ఆయిల్​పామ్ తో అధిక లాభాలు

ఆయిల్​పామ్ తో అధిక లాభాలు
  •  వరి, పత్తికి ప్రత్యామ్నాయ పంట​
  •  సబ్సిడీపై మొక్కలు, డ్రిప్​ సప్లై చేస్తున్న ప్రభుత్వం
  •  నాలుగేండ్లలో దిగుబడి.. ఎకరాకు రూ.2లక్షల రాబడి 
  •  కన్నెపల్లి మండలంలో పామాయిల్​ ఇండస్ట్రీ ఏర్పాటుకు చర్యలు 
  •  ‘వెలుగు’తో హార్టికల్చర్​ అసిస్టెంట్​ డైరెక్టర్ ​అనిత

మంచిర్యాల, వెలుగు: జిల్లాలో వరి, పత్తి పంటలకు ప్రత్యామ్నాయంగా ఆయిల్​ పామ్​ సాగుకు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయని హార్టికల్చర్​ అసిస్టెంట్​ డైరెక్టర్ ​అనిత అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్​ పామ్ సాగుపై ప్రత్యేక దృష్టి సారించి దాన్ని ప్రోత్సహించేందుకు పలు చర్యలు తీసుకుంటోందన్నారు. వాణిజ్య పంటగా రైతులకు లాభదాయకంగా ఉంటుందన్నారు. దిగుబడి వచ్చేంతవరకు అంతర పంటల సాగుతో అదనపు ఆదాయం కూడా పొందవచ్చని తెలిపారు. వరి, పత్తి పంటలతో పోల్చితే రైతులు తక్కువ పెట్టుబడి, తక్కువ శ్రమతో మంచి లాభాలు సాధించే అవకాశం ఉందన్నారు. ఈ పంట​సాగుకు సంబంధించిన వివరాలను ఆమె వెల్లడించారు. 

30 ఏండ్ల దాకా దిగుబడి

ఆయిల్​ పామ్ ​మొక్కలను ఒకసారి నాటితే 30 సంవత్సరాల వరకు దిగుబడి ఇస్తాయి. నాలుగో సంవత్సరం నుంచి రైతుకు పంట చేతికి వస్తుంది. మొదటి నాలుగు సంవత్సరాల వరకు ప్రభుత్వమే నిర్వహణ ఖర్చులు భరిస్తున్నది. మొదటి మూడు సంవత్సరాలు మొక్కజొన్న, పత్తి,  వేరుశనగ లాంటి పంటలను అంతర పంటగా సాగు వేసుకోవచ్చు. నాలుగో సంవత్సరం నుంచి పంట దిగుబడి వస్తుంది. ఎకరాకు కనీసం 10 టన్నులకు తక్కువ కాకుండా దిగుబడి పొందవచ్చు. చెట్టు పెరిగే కొద్దీ మెలకువలు పాటిస్తూ 15 నుంచి 20 టన్నుల వరకూ దిగుబడి సాధించవచ్చు. 

ఎకరాకు రూ.2లక్షల ఆదాయం

రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్​ పామ్ సాగుచేసే రైతులకు మొదటి నాలుగు సంవత్సరాల్లో అంతర పంటల సాగుకు, కలుపు తీయడానికి, ఇతర నిర్వహణ ఖర్చుల కోసం ఎకరానికి రూ.4,200 ఆర్థిక సాయం అందిస్తోంది. మార్కెట్​లో రూ.193 ఉన్న మొక్కలను సబ్సిడీపై కేవలం రూ.20కే రైతులకు సప్లై చేస్తోంది. డ్రిప్ యూనిట్​ ఖర్చులో ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం, బీసీలకు 90 శాతం, ఇతరులకు 80 శాతం సబ్సిడీగా అందిస్తోంది.

రైతులు ఆయిల్​ పామ్ ​సాగు చేపట్టడానికి మొదటి సంవత్సరం మొక్కలు పెట్టడానికి వీలుగా గుంతలు తవ్వుకోవడం, డ్రిప్ ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైన ఖర్చులు ఎకరాకు రూ.10 వేల వరకు భరిస్తే సరిపోతుంది. ప్రస్తుతం మార్కెట్​లో ఆయిల్​పామ్​గెలల రేటు టన్నుకు రూ.20,500 ఉంది. సాధారణ దిగుబడి 10 టన్నులు వచ్చినా ఎకరాకు రూ.2లక్షలకు తగ్గకుండా రైతుకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది.
జిల్లాలోనే పామాయిల్​ఇండస్ట్రీ

మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో మ్యాట్రిక్స్ అనే కంపెనీ ఆయిల్​ పామ్​ నర్సరీ ఏర్పాటుచేసి సాగును ప్రోత్సహిస్తోంది. ఇక్కడ ఉత్పత్తి అయిన ఆయిల్​ పామ్ గెలలను రైతుల నుంచి కొనుగోలు చేసి మిల్లుకు తరలిస్తారు. 

మంచిర్యాల జిల్లా కన్నె పల్లి మండలంలో 70 ఎకరాల్లో పామాయిల్​ఇండస్ట్రీ ఏర్పాటు కోసం భూమిని కొనుగోలు చేసింది. ఆయిల్​పామ్​గెలలను అమ్ముకోవడానికి రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కంపెనీ ప్రతినిధులు తోట దగ్గరికే వచ్చి కొనుగోలు చేస్తారు. మంచిర్యాల జిల్లాలో 2020-21 నుంచి ఆయిల్​ పామ్​ సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే 4 వేల ఎకరాల్లో తోటలు సాగవుతున్నాయి. 2024-2025కి 1,800 ఎకరాల లక్ష్యానికి ఇప్పటివరకు 556 ఎకరాలకు అనుమతి పొంది 356 ఎకరాలకు మొక్కులు పంపిణీ చేశాం. చెన్నూర్​ మండలంలో ముందుగా సాగుచేసిన రైతులకు ఇప్పటికే పంట చేతికి వస్తోంది.