ఆరోగ్యశ్రీకి రూ.120 కోట్లు రిలీజ్.. నిధులు విడుదల చేసిన ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: ఆరోగ్య శ్రీ పథకం కోసం ప్రభుత్వం ఒక్క రోజులో రూ.120 కోట్లు రిలీజ్ చేసింది. ఫిబ్రవరిలో మరో రూ. 100 కోట్లు రిలీజ్ చేయనున్నట్టు వెల్లడించింది. దీంతో రాష్ట్రంలోని ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో  ఆరోగ్యశ్రీ సేవలు యధావిధిగా కొనసాగనున్నాయి. గురువారం నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్‌ ప్రతినిధులతో ఆరోగ్యశ్రీ సీఈవో శివ శంకర్ చర్చలు జరిపారు. పేషెంట్లకు ఇబ్బంది కలిగించకుండా వైద్య సేవలు అందించాలని విజ్ఞప్తి  చేశారు. పెండింగ్ నిధుల్లో కొన్ని విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. 

దీంతో  ఎప్పటిలాగే సర్వీసులు కొనసాగించేందుకు అసోసియేషన్ ప్రతినిధులు అంగీకరించారు. ఈ మేరకు ప్రభుత్వం ప్రత్యేక నోట్‌ రిలీజ్ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం పవర్ లోకి వచ్చిన ఏడాది కాలంలోనే ఆరోగ్యశ్రీ కోసం హాస్పిటళ్లకు రూ.1,130 కోట్లు చెల్లించింది. గత ప్రభుత్వం సుమారు రూ.730 కోట్లు బకాయిలు పెట్టగా.. ఈ ఏడాది కాలంలో కాంగ్రెస్​ ప్రభుత్వం రిలీజ్ చేసిన నిధుల్లో రూ.675 కోట్లు పాత బకాయిల కింద జమ అయ్యాయి. దీంతో మళ్లీ బకాయిలు పడ్డట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. వీటిని కూడా వీలైనంత త్వరగా రిలీజ్ చేస్తామని సర్కార్ స్పష్టం చేసింది. కాగా, 2013 నుంచి పెండింగ్ లో ఉన్న ప్యాకేజీ రేట్లను రూ. 22 శాతం పెంచారు. దీంతో డ్యూస్ పెరిగాయని ఆరోగ్య శ్రీ అధికారులు పేర్కొన్నారు. 

ప్రభుత్వ కమిట్​మెంట్​ను చూసి..

కాంగ్రెస్​అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే ఆరోగ్య శ్రీ కింద ఉచిత వైద్య పరిమితిని రూ.5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచింది. 1,375 వైద్య చికిత్సల ధరలను సుమారు 22% వరకు హైక్​ చేసింది. కొత్తగా 163 రకాల చికిత్సలను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకొచ్చింది. మొత్తం చికిత్సల సంఖ్యను 1,835కి పెంచింది. ఆరోగ్య శ్రీకి అదనంగా రూ.487.29 కోట్లను కేటాయించింది. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటళ్లకు గత బీఆర్ఎస్​ సర్కారు బకాయి పెట్టిపోయిన సుమారు రూ.730 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. ఆరోగ్య శ్రీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా హాస్పిటళ్లకు ఒకే ఏడాదిలో రూ.1130 కోట్లు రిలీజ్​ చేసింది. ప్రజల వైద్య సేవలకు ఆటంకం కలగకుండా ఆరోగ్య శ్రీకి ప్రతి నెలా పేమెంట్స్ చెల్లించేందుకు ప్రభుత్వం రెడీ ఉన్నట్టు తెలిపింది.