- 272 నర్సింగ్ ఆఫీసర్,99 ఫార్మాసిస్ట్ పోస్టులు
- నోటిఫికేషన్ విడుదల చేసిన మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు
హైదరాబాద్, వెలుగు: వైద్య, ఆరోగ్య శాఖలో మరో 371 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో ఇప్పటికే 7,300 పోస్టులను భర్తీ చేయగా, మరో 6,500 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా 272 నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్ నర్స్) పోస్టులు, 99 ఫార్మాసిస్ట్ (గ్రేడ్ 2) పోస్టుల భర్తీకి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
గత నెల 18న విడుదల చేసిన 2,050 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు, ఈ 272 పోస్టులు అదనమని నోటిఫికేషన్‌లో పేర్కొంది. దీంతో మొత్తం నర్సింగ్ ఖాళీల సంఖ్య 2,322కు పెరిగింది. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ మొదలవగా, ఈ నెల 14వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అప్లయ్ చేసుకునేందుకు అవకాశం ఉంది. నవంబర్ 17న ఆన్‌లైన్‌లో రాత పరీక్ష నిర్వహించనున్నారు.
732 ఫార్మసిస్ట్ పోస్టులు..
గత నెల 24న 633 ఫార్మసిస్ట్ (గ్రేడ్ 2) పోస్టులకు మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేయగా, ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. ఇదే నోటిఫికేషన్‌కు అదనంగా మరో 99 పోస్టులను జత చేస్తున్నామని, దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 732కు పెరిగిందని రిక్రూట్‌మెంట్ బోర్డు తెలిపింది. ఈ పోస్టులకు అక్టోబర్ 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. నవంబర్ 30న ఆన్‌లైన్‌లో రాత పరీక్ష ఉంటుందని తెలిపింది. జోన్లు, కేటగిరీల వారీగా ఖాళీల సంఖ్యను బోర్డు వెబ్‌సైట్‌లో https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htmలో అందుబాటులో ఉంచామని వెల్లడించింది.