
- కలెక్టర్లకు మంత్రి ఉత్తమ్ ఆదేశం
- ఈయేడు 281 లక్షల టన్నుల దిగుబడి అవుతుందని అంచనా
- యాసంగిలో 127.50 లక్షల టన్నుల దిగుబడి ఎస్టిమేషన్
- 70.13 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేశామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: యాసంగి సీజన్ లో రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి అవుతుందని, ధాన్యం కొనుగోళ్లకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామని సివిల్ సప్లయ్స్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. శనివారం సివిల్ సప్లయ్స్ భవన్లో ప్రిన్సిపల్ సెక్రటరీ డీఎస్ చౌహాన్, జాయింట్ కమిషనర్ ప్రియాంక అలతో కలిసి జిల్లా కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ లో ఆదిలాబాద్ నుంచి మంత్రి సీతక్క పాల్గొన్నారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, జిల్లా కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో పర్యటించి కొనుగోళ్లను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈయేడు రెండు సీజన్లు కలిపి 281 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి అవుతుందని అంచనా వేశామని చెప్పారు. అలాగే, యాసంగిలో సాగైన 57 లక్షల ఎకరాలలో 127.50 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నామని తెలిపారు. ఇందులో 70.13 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని వెల్లడించారు.
ఇప్పటికే 5.77 లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లు
యాసంగి కొనుగోళ్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా 8,329 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకోగా ఇప్పటికే 7,337 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఇప్పటి వరకు 8.51 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరగా.. 5.77 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని చెప్పారు. వీటిలో సన్నరకాలు 3.79 లక్షల టన్నులు, దొడ్డురకం 1.98 లక్షల టన్నులని వెల్లడించారు. సన్నాలు పండించిన రైతులకు బోనస్ లు ఎప్పటికప్పుడు వారి ఖాతాల్లో జమ చేస్తున్నామని తెలిపారు.
నిజామాబాద్, కామారెడ్డి, సిద్దిపేట, నల్లగొండ జిల్లాలో పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించగా మిగిలిన జిల్లాల్లో వరికోతలను బట్టి ప్రారంభిస్తామని చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో గ్రేయిన్ కాలిపర్స్, ఎలక్ట్రానిక్ తూకపు మిషిన్లు, మాయిశ్చర్ మీటర్లు, టార్పాలిన్లు, ప్యాడీ క్లినర్లు, హస్క్ రిమూవర్ తదితర యంత్రాలను అందుబాటులోకి తెచ్చామని వివరించారు. ఇక, ధాన్యాన్ని నిల్వ చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 66.65 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన గోదాములు ఉండగా అందులో 25 లక్షల టన్నుల నిల్వ చేసేందుకు అవకాశం ఉందన్నారు. మిగిలిన ధాన్యాన్ని నిల్వ చేసేందుకు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ, స్టేట్ వేర్‌హౌసింగ్ సంస్థకు చెందిన గోదాములతో పాటు ప్రైవేట్ గోదాములలో ధాన్యాన్ని నిలువ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలిపారు.
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ధాన్యాన్ని అడ్డుకునేందుకు ప్రత్యేక చర్యలు
వానాకాలంలో రికార్డు స్థాయిలో పండిన పంటను కొనుగోళ్లను సమర్థవంతంగా నిర్వహించారని అధికారులను మంత్రి ప్రశంసించారు. యాసంగిలోనూ అలాగే కొనుగోళ్లు చేపట్టాలన్నారు. రాష్ట్రంలో సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తుండడంతో లబ్ధి పొందేందుకు సరిహద్దు రాష్ట్రాల నుంచి అక్రమంగా తరలించే అవకాశాలు ఉన్నాయని, అక్రమ రవాణాను అడ్డుకునేందుకు సరిహద్దుల్లో నిఘాపెట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు.