ఇందిరమ్మ అప్లికేషన్లు  రీవెరిఫికేషన్..గ్రామసభల్లో వచ్చిన అభ్యంతరాలు పరిశీలించండి  :  ఎండీ వీపీ గౌతమ్

ఇందిరమ్మ అప్లికేషన్లు  రీవెరిఫికేషన్..గ్రామసభల్లో వచ్చిన అభ్యంతరాలు పరిశీలించండి  :   ఎండీ వీపీ గౌతమ్
  • జిల్లా కలెక్టర్లకు హౌసింగ్  కార్పొరేషన్ ఎండీ ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ అప్లికేషన్లను మరోసారి వెరిఫికేషన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి అప్లికేషన్ ను క్షుణ్నంగా పరిశీలించి లబ్ధిదారులనుఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్లు, మున్సిపల్  కమిషనర్లు, ఎంపీడీవోలను హౌసింగ్  కార్పొరేషన్  ఎండీ వీపీ గౌతమ్  ఆదేశించారు. ఈ మేరకు గురువారం ఆయన సర్క్యులర్ ను జారీ చేశారు. గతంలో అప్లై చేసుకున్న పబ్లిక్  ఇటీవల జరిగిన గ్రామసభల్లో పలు అభ్యంతరాలు తెచ్చారని,  గ్రామసభల్లో వచ్చిన కొత్త అప్లికేషన్లను సైతం క్షుణ్నంగా పరిశీలించాలని ఆయన పేర్కొన్నారు.

ఇటీవల రాష్ర్టవ్యాప్తంగా ఈనెల 21 నుంచి 25 వరకు గ్రామసభలను ప్రభుత్వం నిర్వహించింది. ఇందులో ఇందిరమ్మ ఇళ్లకు రాష్ర్టవ్యాప్తంగా లక్షకుపైగా అప్లికేషన్లు వచ్చాయి. అందులో అర్హులు 5 వేలలోపే ఉంటారని హౌసింగ్  అధికారులు చెబుతున్నారు. వీటిపై అధికారులు గ్రామాల్లో సర్వే చేసి అర్హుల జాబితా సిద్ధం చేస్తున్నారు. దీంతో ఈనెల 26న రాష్ర్టవ్యాప్తంగా 72 వేల మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. వీటిని కూడా పరిశీలించి అనర్హులు ఉంటే తొలగించాలని ఎండీ ఆదేశించారు.

3 కేటగిరిలుగా అప్లికేషన్లు డివైడ్

ప్రజావాణిలో ఇందిరమ్మ స్కీమ్ కు వచ్చిన అప్లికేషన్లను ఎల్1, ఎల్ 2, ఎల్ 3 గా హౌసింగ్  కార్పొరేషన్  విభజించింది. రాష్ర్టవ్యాప్తంగా మొత్తం 80.54 లక్షల  అప్లికేషన్లు రాగా.. వాటిలో 10 లక్షలు గ్రేటర్  హైదరాబాద్ లోనే ఉన్నాయి. ఎల్ 1లో సొంత జాగా ఉండి ఇళ్లు లేనివాళ్లు, ఎల్ 2 లో స్థలం, ఇల్లు రెండూ  లేనివాళ్లు, ఎల్ 3లో అద్దె ఇంట్లో ఉన్నవారు, రేకుల షెడ్, పెంకుటిండ్లలో ఉన్నవారిగా విభజించింది. ప్రస్తుతం ఎల్ 1 పబ్లిక్ కు ఇండ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించగా, ఎల్ 2లో స్థలం, ఇళ్లులేని వారిని రెండో దశలో తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని అప్లికేషన్ల సర్వే అన్ని జిల్లాలో పూర్తి కాగా, గ్రేటర్ లో సుమారు 70 శాతం పూర్తయిందని అధికారులు చెబుతున్నారు.

పాత ఇందిరమ్మ ఇండ్లకు సహాయం?

ఉమ్మడి రాష్ర్టంలో ఇందిరమ్మ ఇళ్లు తీసుకొని సొంత నిధులతో ఇళ్లు పూర్తి చేసుకున్న వారికి కూడా ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.  రాష్ర్టంలో ఇలాంటి వాళ్లు సుమారు 2 లక్షల మంది ఉంటారని అధికారులు అంచనా వేశారు. 2014లో టీఆర్ఎస్  అధికారంలోకి రాగానే స్కీమ్  అమలు  ఆపడంతో పాటు సగం అమౌంట్  అందుకున్న లబ్ధిదారులకు మిగతా నిధులను ఇవ్వలేదు. దీంతో పబ్లిక్  తమ సొంత నిధులుతో ఇళ్లు పూర్తి చేసుకున్నారు.  వీటిని పరిశీలించి అపుడు ప్రభుత్వం ఎంత అమౌంట్  ఇచ్చింది, ఇంటి నిర్మాణంలో బేస్ మెంట్, సగం ఇళ్లు, స్లాబ్  వంటి దశల్లో ఏ దశ వరకు సహాయం చేసింది, ఏ దశ నుంచి  సొంత నగదు ఖర్చుపెట్టారన్న వివరాలను హౌసింగ్  డిపార్ట్ మెంట్  సేకరించింది.