డీఎస్సీ కౌన్సెలింగ్ అయోమయం : మళ్లీ వాయిదా అంటూ అధికారుల ప్రకటన 

డీఎస్సీ కౌన్సెలింగ్ అయోమయం : మళ్లీ వాయిదా అంటూ అధికారుల ప్రకటన 
  • ఉదయం ఉంటుందని సోమవారం రాత్రి అభ్యర్థులకు మెసేజ్
  • మళ్లీ వాయిదా అంటూ మంగళవారం ఉదయం అధికారుల ప్రకటన 
  • ఆ వెంటనే మధ్యాహ్నం అంటూ ఫోన్లు 
  • గందరగోళానికి గురైన అభ్యర్థులు 
  • అర్ధరాత్రి వరకూ జిల్లాల్లో కొనసాగిన కౌన్సెలింగ్

హైదరాబాద్, వెలుగు: టీచర్​ పోస్టింగుల​ కోసం అధికారులు నిర్వహించిన డీఎస్సీ కౌన్సెలింగ్  ప్రక్రియ అభ్యర్థులను అయోమయానికి గురిచేసింది. డీఎస్సీ కౌన్సెలింగ్  ఉందంటూ ఒకసారి.. వాయిదా అంటూ మరోసారి.. మళ్లీ కౌన్సెలింగ్  ఉంటుందని ఇంకోసారి ఉత్తర్వులు ఇవ్వడంతో వారంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చివరికి రాత్రి వరకూ కౌన్సెలింగ్  ప్రక్రియ పూర్తికావడంతో కొత్త టీచర్లతో పాటు, రిలీవ్ కాని టీచర్లు ఊపిరి పీల్చుకున్నారు. మరోపక్క పోస్టింగ్  ఆర్డర్లు పొందిన టీచర్లు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా డీఎస్సీ 2024 ద్వారా 10,006 మంది అభ్యర్థులను విద్యాశాఖ అధికారులు ఎంపిక చేశారు.

వారికి ఈ నెల 9న సీఎం రేవంత్  రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. ఆ మరుసటి రోజే పోస్టింగుల కోసం కౌన్సెలింగ్  నిర్వహించాలని స్కూల్  ఎడ్యుకేషన్  అధికారులు భావించినా.. విద్యాశాఖ ఉన్నతాధికారి నుంచి పర్మిషన్  రాకపోవడంతో ఆగిపోయింది. ఈ నెల 10న డీఈఓ ఆఫీసుల్లో రిపోర్టు చేసినప్పటి నుంచి జీతాలు ఇస్తామని అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలోనే బతుకమ్మ, దసరా సెలవులు రావడంతో ఈ నెల15న కౌన్సెలింగ్  నిర్వహించాలని డీఈఓలకు స్కూల్  ఎడ్యుకేషన్  అధికారులు సమాచారం ఇచ్చారు.

దీంతో, అభ్యర్థులకు సోమవారం సాయంత్రమే వాట్సాప్, ఫోన్ లో మెసేజీలు పంపారు. మంగళవారం కలెక్టరేట్  ఆఫీసులు, డీఈఓ ఆఫీసుల్లో జరిగే కౌన్సెలింగ్​కు హాజరు కావాలని డీఈఓలు సమాచారం ఇచ్చారు. దీంతో అభ్యర్థులంతా ఉదయం జిల్లా కేంద్రాలకు చేరుకున్నారు. ఈ సమయంలోనే విద్యాశాఖ ఉన్నతాధికారి ఆదేశాలతో కౌన్సెలింగ్ ను సాయంత్రం వరకూ హోల్డ్ లో పెట్టాలని డీఈఓలకు స్కూల్  ఎడ్యుకేషన్ అధికారులు మేసేజ్  పెట్టారు.

దీంతో కౌన్సెలింగ్  వాయిదా వేస్తున్నామని డీఈఓలు  ప్రకటించారు. అయితే, ఈ విషయాన్ని విద్యాశాఖ అధికారులు సీఎం రేవంత్  రెడ్డి దృష్టికి తీసుకుపోవడంతో ఆయన గ్రీన్ సిగ్నల్  ఇచ్చినట్టు తెలిసింది. దీంతో మళ్లీ మంగళవారం మధ్యాహ్నం నుంచి కౌన్సెలింగ్  ఉంటుందని అభ్యర్థులకు  డీఈఓలు సమాచారం ఇచ్చారు. 

స్కూళ్లకు నేటి నుంచి కొత్త టీచర్లు 

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి కౌన్సెలింగ్  ప్రారంభమైంది. ముందుగా ఎస్జీటీ, లాంగ్వేజీ పండిట్, పీఈటీ పోస్టులకు కౌన్సెలింగ్  చేపట్టి, వారికి పోస్టింగ్  ఆర్డర్లు ఇచ్చారు. అనంతరం స్కూల్  అసిస్టెంట్లకు సబ్జెక్టులు, మీడియం వారిగా కౌన్సెలింగ్  నిర్వహించి పోస్టింగ్  ఆర్డర్లు అందించారు. అలాట్  చేసిన స్కూళ్లలో బుధవారం వారంతా రిపోర్టు చేయాలని డీఈఓలు సూచించారు. పలు జిల్లాల్లో అర్ధరాత్రి వరకూ కౌన్సెలింగ్  కొనసాగిందని అధికారులు తెలిపారు. 

డీఎస్సీ ఓపెన్​ కోటాలోనూ బీసీల హవా 

డీఎస్సీ-2024 ఓపెన్  కోటాలోనూ బీసీ అభ్యర్థులు హవా కొనసాగించారు. రాష్ట్రవ్యాప్తంగా 11,062 టీచర్  పోస్టుల భర్తీకి సర్కారు నోటిఫికేషన్ ఇవ్వగా, ప్రస్తుతం 10,006 మందిని ఎంపిక చేసి పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చారు. ఈ పోస్టులన్నీ హారిజాంటల్  రిజర్వేషన్  ప్రకారం భర్తీ చేశారు. ఎంపికైన పదివేల మంది అభ్యర్థుల్లో 5,466 (54.70 శాతం) మంది బీసీలే ఉన్నారు. వాస్తవానికి రిజర్వేషన్ల ప్రకారం 27 శాతమే ఉన్నా.. ఓపెన్  కేటగిరిలోనూ ఎక్కువ పోస్టులను బీసీలు సంపాదించుకున్నారు. మరోపక్క ఎస్సీలు 1,847 (18.50 శాతం) మంది, ఎస్టీలు 1,027 (10.30 శాతం) మంది, ఓసీలు 553 (5.50 శాతం) ఎంపికయ్యారు.