
- నేల స్వభావాన్ని గుర్తించేందుకు ప్రభుత్వం సన్నాహాలు
హైదరాబాద్, వెలుగు: పంట పొలాల్లో మంచి దిగుబడులు రావాలంటే నేల ఎంత సారవంతంగా ఉందనేది తెలియాల్సి ఉంటుంది. సాయిల్ టెస్ట్‌ల ద్వారా పొలాల్లో భూసారం ఎంత అనేది తెలుసుకోవచ్చు. భూమిలో నత్రజని, భాస్వరం, పొటాష్ పరిమాణాల్లో మార్పులను భూసార పరీక్షల ద్వారా గుర్తించవచ్చు. ఈ కీలక సమాచారం తెలిపే భూసార పరీక్షలు గత బీఆర్ఎస్ పాలనలో అటకెక్కాయి. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం సాగుకు ప్రాధాన్యం ఇస్తుండడంతో పాటు సాయిల్ టెస్టులపైనా దృష్టి పెట్టింది. వచ్చే వానాకాలం సీజన్ మొదలయ్యే నాటికి రైతులకు భూసార ఫలితాలు అందించేలా ప్రణాళికలు చేస్తోంది. రాష్ట్రంలో పంటల సాగులో రసాయనిక ఎరువులు, యూరియా వాడకం గణనీయంగా పెరుగుతున్నది.
సాగుచేసే పంటల్లో అధిక దిగుబడి పొందడంలో నేల స్వభావం, భూసారం కీలకంగా ఉంటుంది. అధిక మోతాదులో రసాయన ఎరువుల వాడకంతో భూసారం తగ్గిపోతుంది. నేలలో సేంద్రియ కర్బనం తగ్గిపోవడంతో నేల గుల్లగా మారే లక్షణాన్ని క్రమంగా కోల్పోయి మట్టి గట్టి పడుతోంది. దీంతో దిగుబడి తగ్గడంతో పాటు పంటకు అయ్యే పెట్టుబడి పెరుగుతున్నది. మట్టి పరీక్ష ఫలితాలను బట్టి ఏ పంటకు ఏయే మోతాదులో ఎరువులు వేయాలో, వాటిని ఎప్పుడు వాడాలో తెలుస్తుంది. సాగు చేసిన పంటకు నేలలో సరైన పోషకాలు లేనప్పుడు భూసార పరీక్షలతో తగ్గిన పోషకాలను అందించి పంటల దిగుబడులు పెంచుకునే అవకాశం ఉంటుంది.
రైతు వేదిక పరిధిలో సాయిల్ టెస్టులు
రాష్ట్రంలో రైతు వేదికల పరిధిలోని క్లస్టర్ల వారీగా మట్టి నమూనాలు సేకరించి పరీక్షలు చేసి రైతుకు ఫలితాలు అందజేయాల్సి ఉంటుంది. మట్టి నమూనాలను ల్యాబ్‌లకు తరలించాల్సి ఉంటుంది. అగ్రికల్చర్ క్షేత్రస్థాయి సిబ్బంది రైతుల పొలాలకు వెళ్లి నమూనాలు సేకరిస్తారు. యాప్ ద్వారా జీపీఎస్ ఆధారంగా పంట భూముల మట్టి నమూనాలను తీసుకుని ఆ చిత్రాన్ని యాప్ లో అప్ లోడ్ చేస్తారు. ఫలితాలను రైతుల ఫోన్లకు మెసేజ్‌లు వెళ్లేలా సాఫ్ట్ వేర్ రూపొందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రైతుకు భూసార పరీక్ష ఫలితాల కార్డు సైతం అందజేస్తారు.
సాయిల్ టెస్ట్‌లతో ప్రయోజనాలు ఇవే..
సాయిల్ టెస్టులతో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించేందుకు వీలుంటుంది. భూముల్లో ఉన్న మినరల్స్, సేంద్రియ కర్బనము, నత్రజని, భాస్వరం, పొటాష్ వంటి పోషక విలువులతో పాటు పంటల అధిక దిగుబడికి వేయాల్సిన ఎరువుల మోతాదు తెలుసుకోవచ్చు. భూసార పరీక్షల ఆధారంగా పంట భూములు నిస్సారమై చెడిపోకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవచ్చు. నేల స్వభావాన్ని సమతుల్యం చేయడానికి పశువుల ఎరువు, కంపోస్టు, పచ్చిరొట్ట వంటి సేంద్రీయ ఎరువులు, రసాయనిక ఎరువులతో పాటు సమగ్రంగా ఏ మోతాదులో వాడాలో రైతులకు అవగాహన కల్పించవచ్చని నిపుణులు అంటున్నారు.