అదానీ రూ.100 కోట్ల విరాళం మాకొద్దు: సీఎం రేవంత్ కీలక ప్రకటన

అదానీ రూ.100 కోట్ల విరాళం మాకొద్దు: సీఎం రేవంత్ కీలక ప్రకటన

హైదరాబాద్: ప్రముఖ వ్యాపారవేత్త, బిలియనీర్ గౌతమ్ అదానీపై అమెరికాలో పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న స్కిల్ యూనివర్శిటీకి గౌతమ్ అదానీ ప్రకటించిన రూ.100 కోట్ల విరాళాన్ని ప్రభుత్వం తిరస్కరించింది. ఈ విషయాన్ని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‎లోని తన నివాసంలో 2024, నవంబర్ 25న సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్కిల్ యూనివర్శిటీకి గౌతమ్ అదానీ ప్రకటించిన రూ.100 కోట్ల విరాళాన్ని తిరస్కరిస్తున్నామని తెలిపారు. ఈ మేరకు ఆదివారమే (నవంబర్ 24) గౌతమ్ అదానీకి లేఖ రాశామని.. రూ.100 కోట్ల విరాళాన్ని స్కిల్ యూనివర్శిటీకి ట్రాన్స్ ఫర్ చేయొద్దని చెప్పామన్నారు. గౌతమ్ అదానీపై అవినీతి ఆరోపణలు వస్తోన్న నేపథ్యంలో విరాళాన్ని రిజెక్ట్ చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. యంగ్ ఇండియా స్కిల్ వర్శిటీకి చాలా సంస్థలు నిధులివ్వటం జరిగిందని.. అలాగే సోషల్ రెస్పాన్సిబులిటీ కింద రూ.100 కోట్లు ఇస్తామని అదానీ గ్రూప్ చెప్పిందన్నారు. 

ALSO READ | KTRకు కొత్త పేరు పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి

కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఏ సంస్థ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు.. అదానీ గ్రూప్ నుండి కూడా మాకు ఒక్క రూపాయి రాలేదని తెలిపారు. వివాదాలు, ఆరోపణల నేపథ్యంలో అదానీ విరాళం మాకొద్దని ప్రభుత్వం లేఖ రాసిందని.. కావాలని మాపై కొందరు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనవసర వివాదాల్లోకి రాష్ట్ర ప్రభుత్వాన్ని లాగొద్దని కోరారు.  ప్రస్తుతం దేశవ్యాప్తంగా అదానీ గురించే చర్చ జరగుతోందని.. అదానీ వ్యవహారాన్ని రాహుల్ గాంధీ మొదటి నుంచి ప్రశ్నిస్తూనే ఉన్నారని అన్నారు. అదానీకి టెండర్లు ఇవ్వడంపై స్పందిస్తూ.. చట్ట ప్రకారం, నిబంధనల ప్రకారం టెండర్లు ఇవ్వడం సాధారణమని అన్నారు.