- స్థానిక అవసరాలకు తగ్గట్టు నిధులు.. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
- అనుకూలతలను బట్టి ప్రాజెక్టులు, పరిశ్రమల ఏర్పాటు
- ఎంపీలు , ఎమ్మెల్యేలు , కలెక్టర్ల నుంచి ప్రతిపాదనల సేకరణ
- డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కోసం స్పెషల్ యాక్షన్ ప్లాన్
- ప్రభుత్వ పెద్దల జిల్లాలకే అభివృద్ధి పరిమితమన్న విమర్శ రాకుండా చర్యలు
హైదరాబాద్, వెలుగు: జిల్లాల్లో స్థానిక అవసరాలకు తగ్గట్టు అభివృద్ధి పనులు చేపట్టాలని, నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏ జిల్లాకు ఆ జిల్లాను యూనిట్‌గా తీసుకుని డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టనుంది. అనుకూలతలను బట్టి ప్రాజెక్టులు, పరిశ్రమలు, విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలనుకుంటున్నది.
ఇందుకోసం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ల నుంచి ప్రపోజల్స్ తీసుకోనుంది. ఫలితంగా ఆయా ప్రాంత ప్రజల డిమాండ్లు, అవసరాలు తీరుతాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. అదే సమయంలో రాష్ట్రమంతా సమాంతరంగా అభివృద్ధి చెందుతుందని అనుకుంటున్నది.
పేరుకే జిల్లాలు.. సౌలతుల్లేవ్!
జిల్లాల్లో గత సర్కార్ ఇప్పటి వరకు ఏమేం చేసిందనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం వివరాలు సేకరిస్తున్నది. కొత్త జిల్లాల పేరుతో హడావుడి చేసి.. ఆయా జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్లు తప్ప కనీస సౌలతులు కూడా గత సర్కార్ కల్పించలేదనేది ప్రస్తుత ప్రభుత్వం దృష్టికి వచ్చింది.
కొన్ని జిల్లాల్లో అసలు ఉపాధి అవకాశాలు లేవని.. నీటి వనరులున్నా వాడుకోలేని పరిస్థితులు కల్పించారని.. ఉన్నత విద్య కాలేజీలు, రోడ్లు ఇతరత్రా వంటి ముఖ్యమైనవి కూడా లేవని తేలింది. వీటిని పరిష్కరించడంపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందుకోసం అసెంబ్లీ సమావేశాల్లో జీరో అవర్‌లో ఎమ్మెల్యేలు లేవనెత్తే సమస్యలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని భావిస్తున్నది.
ప్రత్యేక యాక్షన్ ప్లాన్‌తో ముందుకు..!
మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారివారి జిల్లాలకు, నియోజకవర్గాలకు అవసరమైన డెవలప్మెంట్ కార్యక్రమాల కోసం సాధారణంగా సీఎంకు వినతి పత్రాలు ఇస్తూ ఉంటారు. ఒకే జిల్లాలో ఒకే అంశానికి సంబంధించి మంత్రి, ఎమ్మెల్యే, స్థానిక లీడర్లు విన్నవించుకోవడం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అయితే, జిల్లాలవారీగా ఆయా ప్రాంతాల్లో ఏం చేయాలనేదానిపై ఒక ప్లాన్‌ను ముందే తీసుకుంటే ఎలా ఉంటుందని ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆరా
తీసినట్లు తెలిసింది.
నాలుగున్నరేండ్లు ప్రభుత్వానికి సమ యం ఉందని.. ఇప్పుడే ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకొని ముందుకు వెళ్లాలని అభిప్రాయపడ్డట్లు సమాచారం. దీంతో ఏ జిల్లాకు ఆ జిల్లా డెవలప్మెంట్ యాక్టివిటీస్ అద్భుతంగా అమలు చేసుకునే వీలుంటుందని ఆయన అన్నట్లు తెలిసింది. కేవలం ప్రజాప్రతినిధుల సిఫార్సులే కాకుండా.. జిల్లా లెవెల్లో కలెక్టర్ల నుంచి కూడా ఆయా జిల్లాలకు ఏం అవసరం అనేదానిపై ప్రపోజల్స్ తీసుకోవాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు.
నిధులకు ఢోకా లేకుండా..
పక్కా ప్లాన్‌తో వెళ్తే జిల్లా యూనిట్‌గా చేపట్టే డెవలప్మెంట్ కార్యక్రమాలకు నిధుల ఢోకా కూడా ఉండదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. అప్పటికప్పుడు జిల్లాలకు వెళ్లినప్పుడు సీఎం హామీలు ఇవ్వడం లేదా స్థానిక ఎమ్మెల్యే ఏదైనా కోరితే దానికి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం వంటివి జరుగుతుంటాయి. అయితే దానికి కావాల్సిన నిధులను స్పెషల్ ఫండ్స్ కింద ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే ఇంకో ఫైనాన్షియల్ ఇయర్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి. దీనికి బదులు ముందే ఒక ప్రణాళిక రెడీ చేసుకుంటే.. బడ్జెట్లో నిధులను కేటాయించుకునేందుకు అవకాశం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది.
ఇక ప్రభుత్వం ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఫండ్స్ కేటాయిస్తున్నది. ఏడాదికి రూ. 5 కోట్ల చొప్పున గత ప్రభుత్వం పద్దు చూపింది. ఈ నిధులకు తోడు జిల్లాల అభివృద్ధికి ప్రత్యేకంగా మరిన్ని నిధులు ఇస్తే ఎలా ఉంటుందనే దానిపైనా సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచిస్తున్నట్లు సమాచారం.
అన్ని జిల్లాలకు సమాంతరంగా అభివృద్ధి ఫలాలు
సీఎం జిల్లాలో, డిప్యూటీ సీఎం జిల్లాలో, ఫలానా మంత్రి ఇలాకాలో మాత్రమే అభివృద్ధి జరిగిందన్న విమర్శ రాకుండా, అన్ని జిల్లాల్లో డెవలప్మెంట్ కనిపించేలా కార్యాచరణను ప్రభుత్వం సిద్ధం చేస్తున్నది
గత ప్రభుత్వంలో కేవలం సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాలకే ఎక్కువ నిధులు వెళ్లాయనే విమర్శ జనంలో ఉందని, ఇప్పుడు అన్ని జిల్లాలకు సమాంతరంగా అభివృద్ధి ఫలాలు అందేలా ప్లాన్ రెడీ చేయాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం.