకు మరిన్ని అంశాలను చేర్చడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసే అవకాశం ఉంది.
40 వేల నుంచి 50 వేల ఎకరాలు అవసరం
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ డెవలప్మెంట్ పనులకు, ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున భూమి సేకరించాల్సి ఉన్నది. ఇప్పటికే ఉన్న అంచనాల ప్రకారం 40 వేల నుంచి 50 వేల ఎకరాలు అవసరం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఫ్యూచర్ సిటీ కోసం ఇంకో 10 వేల ఎకరాల నుంచి 15 వేల ఎకరాలు అవసరం ఉంది. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం కోసం ఆరు వేల ఎకరాలు అవసరం కానున్నట్లు పేర్కొంటున్నారు.
ఇవికాకుండా జిల్లాల్లో ఇండస్ట్రియల్ కారిడార్ కోసం దాదాపు 7 వేల ఎకరాల పైనే భూమి అవసరం ఉంటుందని అంచనా వేస్తున్నారు. మెట్రో, వివిధ రకాల ఎత్తిపోతల పథకాలు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఇతర డెవలప్మెంట్పనుల కోసం ఇంకో 10 వేల ఎకరాలు అవసరం. దీంతో ఎక్కడా ఇబ్బంది ఏర్పడకుండా రైతులకు పరిహారం ఎక్కువ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నది.