ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు రూ. లక్ష

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు రూ. లక్ష
  • బేస్ మెంట్ పూర్తి చేసిన 2019 మందికి మొదటి విడత  రూ.20.19 కోట్లు రిలీజ్
  • 12 మంది లబ్ధిదారులకు స్వయంగా  చెక్కులు అందజేసిన సీఎం రేవంత్​

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇండ్ల పథకానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా బేస్ మెంట్ నిర్మాణం పూర్తి చేసిన 2019 మందికి మొదటి విడత సహాయం కింద రూ.  లక్ష చొప్పున  రూ. 20.19 కోట్లను ప్రభుత్వం రిలీజ్​ చేసింది.  మంగళవారం హైదరాబాద్​నోవాటెల్​లో  12 మంది లబ్ధిదారులకు  లక్ష చొప్పున చెక్కులను సీఎం రేవంత్​రెడ్డి అందజేశారు. రెండో విడత లబ్ధిదారుల ఎంపిక కూడా ఈ నెల 30 కల్లా పూర్తి చేయాలని  కలెక్టర్లను ఆదేశించారు. 

13 వేల ఇండ్లకు పైగా గ్రౌండింగ్: పొంగులేటి

ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్​లో భాగంగా  ఇప్పటి వరకూ 13, 500 ఇండ్ల నిర్మాణం గ్రౌండింగ్ అయిందని  మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.  ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా  ఇందిర‌‌మ్మ ఇండ్ల నిర్మాణానికి ఆటంకం ఏర్పడ‌‌కుండా  నిధులు విడుద‌‌ల చేస్తామ‌‌ని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  మ‌‌ధ్యవ‌‌ర్తుల ప్రమేయానికి తావులేకుండా 4  విడ‌‌త‌‌ల్లో ల‌‌బ్ధిదారుల‌‌ బ్యాంక్ అకౌంట్ కు డబ్బులు జ‌‌మ‌‌చేస్తామ‌‌ని తెలిపారు.  బేస్ మెంట్ పూర్తైన త‌‌ర్వాత   రూ. ల‌‌క్ష, గోడ‌‌లు పూర్తైన త‌‌ర్వాత  రూ. 1.25 ల‌‌క్షలు , శ్లాబ్ పూర్తిచేసుకున్న త‌‌ర్వాత రూ. 1.75 ల‌‌క్షలు , ఇల్లు పూర్తైన త‌‌ర్వాత మిగిలిన  ల‌‌క్ష విడుద‌‌ల చేస్తామ‌‌ని వివ‌‌రించారు.  

అధికారుల కోసం ఎదురు చూడ‌‌కుండా ల‌‌బ్ధిదారులే ఫొటో తీసి మొబైల్ యాప్‌‌లో అప్‌‌లోడ్ చేసినా కూడా డ‌‌బ్బులు ఖాతాలో జ‌‌మ‌‌చేస్తామ‌‌ని  తెలిపారు. క‌‌నీసం 400 ఎస్ ఎఫ్ టీ కి త‌‌గ్గకుండా 600 ఎస్ ఎఫ్‌‌టీకి మించ‌‌కుండా ల‌‌బ్ధిదారులు  ఇంటిని నిర్మించుకోవాల‌‌ని సూచించారు. అర్హులైన ఇందిర‌‌మ్మ ఇండ్ల ల‌‌బ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మ‌‌రింత వేగ‌‌వంతం చేయ‌‌డం, అధికారుల‌‌కు , ప్రజాప్రతినిధుల‌‌కు స‌‌మ‌‌న్వయం ఉండేలా ప్రతి నియోజ‌‌క‌‌వ‌‌ర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియ‌‌మిస్తున్నామ‌‌ని తెలిపారు.