
- రాష్ట్రవ్యాప్తంగా 81 వేలకు పైగా అప్లికేషన్లు
- తహసీల్దార్ల వద్దే 36 వేలు..
- మిగతావి ఆర్డీవోలు, అడిషనల్ కలెక్టర్లు, కలెక్టర్ల లెవల్‌లో...
మంచిర్యాల, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల భూభారతి పోర్టల్‌ను ప్రారంభించడంతో ధరణి పెండింగ్ అప్లికేషన్లపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరగా డిస్పోజ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సీసీఎల్‌ఏ నవీన్ మిట్టల్ ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆర్డర్స్ జారీ చేశారు. దీంతో సోమవారం నుంచి పెండింగ్ అప్లికేషన్ల క్లియరెన్స్ ప్రక్రియ స్పీడప్ కానుంది.
ధరణితో పెరిగిన వివాదాలు
బీఆర్‌ఎస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక 2020 అక్టోబర్ 29న ధరణి పోర్టల్‌ను ప్రవేశపెట్టింది. ఈ పోర్టల్ అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా భూసమస్యలు, వివాదాలు మరింత పెరిగాయి. వీటిని పరిష్కరించేందుకు పోర్టల్‌లో 33 మాడ్యుల్స్‌ను రూపొందించారు. సమస్యలను పరిష్కరించే అధికారం కలెక్టర్లకు అప్పగించడం, రెవెన్యూ కోర్టులను రద్దు చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఈ క్రమంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ధరణి లోపాలను సవరిస్తూ భూభారతి పోర్టల్‌ను తీసుకొచ్చింది. దీంతో ధరణిలో పెండింగ్‌లో ఉన్న అప్లికేషన్లను త్వరగా డిస్పోజ్ చేయాలని సూచించడంతో పాటు ఈ నెల 14 నుంచి వచ్చిన దరఖాస్తులను భూభారతి పోర్టల్ గైడ్‌లైన్స్ ప్రకారమే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా 81 వేలకు పైగా పెండింగ్
ధరణి పోర్టల్‌లో ఈ నెల 17 వరకు రాష్ట్రవ్యాప్తంగా 81,836 అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో తహసీల్దార్ల దగ్గరే 36 వేలకు పైగా అప్లికేషన్లు పెండింగ్‌లో ఉండగా మిగతావి ఆర్డీవోలు, అడిషనల్ కలెక్టర్లు, కలెక్టర్ల లెవల్‌లో పెండింగ్‌లో ఉన్నాయి. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 12,436 అప్లికేషన్లు పెండింగ్‌లో ఉండగా, సంగారెడ్డిలో 7,863, వికారాబాద్‌లో 6,320 అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి. అతి తక్కువగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 577, ఆదిలాబాద్‌లో 556, ములుగులో 363 దరఖాస్తులు పెండింగ్‌లో పడ్డాయి.
మంచిర్యాల జిల్లాలో 1,620 అప్లికేషన్లు బ్యాక్‌లాగ్ ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణిపై పలుమార్లు స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. గతంలో భూసమస్యలను పరిష్కరించే అధికారం కలెక్టర్లకు మాత్రమే ఉండడంతో దరఖాస్తులు పేరుకుపోతున్నాయని గుర్తించింది. దీంతో అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లకు సైతం అధికారాలు అప్పగించింది. అయినప్పటికీ కొత్తగా వేల సంఖ్యలో దరఖాస్తులు వస్తూనే ఉన్నాయి.
ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు
ధరణి పెండింగ్ అప్లికేషన్లను త్వరగా పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తగిన చర్యలు తీసుకుంటున్నాం. పెండింగ్ అప్లికేషన్లపై జిల్లాలో స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నాం. తహసీల్దార్లు, ఆర్డీవోల స్థాయిలో పెండింగ్‌లో ఉన్న వాటిపై ఫోకస్ పెడుతాం.- సభావత్ మోతీలాల్, అడిషనల్ కలెక్టర్, మంచిర్యాల