విశ్లేషణ : ఆమ్దానీ కోసం సర్కార్‌కు లిక్కరే కావాల్నా!

పేద, ధనిక భేదం లేకుండా మద్యం అలవాటు సామాజిక రుగ్మతగా మారుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో కోట్లాది మధ్య తరగతి, నిరుపేదల కుటుంబాలు మద్యం విషవలయంలో చిక్కుకొని విలవిల్లాడుతున్నాయి. ఇంట్లో పండగలు తదితర సందర్భాల్లో బంధువులను, స్నేహితులను ఆతిథ్యంతో తృప్తి పరచడం కోసం మద్యం ఇవ్వడాన్ని అనివార్యంగా మారుస్తున్నారు. కొన్ని చోట్ల మద్యం లేని సంబరాలకు అర్థం లేదనే స్థితికి చేరుకోవడం బాధాకరం. ఓ అంచనా ప్రకారం దేశంలో దాదాపు16 కోట్ల మంది మద్యం తాగడాన్ని అలవాటుగా మార్చుకున్నారని, వారిలో 6 కోట్ల మంది మద్యానికి అడిక్ట్​ అయ్యారని, ఏటా 30 లక్షలకు పైగా జనం ప్రాణాలు కోల్పోతున్నట్లు తేలింది. మద్యానికి బలై పోతున్న వారిలో యువతే ఎక్కువగా ఉంటోంది. సంపద సృష్టికర్తలుగా మారాల్సిన నిరుద్యోగ యువత ఈ వ్యవస్థ పై కసి, కోపంతో ఆవేదనను మరిచి పోవడానికి అనివార్యంగా తాగుడుకు అలవాటు పడుతున్నారు. కుటుంబానికి వెన్నెముకగా మారాల్సిన యువకులే కుటుంబాల కూకటి వేళ్లకు చెద పట్టిస్తుండటం గమనార్హం.

ప్రజారోగ్యంపై పట్టింపేది

విచ్చలవిడి మద్యం అమ్మకాలు, పర్మిట్ రూములతోపాటు చట్ట విరుద్ధంగా బెల్ట్ షాపులకు అవకాశం ఇవ్వడం ద్వారా  రాష్ట్రంలో దాదాపు 19 శాతం మంది జనం మద్యానికి బానిసలుగా మారుతున్నారు. గుండె, లివర్ ​సంబంధిత, షుగర్ వ్యాధులతో జీవన్మరణ పోరాటం చేస్తున్నారు. చేతి నిండా పనిలేక, డబ్బులు రాకా దుర్భర జీవనం గడుపుతున్న పేద, మధ్య తరగతి కుటుంబాలు మద్యం రక్కసికి మరింత బలైపోతున్నాయి. వైద్య ఖర్చుల కోసం ఆస్తులు, ఇండ్లు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంటోంది. కల్తీ కల్లు, లిక్కర్ బారి నుంచి ప్రజలను కాపాడాల్సిన ప్రొహిబిషన్ అండ్​ఎక్సైజ్ శాఖ పట్టించుకోవడం లేదు. కల్తీ మద్యం తాగి అనేక మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఉదంతాలు అక్కడక్కడా జరుగుతున్నా.. వీటిపై స్పందించే వారే లేకుండా పోయారు. 

జోరుగా లిక్కర్​ అమ్మకాలు

చిరుద్యోగులు, అధికారులు, ఉన్నతాధికారులు, కాంట్రాక్టర్లు, ధనవంతుల జీవనంలో మద్యం ఓ సోషల్ స్టేటస్ గా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సామాజిక జీవనంలో మందు తాగే వాళ్లే విస్తృత ప్రజా సంబంధాలను కలిగి ఉంటారనే భావన కూడా ప్రబలంగా పెరుగుతుండటం బాధాకరం. మరోవైపు వృత్తి పరమైన ఒత్తిడి నుంచి రిలీఫ్​పొందేందుకు మద్యం ఎంతో ఉపయోగపడుతుందనే నెపంతో కొందరు క్రమంగా తాగుబోతులుగా మారుతున్నారు. సాఫ్ట్ వేర్ నిపుణులు,సెలబ్రిటీలు, సినీ, రాజకీయ కుటుంబాలకు చెందిన హై ప్రొఫైల్ పీపుల్, పబ్​లు, రేవ్ పార్టీల్లో మద్యంతో మొదలై మత్తు పదార్థాల ఊబిలో కూరుకుపోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రేటర్​హైదరాబాద్, ఇతర పట్టణాలు సహా అనాదిగా ప్రశాంతతకు మారుపేరుగా కొనసాగుతున్న పల్లెల్లో కూడా మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. జనం మద్యం మత్తులో తమ జేబులు గుల్ల చేసుకుంటూ కుటుంబాలను ఆర్థికంగా మరింత పేదరికంలోకి నెట్టుకుంటున్నారు. 

