- మరో రూ.28 కోట్లు అవసరమని జీహెచ్ఎంసీ అంచనా
హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ పరిధిలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.3 కోట్లు విడుదల చేసింది. అయితే సర్వే పూర్తిచేసేందుకు రూ.31 కోట్లు అవసరమని బల్దియా అధికారులు అంచనా వేశారు. మరో రూ.28 కోట్లు కావాలని ప్రభుత్వాన్ని కోరారు. డిసెంబర్ 8 లోపు సర్వే పూర్తిచేసి 9న ప్రభుత్వానికి, బీసీ కమిషన్ కు రిపోర్ట్ అందజేయనున్నారు. బుధవారం ఖైరతాబాద్ నియోజకవర్గంలో హైదరాబాద్ జిల్లా ఇన్చార్జ్మంత్రి పొన్నం ప్రభాకర్ సర్వేను ప్రారంభించనున్నారు.
మూడ్రోజులపాటు ఇంటింటికి తిరుగుతూ డోర్లకు స్టిక్కర్లు వేయనున్నారు. మళ్లీ సర్వే కోసం ఎప్పుడు వస్తారో, ఏయే వివరాలు అందుటులో ఉంచుకోవాలో సూచించనున్నారు. ఈ నెల 9 నుంచి 24 వరకు ఎన్యుమరేటర్లు సర్వే చేస్తారు. పూర్తయిన వెంటనే ఎప్పటికప్పుడు డేటా ఎంట్రీ చేస్తారు. తర్వాత ప్రభుత్వానికి రిపోర్టు అందజేయనున్నారు.
సర్వే కోసం మొత్తం 18,723 మంది ఎన్యుమరేటర్లు, 1,870 మంది సూపర్ వైజర్లను నియమించారు. సర్వే చేసినందుకు హనరరీ ఇన్ కమ్ కింద ఎన్యుమరేటర్లకు రూ.10వేలు. సూపర్ వైజర్లకు రూ.12 వేలు అందించనున్నారు.