ఎన్జీటీ తీర్పు ఇచ్చే టైమ్లో.. సర్కార్ మేల్కొంది

ఎన్జీటీ తీర్పు ఇచ్చే టైమ్లో.. సర్కార్ మేల్కొంది

సంగమేశ్వరంపై ట్రిబ్యునల్ ముందుకు తెలంగాణ
పిటిషన్ రీఓపెన్ చేయాలని అఫిడవిట్
జాయింట్ కమిటీ రిపోర్టుపై అబ్జెక్షన్
రిపోర్టు ఇచ్చినంక వారం పాటు సైలెంట్ గా ఉన్న ప్రభుత్వం
సడెన్ గా స్పందించడంపై జలసౌధలో చర్చ

హైదరాబాద్‌‌, వెలుగు: ఏపీ చేపట్టిన సంగమేశ్వరం(రాయలసీమ) లిఫ్ట్‌‌ స్కీంపై నేషనల్‌‌ గ్రీన్‌‌ ట్రిబ్యునల్‌‌(ఎన్జీటీ) తీర్పు ఇచ్చే టైమ్ లో మన సర్కార్ మేల్కొంది. రాయలసీమకు నీటి కేటాయింపులు లేకున్నా పాత ప్రాజెక్టులకు సప్లిమెంట్‌‌ చేయడానికే కొత్త లిఫ్ట్‌ ‌చేపడుతున్నట్టు ఏపీ చెబితే.. దాన్ని జాయింట్‌‌ కమిటీ రిపోర్టులోనూ వెల్లడించిందని ఆబ్జెక్షన్ తెలిపింది. బేసిన్‌‌ అవతలికి నీటి తరలింపు చట్టబద్ధంకాదని పేర్కొంది. జాయింట్‌‌ కమిటీ తమను సంప్రదించకుండానే ఏకపక్షంగా రిపోర్టు ఇచ్చిందని, ఏపీ చేపట్టిన ప్రాజెక్టుకు ఎన్విరాన్‌‌మెంట్‌ ‌క్లియరెన్స్‌ ‌అవసరమేనని చెప్పింది. తమ వాదనలు వినిపించేందుకు పిటిషన్‌‌ను రీఓపెన్‌‌ చేయాలని విజ్ఞప్తి చేసింది. ఏపీ ప్రాజెక్టులపై ఇన్ని రోజులు సైలెంట్ గా మన సర్కార్.. ఒక్కసారిగా ఎన్జీటీలో అఫిడవిట్‌ ‌ఎందుకు ఫైల్‌‌ చేసిందా? అనే చర్చ మొదలైంది.

ఆ ప్రాజెక్టులకు ఎలాంటి కేటాయింపుల్లేవ్…
పోతిరెడ్డిపాడు హెడ్‌‌రెగ్యులేటర్‌‌పై ఆధారపడి నిర్మించిన శ్రీశైలం రైట్‌ ‌బ్రాంచ్‌ కెనాల్‌‌, తెలుగు గంగ, గాలేరు – నగరి ప్రాజెక్టులకు 111 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయని జాయింట్‌‌ కమిటీ తన రిపోర్ట్ లో వెల్లడించిందని.. అయితే బచావత్‌‌ అవార్డులో ఈ ప్రాజెక్టులకు ఎలాంటి కేటాయింపులూ లేవని రాష్ట్ర సర్కార్ అఫిడవిట్ లో పేర్కొంది. బచావత్‌ ‌అవార్డులోని కేటాయింపులు, ప్రాజెక్టుల వారీగా ఇచ్చిన ఇండెంట్ల వివరాలతో కూడిన కాపీని ఎన్జీటీకి అందజేసింది. పోతిరెడ్డిపాడు నుంచి కేవలం 1,500 క్యూ సెక్కుల నీటిని తీసుకోవడానికే అంగీకారం కుదిరిందని, దాన్ని అతిక్రమించి హెడ్‌‌రెగ్యులేటర్‌‌ కెపాసిటీని 80 వేల క్యూ సెక్కులకు పెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. జాయింట్‌‌ కమిటీ ఏపీ ఆఫీసర్లను మాత్రమే సంప్రదించి ఎన్జీటీకి రిపోర్టు ఇచ్చిందని, తమను కనీసం అడగనే లేదని తెలిపింది. కరోనా కారణంగా తాము పూర్తి స్థాయిలో వాదనలు వినిపించలేకపోయామని, పిటిషన్‌‌ను రీఓపెన్‌‌ చేసి తాము వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని కోరింది. ఏపీ చేపడుతున్న ప్రాజెక్టుతో దక్షిణ తెలంగాణలోని జిల్లాలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.

