- ఎవరు, ఎక్కడ, ఎంతకాలం పని చేశారో తెలిసేలా ప్రత్యేక సాఫ్ట్వేర్
- వాళ్ల పని తీరు, రివార్డులు, రిమార్కులు తెలిసేలా ఏర్పాటు
- హెచ్ఆర్ వ్యవస్థ ఏర్పాటుపైనా సమాలోచన
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డేటాను ఆన్లైన్ చేయాలని సర్కారు భావిస్తున్నది. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేయనున్నది. అందులో ఉద్యోగి అపాయింట్అయినప్పటి నుంచి రిటైర్మెంట్ వరకు పూర్తి వివరాలు ఉండేలా చూస్తున్నది. అవసరమైతే హెచ్ఆర్ వ్యవస్థను తీసుకువస్తే ఎలా ఉంటుందనే దానిపైనా కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది.
గత పదేండ్లలో ఆలిండియా సర్వీసు మినహా.. కిందిస్థాయి పోస్టుల్లో ఎవరెవరు ఎక్కడెక్కడ పనిచేశారనే దానిపై ప్రభుత్వం దగ్గర పూర్తి డేటా లేదు. ఏ అధికారి ఏ రకంగా ఎఫిషియెంట్, అధికారి చేసిన పనులు, రిమార్కులు వంటివి తెలియడం లేదు. ఫలితంగా బదిలీలు చేసే సమయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పైగా ఉద్యోగులకు సంబంధించి ఒక డేటా సమగ్రంగా లేకపోవడంపైనా సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయినట్టు సమాచారం. దీంతో ఉద్యోగుల కోసమే ప్రత్యేకంగా ఒక సాఫ్ట్వేర్ ను తీసుకురానున్నారు. ఇందులోనే కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఒక ఆప్షన్ ఇవ్వాలని చూస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న ఆలిండియా సర్వీసు అధికారుల దగ్గర నుంచి కింద క్లర్క్ వరకు వివరాలు ఉండేలా సాఫ్ట్వేర్ రెడీ చేసి, ఒక వెబ్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఆన్లైన్లో అన్ని వివరాలు..
ప్రభుత్వ శాఖల్లోని హెచ్‌వోడీ ఆఫీసుల్లో వివిధ విభాగాల దగ్గర నుంచి జిల్లాలు, మండల కేంద్రాలు , గ్రామాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రభుత్వంలో మాత్రమే కాకుండా ప్రభుత్వరంగ సంస్థలు, యూనివర్సిటీలు, ఇతర ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్స్లో పనిచేస్తున్నవాళ్లు ఉన్నారు. వీళ్లందరి డేటాను ఆన్లైన్ చేయనున్నారు. ఏయే శాఖలో ఎంత మంది ఉద్యోగులు ఉన్నారో తెలుసుకోవడంతోపాటు ఎవరెవరు ఎప్పుడు రిటైర్ అవుతున్నారు ?
ఖాళీలు ఎన్ని ఉంటున్నాయి ? ఎవరి పనితీరు ఏంటి ? వారికున్న రివార్డులు, రిమార్కులు ఏమిటి ? ఏమైనా చార్జ్‌మెమోలు ఉన్నాయా ? ఎక్కడ.. ఎంత కాలం పనిచేశారు ? లాంటి అన్ని వివరాలు ఇందులో పొందుపర్చనున్నారు. ఎవరిని ఎక్కడి నుంచి ఎక్కడికి బదిలీ చేస్తున్నారనే వివరాలు కూడా ఆన్లైన్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఈజీగా పని అవుతుందని, ఉద్యోగుల సెలవులు, ఈఎల్స్, ఇతరత్రావంటివన్నీ అందులోనే నమోదు చేసేందుకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నది.