
- టానిక్ పై చర్యలకు సర్కార్ రెడీ..!
- వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీ ఎగ్గొట్టడంతో సర్కార్‌కు వందల కోట్ల నష్టం
- తాజాగా మరోసారి పూర్తి నివేదిక కోరిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు: టానిక్ ఎలైట్ వైన్స్ వ్యవహారంలో రాష్ట్ర సర్కార్ చర్యలకు రెడీ అవుతున్నట్లు తెలుస్తున్నది. ఈ మేరకు గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, టానిక్ ఎలైట్ వైన్స్‌లో జరిగిన అక్రమాలపై మరోసారి లోతుగా దర్యాప్తు చేయిస్తున్నది. రాష్ట్ర ఖజానాకు వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లడంతో వాటిని రికవరీ చేసే యోచనలో కూడా ఉన్నట్లు సమాచారం. టానిక్ వైన్స్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిసింది.
ఎలైట్ వైన్స్‌కు ఒక్క జూబ్లీహిల్స్లోనే అనుమతి ఉండగా.. హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో 9 చోట్ల అక్రమంగా టానిక్ ఎలైట్ పేర్లతో విదేశీ బ్రాండ్లను విచ్చలవిడిగా అమ్మినట్లు అధికారులు ఇప్పటికే గుర్తించారు. ఒకచోట పర్మిషన్ తీసుకుని.. ఇతర ప్రాంతాల్లోనూ అక్రమంగా అమ్మకాలు చేపట్టడంతో ప్రభుత్వానికి భారీగా వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీ నష్టం వాటిల్లింది. టానిక్కు ఇచ్చిన స్పెషల్ పర్మిషన్స్‌తో ఏడేండ్లలో రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు రూ.800 కోట్లు పైనే నష్టం వచ్చినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు.
అనుమతులు లేని ఫారిన్ బ్రాండ్లు అమ్మిన్రు
టానిక్ ఎలైట్ వైన్స్లలో ప్రత్యేకంగా ఫారిన్ లిక్కర్ కూడా సేల్ చేసే అనుమతులు గత ప్రభుత్వం ఇచ్చింది. అయితే, ఇదే అదునుగా తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ ప్రైజ్ రెగ్యులేట్ చేసి ఫారిన్ లిక్కర్ కాకుండా.. సొంతంగా అనుమతుల్లేని విదేశీ మద్యాన్ని సైతం అమ్మకాలు చేసినట్లు తెలుస్తున్నది.
కంప్యూటర్ హార్డ్‌వేర్‌లో నమోదైన సేల్స్ రిజిస్టర్స్‌ను పరిశీలించగా ఈ విషయం వెల్లడైనట్లు సమాచారం. ఈ వ్యవహారంలో ఎక్సైజ్ శాఖకు సంబంధించిన అధికారులు ఎవరైనా ఉన్నారా? అనే కోణంలోనూ విచారణ జరుగుతున్నది. బేవరేజెస్ కార్పొరేషన్ ప్రైజ్ రెగ్యులేట్ చేయని ఫారిన్ లిక్కర్‌ను రాష్ట్రంలో సేల్ చేయడం నేరం.
టానిక్ ఎలైట్ వైన్స్ పేరిట ప్రత్యేక జీవో జారీ
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2 వేలకు పైగా వైన్స్‌లను కాదని.. కేవలం టానిక్ ఎలైట్ వైన్స్ పేరిట 2016లో అప్పటి ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేసింది. ఇందులో కేవలం టానిక్ సంస్థకు మాత్రమే 13.6% ట్యాక్స్ కట్టకుండా వెసులుబాటు కల్పించింది. విదేశీ మద్యం తెచ్చుకునే ఆప్షన్ ఇచ్చింది. ఈ స్పెషల్ జీవో బయటపడిన తర్వాత కొందరు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో రాత్రికి రాత్రి రూల్స్ ఫ్రేమ్ చేసి, మళ్లీ ప్రత్యేకంగా కొత్త లైసెన్సులు మంజూరు చేశారు.
అందులో టానిక్ సంస్థ లబ్ధి పొందేలా ఐదేండ్ల పాటు ‘ట్యాక్స్ ఫ్రీ’తో పాటు 18 డిపోల నుంచి వైన్‌ను దిగుమతి చేసుకునేలా సౌకర్యం కల్పించారు. ఇతరులకు మాత్రం కేవలం తమకు కేటాయించిన డిపోల్లో మాత్రమే దిగుమతి చేసుకునేలా ఆదేశాలిచ్చారు. మిగిలిన షాపులతో పోలిస్తే.. టానిక్ షాప్‌లకు 2 గంటలు అదనంగా అమ్మకాలు చేసుకునేలా వెసులుబాటు ఉన్నది.
ఫారిన్ లిక్కర్ కూడా 18 డిపోల నుంచి టానిక్ సంస్థ దిగుమతి చేసుకునేలా ఆ జీవోలో పేర్కొన్నారు. ఒక్కచోట అమ్మకాలకు పర్మిషన్ ఇస్తే.. మరో 9 చోట్ల అక్రమంగా సేల్స్ జరిపారు. ఈ వ్యవహారంపై 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అధికారులు టానిక్ ఎలైట్ వైన్స్ లో తనిఖీలు చేసి ప్రభుత్వానికి నివేదించారు.