మహిళా సంఘాలకు ఫిష్ వెహికల్స్

మహిళా సంఘాలకు ఫిష్ వెహికల్స్
  • ఇందిరా మహిళా శక్తి స్కీమ్ కింద ఇచ్చేందుకు నిర్ణయం
  • జిల్లాకొకటి చొప్పున32 వాహనాలు సిద్ధం చేసిన సెర్ఫ్
  • వచ్చే నెల 3న ప్రారంభించనున్న మంత్రి సీతక్క

హైదరాబాద్, వెలుగు: ఇందిరా మహిళా శక్తి స్కీమ్​లో భాగంగా మహిళా సంఘాలకు సంచార చేపల విక్రయ వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్నది. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ఫ్) 32 వాహనాలను సిద్ధం చేసింది. వచ్చే నెల 3వ తేదీన వీటిని మంత్రి చేతుల మీదుగా ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాకు ఒకటి చొప్పున మొత్తం 32 వాహనాలను మహిళా సంఘాల కోసమే ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. ఒక్కో వాహనం తయారు చేసేందుకు రూ.10 లక్షలు కేటాయించారు.

మొత్తం రూ.3.20 కోట్లతో వీటిని కొనుగోలు చేశారు. ఈ వాహనాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్​వై)తో అనుసంధానం చేయనున్నారు. 60 శాతం సబ్సిడీతో రూ.4 లక్షలకే ఈ వెహికల్​ను మహిళా సంఘాలకు కేటాయించనున్నారు. ఈ రుణాన్ని బ్యాంకుల ద్వారా వడ్డీ లేకుండా సెర్ఫ్ ఇప్పించనున్నది. చేపలు ఎలా విక్రయించాలనేదానిపై మహిళలకు ఇప్పటికే ట్రైనింగ్ ఇచ్చారు.

గచ్చిబౌలిలోని నిథం ఇన్​స్టిట్యూట్ లో సెర్ఫ్ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు. చేపల విక్రయంతో పాటు వాటికి సంబంధించిన వంటకాల తయారీకి అవసరమైన ట్రైనింగ్ కూడా ఇచ్చారు. ఈ వాహనంలో ఉదయం పచ్చి చేపలు, సాయంత్రం చేప వంటకాలు తయారు చేసి అమ్ముకునేలా ప్రత్యేకంగా తయారు చేయించారు.