
- బాయ్స్ జూనియర్ కాలేజ్, ఒకేషనల్ కాలేజీలకు రూ.5.10 కోట్లు మంజూరు
- అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చిన ఇంటర్మీడియట్ బోర్డ్
- క్లాస్ రూమ్స్, సైన్స్ ల్యాబ్, టాయిలెట్స్ నిర్మాణానికి ఖర్చు
మహబూబ్‌నగర్, వెలుగు:మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని గర్నమెంట్ బాయ్స్ జూనియర్ కాలేజ్, ఒకేషనల్ కాలేజ్డెవలప్మెంట్కు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ప్రత్యేక చొరవతో ఈ రెండు కాలేజీల అభివృద్ధి కోసం ప్రతిపాదనలు పంపగా.. రూ.5.10 కోట్ల నిధుల మంజూరుకు తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (టీజీబీఐఈ) అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చింది. ఫండ్స్‌తో క్లాస్ రూములు, ల్యాబ్స్, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కేటాయించగా.. ఈ నెలాఖరు వరకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేయనున్నారు. వచ్చే అకడమిక్ ఇయర్‌లోపు ల్యాబ్స్, క్లాస్ రూములు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
1969లో ప్రారంభం..
మహబూబ్‌నగర్ గవర్నమెంట్ బాయ్స్ జూనియర్ కాలేజీకి 60 ఏండ్ల చరిత్ర ఉంది. ప్రస్తుతం ఉన్న ఈ కాలేజ్ బిల్డింగ్‌కు వందేళ్ల చరిత్ర ఉంది. స్వాతంత్ర్యం రాక ముందు నిజాం నవాబులు ఈ భవనాన్ని నిర్మించారు. అయితే బిల్డింగ్‌కు సంబంధించిన పాత రికార్డులు అందుబాటులో లేవు. రాష్ట్రాల పునర్విభజనసమయంలో ఈ రికార్డులు మిస్ అయినట్లు తెలిసింది. ఈ బిల్డింగ్‌ను 1948లో మల్టీపర్సస్ హైస్కూల్ కోసం కేటాయించారు. 1969–70 అకడమిక్ ఇయర్లో మహబూబ్‌నగర్‌కు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మంజూరు కాగా.. కాలేజ్ కోసం ఈ బిల్డింగ్‌ను అలాట్ చేశారు. ఇక్కడున్న మల్టీపర్పస్ హైస్కూల్‌ను వేరే చోటుకు తరలించారు. ప్రస్తుతం ఈ బిల్డింగులో సరిపడా క్లాస్ రూమ్స్ లేవు.
అలాగే ఈ కాలేజికి చెందిన ఫిజిక్స్, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ ల్యాబ్‌లకు నాలుగు గదులు ఉండగా.. శిథిలావస్థకు చేరుకోవడంతో వాటిని కూల్చేశారు. ఖాళీగా ఉన్న ఈ స్థలాన్ని గవర్నమెంట్ ఒకేషనల్ బిల్డింగ్‌కు అలాట్ చేశారు. అయితే ప్రస్తుతం జూనియర్ కాలేజ్‌లో స్టూడెంట్ల సంఖ్య పెరుగుతోంది. అందుకు అనుగుణంగా క్లాస్ రూమ్ లు, ల్యాబ్ అవసరం ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం రూ.2 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో ల్యాబ్స్ కోసం నాలుగు రూములు, రెండు అడిషనల్ క్లాస్ రూమ్స్, టాయిలెట్స్ నిర్మించనున్నారు.
ఒకేషనల్ కాలేజ్‌కు రూ.3.10 కోట్లు..
బాయ్స్ జూనియర్ కాలేజీలోని ల్యాబ్ బిల్డింగ్‌లను కూల్చేసి, ఆ స్థలంలో ఒకేషనల్ కాలేజ్ బిల్డింగ్ పనులను ప్రారంభించారు. ఈ పనులు కొద్ది రోజులుగా అసంపూర్తిగా ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో పనులు ప్రారంభించగా.. పనులు నిలిచిపోయాయి. దీంతో ఈ కాలేజీకి కూడా రాష్ట్ర ప్రభుత్వం రూ.3.10 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులను అసంపూర్తిగా ఉన్న బిల్డింగ్ నిర్మాణ పనులు, తలుపులు, కిటికీలు, రంగులు వేయడం, సైన్స్ ల్యాబ్స్, డ్యుయల్ డెస్క్, ఫర్నీచర్ కోసం వెచ్చించనున్నారు.
ఎమ్మెల్యే చొరవతోనే..
ఈ రెండు కాలేజీల్లో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని సిబ్బంది గత ప్రభుత్వ హయాంలో పలుమార్లు ప్రతిపాదనలు పెట్టారు. కానీ, ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఇటీవల ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి కాలేజ్‌ను విజిట్ చేయగా.. సిబ్బంది రెండు కాలేజీల్లోని సమస్యలను ఆయనకు వివరించారు. స్పందించిన ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రపోజల్స్ అందజేసి, నిధులు విడుదల చేయాలని కోరారు. రెండు కాలేజీలకు రూ.5.10 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ కావడంతో, టెండర్లు పిలిచి త్వరలో పనులు ప్రారంభించనున్నారు.