- 2007లో తొలి విగ్రహాన్ని ఆవిష్కరించిన విజయశాంతి
- ఆ తర్వాత కేసీఆర్ టేబుల్ పై బతుకమ్మతో ఉన్న విగ్రహం
- 1945 లోనే తెలంగాణ తల్లిని ప్రస్తావించిన కవి రావెళ్ల
- కేసీఆర్ సొంత ఆలోచనతో కిరీటం, నగలతో ఇంకొక స్టాచ్యూ
- రేవంత్ రెడ్డి సర్కారు ఫైనల్ చేసింది నాలుగో స్టాచ్యూ
హైదరాబాద్: కదనాన శత్రువుల కుత్తుకల నవలీల.. నుత్తరించిన బలోన్మత్తులేలిన భూమి.. ధీరులకు మొగసాలరా! .. తెలగాణ వీరులకు కాణాచి రా! అంటూ తెలంగాన తల్లి ఔన్నత్యాన్ని చాటారు తెలంగాణ కవి రావెళ్ల వెంకటరామారావు. ఈ మట్టి విశిష్టతను.. ధిక్కార స్వరాన్ని 1945 లోనే విడమర్చి చెప్పారాయన. ఆ నాడే తెలంగాణ తల్లి అనే పదానికి బీజం పడింది. అన్ని రాష్ట్రాలకు ఉన్నట్టే తెలంగాణ కు అధికారికంగా ఒక తల్లి విగ్రహం ఉండాలి. అయితే ఇప్పటి వరకు పదేండ్లు పాలించిన బీఆర్ఎస్ ఆ దిశగా ప్రయత్నం చేయలేదు. ప్రస్తుతం కిరీట, నగలు, వజ్రవైఢూర్యాలు కలిగి తెలంగాణ తల్లి విగ్రహాలు కనిపిస్తున్నాయి.
అయితే అంతకు ముందే రెండు విగ్రహాలు ఉండేవి. 2007 జనవరి 25న యాదాద్రి జిల్లా రాజపేట మండలం బేగంపేటలో సుదగాని వెంకటేశ్ పెట్టిన విగ్రహాన్ని అప్పటి తల్లి తెలంగాణ పార్టీ వ్యవస్థాపకురాలు విజయశాంతి ఆవిష్కరించారు. అదే ఇప్పటివరకు తెలిసిన తొలి విగ్రహం. తర్వాత ఇదే రూపానికి బతుకమ్మ పట్టుకున్నట్లుగా మార్చి కొంతకాలం కేసీఆర్ టేబుల్ మీద ఉపయోగించారు. అది రెండో రూపం. ఆ తర్వాత కేసీఆర్ సొంత ఆలోచనతో కిరీటం, నగలతో ఇప్పటివరకు ప్రచారంలో ఉన్న విగ్రహాన్ని ప్రమోట్ చేసింది మూడో రూపం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది నాలుగో రూపం.
అయితే తెలంగాణ వచ్చాక పదేండ్లలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా నిర్ణయించలేదు. దీంతో ఇప్పటి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చినట్లు అయ్యింది. అట్లాగే ఇప్పటి వరకు ప్రచారంలో ఉన్న నాలుగు రూపాల్లో మొదటి, రెండు, నాలుగో రూపాలు కాస్త తేడాతో దాదాపు ఒకే రకమైన కట్టుబొట్లుతో ఉన్నాయి. మొదటి రూపంలో బతుకమ్మ లేదు, రెండో రూపంలో ఉంది. ఈ రెండు రూపాల్లోను కుడిచేతిలో కంకులు, కాళ్లకు కడియాలు ఉన్నాయి.
ALSO READ | తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్
ఇప్పుడు తెచ్చిన నాలుగో రూపంలో బతుకమ్మ లేదు, ఎడమచేతిలో కంకులు, కాళ్లకు పట్టాగొలుసు ఉన్నాయి. ఉద్యమపిడికిళ్లతో పీఠం వచ్చింది. నాలుగు రూపాల్లో బీఆర్ఎస్ ప్రచారం చేసిన మూడో రూపం మాత్రమే భిన్నమైంది. బతుకమ్మ ఉండడం మినహాయించి సాంస్కృతిక ప్రతీకగా కంటే దేవత, రాజరిక ప్రతిరూపంగా ఉంది.
1945లోనే భావన
విజయశాంతి పెట్టిన పార్టీ పేరు తల్లి తెలంగాణ. చారిత్రకంగా దాశరథి కవిత్వం, రావెల వెంకటరామారావు గీతాల్లో తెలంగాణ తల్లి అనే భావనను 1945లో ఖమ్మం జిల్లాకు చెందిన తెలంగాణ కవి రావెళ్ల వెంకటరామారావు రాసిన ‘కదనాన శత్రువుల కుత్తుకల నవలీల.. ఉద్ధరించిన మదోన్మత్తులేలిన భూమి.. అనే గీతంలో నా తల్లి తెలగాణరా.. అని రాశారు. ఒక భావనగానే ప్రచారంలో ఉంది. అయితే ఇన్ని దశాబ్దాల్లో 2007 వరకు ఒక రూపం తేవడానికి ప్రయత్నాలు చేయలేదు.