ఒత్తిడి పెరగడంతోనే…
జాయింట్‌‌ కమిటీ ఈ నెల 8న రిపోర్టు ఇవ్వగా, 11న ఎన్జీటీ తుది విచారణ జరిపింది. అదే రోజు కేసులో వాదనలు ముగిశాయని తెలిపింది. ఆ ప్రాజెక్టుకు ఎన్విరాన్‌‌మెంట్‌‌ క్లియరెన్స్‌ ‌అవసరమో? లేదో? రిపోర్టు ఇవ్వాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖను ఎన్జీటీ డివిజన్ బెంచ్ ఆదేశించింది. తన వాదనలు ఏమైనా ఉంటే రిపోర్టు రూపంలో ఇచ్చేందుకు ఏపీకి అవకాశమిచ్చింది. కమిటీ రిపోర్టు ఇచ్చిన తర్వాత వారం రోజుల పాటు సైలెంట్ గా ఉన్న రాష్ట్ర సర్కార్.. ఉన్నట్టుండి శుక్రవారం ఎన్జీటీలో అఫిడవిట్‌ ‌ఫైల్‌ ‌చేసింది. ఈ పిటిషన్‌‌ను ముందు నుంచీ లైట్‌‌ తీసుకున్న ప్రభుత్వం.. ఉన్నట్టుండి రీఓపెన్‌ ‌చేయాలని అఫిడవిట్‌‌ ఎందుకు ఫైల్‌‌ చేసిందా? అని జలసౌధలో చర్చ మొదలైంది. ఏపీ ప్రాజెక్టుల విషయంలో రాజకీయంగా వస్తున్న విమర్శలు, సుప్రీంలో ఫైల్ చేసిన పిటిషన్‌‌ విచారణకు రాకపోవడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోందని.. అందుకే ఎన్జీటీలో అఫిడవిట్‌‌ ఫైల్‌‌ చేసిందని తెలుస్తోంది.

బేసిన్‌‌ అవతలికి నీటి తరలింపుపై గట్టిగా అడగలే..
బేసిన్‌ ‌అవతలికి నీటి తరలింపు చట్టబద్ధమని బచావత్‌ ‌అవార్డు ఎనిమిదో చాప్టర్‌‌ లోని పేజీ నం.128 చెప్తోందని కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ) ఎన్జీటీలో అఫిడవిట్‌ ‌ఫైల్‌‌ చేసింది. బచావత్‌‌ అవార్డు కేవలం 5 అవుట్‌ ‌లెట్లకు మాత్రమే బేసిన్‌ ‌అవతలికి తరలింపునకు అవకాశం ఇవ్వగా, దాన్ని అన్ని అవుట్ లెట్లకు వర్తింపజేసేలా కేఆర్‌‌ఎంబీ వ్యవహరిస్తోందని తెలంగాణ ఇంజనీర్లు మండిపడుతున్నారు. ఆ అంశాన్ని స్ట్రెస్‌ చేసి చెప్పాల్సిన మన సర్కార్.. కేవలం 111 టీఎంసీల కేటాయింపులు లేవన్నవిషయాన్నిమాత్రమే చెప్పిఊరుకుంది. కేటాయింపులే లేని ప్రాజెక్టులకు బేసిన్‌‌ అవతలికి నీటిని తరలిస్తున్నారని మాత్రమే పేర్కొంది. పిటిషన్‌‌ను రీఓపెన్‌ ‌చేయడానికి ఎన్జీటీ అవకాశమిస్తే సమర్థవంతంగా వాదనలు వినిపించి సంగమేశ్వరంపై ఏపీని కట్టడి చేయాలనే డిమాండ్‌‌ బలంగా వినిపిస్తోంది.

For More News..

జెండా బ్లాక్‌గా పిలుచుకున్న జె బ్లాక్‌ ఇప్పుడు లేదాయే