రెండు విడతల్లో పంచాయతీ ఎన్నికలు.!

రెండు విడతల్లో పంచాయతీ ఎన్నికలు.!

హైదరాబాద్, వెలుగు:  పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం  సిద్ధమవుతున్నది. బీసీ డెడికేటెడ్ కమిషన్, ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ నివేదికలు పూర్తయిన నేపథ్యంలో స్థానిక ఎన్నికలకు మార్గం సుగమైంది. త్వరలోనే ఈ  నివేదికలు ప్రభుత్వానికి అందనున్నాయి.  దీంతోపాటు బీసీ రిజర్వేషన్ల అంశంపై తీర్మానం చేసేందుకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాల ఏర్పాటుకు సర్కారు కసరత్తు చేస్తున్నది. అయితే, పంచాయతీ ఎన్నికలను ఎన్ని విడతల్లో నిర్వహించాలనే అంశంపై  తర్జన భర్జన పడుతున్నది.

ఎలక్షన్స్​ను రెండు విడతల్లోనే నిర్వహించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది.  అధికారులు మాత్రం 3 విడతల్లో  నిర్వహించాలని ప్రభుత్వానికి నివేదించినట్టు తెలిసింది. 3 విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తే సమయం వృథా అని ప్రభుత్వం భావిస్తున్నదని, 2 విడతల్లోనే పంచాయతీ ఎన్నికలను పూర్తి చేయాలని  అధికారులకు తెలిపినట్టు సమాచారం.  

ఎన్నికల సిబ్బంది కొరత రాకుండా..

పంచాయతీ ఎన్నికల్లో ప్రతి వార్డుకు ఒక పోలింగ్‌‌‌‌ కేంద్రం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అందుకే సిబ్బంది ఎక్కువగా అవసరం. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలను 3 విడతల్లో నిర్వహిస్తే ఎలాంటి సమస్య ఉండదని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో  12,845 పంచాయతీలు ఉండగా.. 1,13,328 వార్డులు ఉన్నాయి. ఇందుకోసం అన్ని వార్డుల్లోనూ పోలింగ్‌‌‌‌ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. గత ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం 1.50 లక్షల మందికి పైగా సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. 

 గత పంచాయతీ ఎన్నికలను 3 విడతల్లో నిర్వహించారు. ఈ క్రమంలో ఎన్నికల సిబ్బంది సమస్య తలెత్తలేదు. ఈ సారి 2 విడతల్లో ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే సిబ్బంది సమస్య తలెత్తే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే 2 విడతల్లో నిర్వహించేందుకు టీచర్లు సరిపోకపోతే ఇతర శాఖల సిబ్బందిని ఉపయోగించుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నది.