జిల్లాల్లో ఫాస్ట్..​ జీహెచ్ఎంసీలో స్లో

  • ములుగు, జనగాం జిల్లాల్లోవంద శాతం కుల గణన సర్వే పూర్తి
  • 17 జిల్లాల్లో 90 శాతానికిపైగా కంప్లీట్​
  • జీహెచ్ఎంసీలో  60.60 శాతమే

హైదరాబాద్, వెలుగు:  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి సమగ్ర కుల గణన సర్వే రెండు, మూడు రోజుల్లో 100 శాతం పూర్తి కానున్నది. జనగాం, ములుగు జిల్లాల్లో గురువారం నాటికి 100 శాతం సర్వే కంప్లీట్ అయిందని  ప్రభుత్వం వెల్లడించింది. నల్గొండ జిల్లాలో 99.7 శాతం  పూర్తిచేసుకొని,  వంద శాతానికి చేరువలో ఉన్నది. కామారెడ్డి, మంచిర్యాల, యాదాద్రి భువనగిరి, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, జోగులాంబ గద్వాల్, మహబూబ్ నగర్, మెదక్, మహబూబాబాద్, పెద్దపల్లి, కుమ్రం భీం ఆసిఫాబాద్, నారాయణ పేట్, జయశంకర్ భూపాల పల్లి, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో 90 శాతానికి పైగా సర్వే పూర్తయింది.

 హనుమకొండ (75.7 శాతం), మేడ్చల్ మల్కాజ్ గిరి (71.2 శాతం) మినహా  మిగతా జిల్లాల్లో  80 శాతానికి పైగా సర్వే కంప్లీట్ అయింది. జీహెచ్ఎంసీ పరిధి లో 25,05,517 ఇండ్లు సర్వే చేయాల్సి ఉండగా..  15,17,410 ఇండ్లు అంటే  60.60 శాతం పూర్తయింది. సర్వేను సకాలం లో పూర్తి చేసేవిధంగా జిల్లా ఇన్ చార్జి అధికారులు, కలెక్టర్లు పనిచేస్తున్నారు. ఈ నెల 23 లేదా 24 కల్లా క్షేత్రస్థాయిలో వివరాల సేకరణ పూర్తి చేయాలని ప్రభుత్వం డెడ్​లైన్​ విధించింది.