ప్రభుత్వాలు చేయాల్సిందేమిటి?

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం కోసం చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన ఆర్థిక వనరులను పెద్ద మొత్తంలో సేకరించుకోవడం అనివార్యమే. అయితే ఆ నిధుల సమీకరణ మార్గాలు ప్రజల ఆరోగ్యానికి హానికలిగించేవి, వారి కుటుంబ ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేసేవి కాకూడదు. ప్రజల సంక్షేమానికి చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల అమలు కోసం అవసరమైన ఆర్థిక వనరుల సేకరణ కోసం ప్రభుత్వాలు ఎక్సైజ్ శాఖ రాబడిపై అధికంగా ఆధారపడటం మానేయాలి. పారిశ్రామిక, వ్యవసాయ,సేవా రంగం లాంటి ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను ఎంచుకోవాలి. కోట్లాది మంది ప్రజలను అనారోగ్యం పాలు చేయడంతో పాటు వారు లక్షల సంఖ్యలో మృత్యువాత పడటానికి కారణమవుతున్న మద్యాన్ని అంచెలంచెలుగా అరికట్టాలి. గుడుంబా, ఛీప్ లిక్కర్ లాంటి హానికర మద్యం తయారీ దార్లపై, బెల్ట్ షాపులపై ఉక్కు పాదం మోపాలి. మద్యం బానిసలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు చేరువలో డీ అడిక్షన్ సెంటర్ల ను ఏర్పాటు చేసి వారి చేత తాగుడు అలవాటు మాన్పించాలి. ఎన్నికల సమయంలో సాగే మద్యం పంచుడు కార్యక్రమాలకూ అడ్డుకట్ట వేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం గురించి పట్టించుకోకపోయినా.. వారి ఆరోగ్యం దెబ్బతినకుండా ఇలాంటి చర్యలు తీసుకోవడం అత్యవసరం. 

నేరాలకు మూల కారణం..

విచ్చలవిడిగా సాగుతున్న మద్యం విక్రయాలతో మందుబాబులు రోజు రోజుకు పెరుగుతున్నారు. మద్యం మత్తులో వాళ్లు ఏం చేస్తున్నారో వాళ్లకే తెలియని పరిస్థితి నెలకొంది. మహిళలు, చిన్న పిల్లలపై దారుణాలకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవలి కాలంలో వెలుగులోకి వచ్చాయి. సమాజంలో జరుగుతున్న నేరాలకు 37 శాతం మూల కారణం మద్యమే అని తేలింది. తక్కువ శ్రమతో అత్యధిక లాభాలు సమకూరుస్తున్న మద్యం వ్యాపారం ఓ మాఫియాగా రూపాంతరం చెంది వారి లాభాల కోసం ఈ సమాజాన్ని నైతికంగా, ఆర్థికంగా విచ్ఛిన్నం చేస్తోంది. 

రాబడిలో 65 శాతం లిక్కర్​ నుంచే..

మూడున్నర కోట్ల పై చిలుకు ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం, భద్రత, ఆరోగ్యం కోసం ప్రభుత్వం అవసరమైన ఆర్థిక వనరుల సేకరణపై దృష్టి పెట్టాల్సిందే. అయితే ప్రజల ప్రాణాలకు హాని కలిగించడం ద్వారా ఆదాయం రాబట్టుకోవాలనుకోవడం సరికాదు. తెలంగాణ సర్కారు ఎక్సైజ్ శాఖ ద్వారా ఏటా 25 వేల కోట్ల నుంచి 30 వేల కోట్ల రూపాయల ఆదాయం పొందుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 26 శాతంగా ఉన్న ఎక్సైజ్ శాఖ రాబడి ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏకంగా 65 శాతానికి పెరగడాన్ని బట్టి తెలంగాణ రాష్ట్రం అధిక రాబడి కోసం ఈ శాఖపై ఏ మేరకు ఆధారపడుతోందో తెలుస్తోంది. ప్రభుత్వం అవసరమైన ఆర్థిక వనరుల సేకరణ కోసం 959 బార్లు, 27 క్లబ్ లు, 2144  లిక్కర్ షాపులకు పర్మిషన్ ​ఇచ్చి మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తోంది. అంతటితో ఆగకుండా వైన్ షాపులకు అమ్మకాల కోటా టార్గెట్ ఫిక్స్ చేయడం, పర్మిట్ రూములను అనుమతించడం, బార్ లను అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచడం లాంటివి చేస్తోంది. ప్రజల్లో మద్యం అలవాటు క్రమంగా పెరుగుతోంది. కూడు, గూడు, గుడ్డ కంటే కూడా మొదటి ప్రయారిటీ మద్యానికి ఇస్తుండటం ఆందోళనకరం. 
- నీలం సంపత్, సామాజిక కార్యకర్త