
- గతంలో అమ్మహస్తం కింద 9 సరుకులు పంపిణీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
- మళ్లీ అదే తరహా కిట్ పంపిణీ చేసే యోచనలో సర్కారు
- ఇందిరమ్మ అభయహస్తం పేరుతో అమలుకు శ్రీకారం!
హైదరాబాద్, వెలుగు: దేశంలో ఎక్కడాలేని విధంగా నిరుపేదలకు సన్నబియ్యాన్ని అందిస్తున్న రాష్ట్ర సర్కారు త్వరలో మరో నిర్ణయం తీసుకోనుంది. పేదలకు సన్నబియ్యంతో నిత్యావసర సరుకుల కిట్‌ను అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. గతంలో కాంగ్రెస్ హయాంలో పేదలకు ‘అమ్మహస్తం’ పేరుతో రేషన్‌లో 9 రకాల నిత్యావసర సరుకులను అందించారు. దీంతో ప్రజలకు ధరల భారం నుంచి కొంత ఊరట లభించేది. ఇదే తరహా పథకాన్ని ‘ఇందిరమ్మ అభయహస్తం’ పేరుతో అమలు చేయడానికి కాంగ్రెస్ సర్కారు ప్లాన్ చేస్తోంది.
బీఆర్ఎస్ హయాంలో అన్నీ బందైనయ్..
ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత రేషన్ సరుకులు అన్నీ బంద్ అయ్యాయి. రాష్ట్రంలో ఘనంగా జరుపుకునే బతుకమ్మ, దసరా పండుగల పూట కూడా పేదలను గత సర్కారు పట్టించుకోలేదు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో రేషన్ పంపిణీ అంటే కేవలం బియ్యం ఇవ్వడమే అన్నట్లు వ్యవహరించింది.
పండగలప్పుడైనా మంచినూనె, కందిపప్పు, చక్కెర తదితర నిత్యావసర సరుకులు పేదలకు ఇచ్చి సాయం చేద్దామనే ఆలోచన నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదు. గతంలో ఇచ్చే 9 రకాల సరుకుల్లో కోత పెట్టి మొదట బియ్యం, పంచదార, కిరోసిన్‌కు కుదించింది. తర్వాత చక్కెరను, కిరోసిన్‌ను బంద్ చేసింది. ఇలా అన్ని సరుకులు బంద్ పెట్టి చివరకు బియ్యానికి మాత్రమే పరిమితం చేసింది.
ఇక ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సబ్సిడీ మీద 9 రకాల సరుకులను రూ.185కే అందించేది. సప్లయ్స్ శాఖ రేషన్ షాపుల్లో ‘అమ్మహస్తం’ పేరుతో బియ్యం, కేజీ కందిపప్పు, లీటరు పామాయిల్, కిలో గోధుమపిండి, అరకిలో చక్కెర, కిలో ఉప్పు, అర కిలో చింతపండు, 250 గ్రాముల కారంపొడి, వంద గ్రాముల పసుపు, లీటరు కిరోసిన్ ఇచ్చేది. ఆ అమ్మహస్తం పథకాన్ని ఇప్పుడు ఇందిరమ్మ అభయహస్తంగా తిరిగి ప్రారంభించేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది.
ఒక్కరోజే 18 వేల టన్నుల సన్నబియ్యం పంపిణీ
మంగళవారం ఒక్కరోజే రాష్ట్రంలో 8.30 లక్షల కుటుంబాలు సన్నబియ్యం తీసుకున్నాయి. ఈ ఒక్కరోజే 17,311 రేషన్ షాపుల్లో దాదాపు 18 వేల టన్నుల బియ్యాన్ని పంపిణీ చేశారు.