
- కంప్యూటర్, టైలరింగ్, బ్యూటిషీయన్ కోర్సులు పూర్తి చేసిన మహిళలు
- స్వయం ఉపాధి కోసం బ్యాంకుల ద్వారా రుణాలు
- సబ్సిడీలు ఇస్తామని ప్రకటించిన పరిశ్రమల శాఖ
మహబూబ్‌నగర్, వెలుగు : మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం మహిళా సంఘాలకు పెద్ద మొత్తంలో రుణాలు మంజూరు చేస్తోంది. టీఎస్ ఆర్టీసీలో బస్సులు, సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ పంపుల నిర్వహణ బాధ్యతలను వారికి అప్పగించే కార్యక్రమానికి కొద్ది రోజుల కిందట శ్రీకారం చుట్టారు. సీఎం తరహాలోనే మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. కొత్త ఆలోచనలతో మహిళలు స్వయం ఉపాధి మార్గాలపై నజర్ పెడుతున్నారు. ఇందులో భాగంగా 'పాలమూరు నవరత్నాలు' కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా ఇంట్రెస్ట్ ఉన్న మహిళలకు కంప్యూటర్, టైలరింగ్, బ్యూటిషీయన్ కోర్సుల్లో తన సొంత నిధులతో ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. కోర్సు పూర్తి చేసుకున్న వారికి ప్రభుత్వ రంగ బ్యాంకులు మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు రుణాలు కూడా ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయి.
ఫస్ట్ బ్యాచ్ కంప్లీట్
'నవరత్నాలు'లో భాగంగా మహిళల్లో స్కిల్ అండ్ నాలెడ్జ్ పెంపొందించేందుకు బ్యూటిషీయన్, టైలరింగ్, కంప్యూటర్ కోర్సులు ఫ్రీగా అందుబాటులోకి తెచ్చారు. సెట్విన్ ఆధ్వర్యంలో ఈ సెంటర్‌ను నిర్వహించనన్నారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వారికి సంస్థ ద్వారా సర్టిఫికెట్స్ ఇవ్వనున్నారు. గతేడాది నవంబరు చివరి వారం నుంచి ఫస్ట్ బ్యాచ్‌ను స్టార్ట్ చేశారు. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రెండు బ్యాచులకు మూడు నెలల ట్రైనింగ్ ఇచ్చారు.
ఈ బ్యాచ్‌లో మొత్తం 224 మంది మహిళలు ట్రైనింగ్ తీసుకోగా.. వీరికి ఈ నెల 3న ఎగ్జామ్స్ నిర్వహించారు. వచ్చే వారం రిజల్ట్స్‌ను అనౌన్స్ చేయనున్నారు. అదే రోజు సెట్విన్ ఆధ్వర్యంలో సర్టిఫికెట్లు అందించనున్నారు. ఇప్పటికే కొత్త బ్యాచ్ కోసం అప్లికేషన్లు తీసుకుంటున్నారు. ఈసారి స్టార్ట్ చేసే కొత్త కోర్సుల్లో మగ్గం వర్క్‌ను కూడా చేర్చారు. దీంతో మహిళలు ఈ కోర్సులో చేరేందుకు మొగ్గు చేపుతున్నారు.
బ్యాంకుల ద్వారా రుణాలు
కోర్సు పూర్తి చేసుకున్న వారికి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఇందు కోసం బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పరిశ్రమల శాఖ ఆఫీసర్లతో చర్చించిన ఆయన.. బ్యాంకర్లతో మాట్లాడారు. రెండు శాఖల ఆఫీసర్లు సమన్వయం చేసుకొని రుణాలు ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ రెండు శాఖల ఆఫీసర్లు ట్రైనింగ్ పూర్తి చేసుకున్న మహిళల వివరాలను ఆన్లైన్ ఎంట్రీ చేస్తున్నారు. అవసరం ఉన్న వారికి ముద్ర, ప్రధాన మంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ (పీఎంఈజీపీ) ద్వారా రుణాలు ఇప్పించనున్నారు.
మహిళా సంఘాల్లో సభ్యులై ఉంటే ఆ సంఘాల ద్వారా, స్ర్తీ నిధి ద్వారా, పొదుపు సంఘాల ద్వారా కూడా రుణాలు అందించే అవకాశాలపై ప్రయత్నిస్తున్నారు. మహిళలు వారి వారి అవసరాలను బట్టి రూ.15 వేల నుంచి మొదలుకొని రూ.10 లక్షల వరకు రుణాలు ఇవ్వనున్నారు. అయితే కావాల్సిన మెటీరియల్ తదితర వాటికి సంబంధించిన కొటేషన్ బ్యాంకర్లకు ఇవ్వాల్సి ఉంటుంది. మహిళలు పెద్ద మొత్తంలో రుణాలు తీసుకొని.. ఇతర అవసరాలకు వాటిని ట్రాన్స్ఫర్ చేస్తే ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో.. వచ్చే వారం రుణాల మంజూరుపై బ్యాంకర్లు మహిళలకు అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. కాగా.. పరిశ్రమల శాఖ ద్వారా సబ్సిడీ ద్వారా కూడా రుణాలు అందించే ప్రయత్నాలు చేస్తున్నారు.
బ్యాంకర్లతో మాట్లాడాం..
స్కిల్ అండ్ నాలెడ్జ్ సెంటర్లో కంప్యూటర్, టైలరింగ్, బ్యూటిషీయన్ కోర్సుల్లో ఫస్ట్ బ్యాచ్‌కు చెందిన మహిళలు ఎగ్సామ్స్ రాశారు. వీరు స్వయం ఉపాధి పొందాలని బ్యాంకుల ద్వారా ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇందు కోసం బ్యాంకర్లు, పరిశ్రమల శాఖ ఆఫీసర్లతో మాట్లాడాం. అర్హత కలిగిన వారికి ఆయా స్కీముల ద్వారా రుణాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశాం. ప్రస్తుతం కోర్సు పూర్తి చేసుకున్న వారి వివరాల సేకరణ జరుగుతోంది.
యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే, మహబూబ్‌నగర్