ఒరిజినల్​ ఐడీ కార్డు ఉంటేనే గ్రూప్​-2 ఎగ్జామ్స్​కు ఎంట్రీ

ఒరిజినల్​ ఐడీ కార్డు ఉంటేనే గ్రూప్​-2 ఎగ్జామ్స్​కు ఎంట్రీ
  • మెహందీ, టాటూలు, నగలు వేసుకోవద్దు
  • అరగంట ముందే సెంటర్ల గేట్లు క్లోజ్
  • సెంటర్ల వద్ద 144 సెక్షన్​
  • నేడు, రేపు గ్రూప్–2 ఎగ్జామ్స్​​
  • 150 సెంటర్లు.. 52053 అభ్యర్థులు

యాదాద్రి, సూర్యాపేట, నల్గొండ, వెలుగు : గ్రూప్​–-2 ఎగ్జామ్స్​కు ప్రభుత్వం స్ట్రిక్ట్​ రూల్స్ అమలు చేయనుంది. ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఒరిజినల్ ఐడీ కార్డు ఉంటేనే ఎగ్జామ్​ రాయడానికి అనుమతి ఉంటుందని ఆఫీసర్లు తేల్చి చెప్పారు. నగలు, మెహందీ, టాటూలు వేసుకోవద్దని చెప్పారు. ఎగ్జామ్స్​రాసేందుకు వచ్చే ప్రతి అభ్యర్థి బయోమెట్రిక్​తీసుకుంటామని తెలిపారు.  గ్రూప్​–-2 పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం ఉమ్మడి నల్గొండ జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

కలెక్టర్లు ఇలా త్రిపాఠి, హనుమంతరావు, తేజస్ నందలాల్​పవార్ ఎగ్జామ్స్​పై రివ్యూలు నిర్వహించడంతోపాటు సెంటర్లలో ఏర్పాట్లను పరిశీలించారు. ఎగ్జామ్స్​నిర్వహణ కోసం చీఫ్ సూపరింటెండెంట్, అసోసియేట్ చీఫ్ సూపరింటెండెంట్లు, బయోమెట్రిక్ తీసుకోవడానికి ప్రత్యేకంగా ఆఫీసర్లు, అబ్జర్వర్లు, జాయింట్​రూట్ ఆఫీసర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్స్ సహా ఇన్విజిలేటర్లను నియమించారు. 

నేడు, రేపు గ్రూప్​–-2 పరీక్షలు..

గ్రూప్​–-2 ఎగ్జామ్ ఆది, సోమవారాల్లో నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం 10  నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఫస్ట్ పేపర్, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో పేపర్ పరీక్ష నిర్వహణ ఉంటుంది. 16న ఉదయం 10 నుంచి 12.30 వరకు మూడో పేపర్, మధ్యాహ్నం 3 నుంచి 5.30 వరకు నాలుగో పేపర్ ఎగ్జామ్స్​నిర్వహించనున్నారు. అభ్యర్థులు గంట ముందే సెంటర్లకు చేరుకోవాలని, అరగంట ముందే గేట్లు మూసి వేస్తామని అధికారులు ప్రకటించారు. సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. 

బయోమెట్రిక్​ తప్పనిసరి..

ఎగ్జామ్స్​కు హాజరయ్యే ప్రతి అభ్యర్థి బయోమెట్రిక్​ తప్పనిసరి చేశారు. బయోమెట్రిక్​వేయని అభ్యర్థుల ఓఎంఆర్‌‌‌‌ పత్రాలను మూల్యాంకనం చేయబోమని టీజీపీఎస్సీ తెలిపింది. ఎగ్జామ్స్​కు ముందే అందించే ఓఎంఆర్​షీట్​లో తమ వివరాలను తప్పులు లేకుండా అభ్యర్థులు రాయాల్సి ఉంటుంది. అభ్యర్థులు హాల్ టికెట్ ను ఏ–4 సైజ్ పేపర్ లో కలర్ ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. డౌన్​లోడ్​చేసిన హాల్ టికెట్ పై ఫొటో స్పష్టంగా లేకుంటే గెజిటెడ్ ఆఫీసర్ లేదా చివరగా చదువుకున్న విద్యాసంస్థ ప్రిన్సిపాల్​తో అటెస్ట్ చేయించాల్సి ఉంటుంది మూడు పాస్ పోర్టు సైజ్​ఫొటోలతోపాటు వెబ్ సైట్ లో పొందుపరిచిన ధ్రువీకరణ పత్రాన్ని పూర్తిచేసి ఇన్విజిలేటర్ కు అందించాల్సి ఉంటుంది. హాల్ టికెట్ పై అభ్యర్థులు తమ తాజా పాస్ ఫోటోను అతికించాలన్నారు. 

నగలు, మెహందీ, టాటూలు వద్దు..

ఎగ్జామ్స్​కు  హాజరయ్యే అభ్యర్థులకు ఆఫీసర్లు పలు సూచనలు చేశారు. అభ్యర్థులు తమ చేతులపై మెహందీ, టాటూలు, నగలు వేసుకోవద్దు. సెల్​ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్​ పరికరాలు తీసుకురావద్దు. చెప్పులతో రావాల్సి ఉంటుంది. అయితే మంగళసూత్రం, గాజులకు మినహాయింపు ఉంటుంది. బ్లూ లేదా బ్లాక్​ పెన్నుతోనే ఎగ్జామ్స్​రాయాల్సి ఉంటుంది. ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఒరిజినల్ గుర్తింపు కార్డును తీసుకొని వస్తేనే ఎంట్రీ ఉంటుందని ఆఫీసర్లు స్పష్టం చేశారు. 

150 సెంటర్లు.. 52,053 అభ్యర్థులు..

గ్రూప్ 2 ఎగ్జామ్స్​ నిర్వహణ కోసం ఉమ్మడి నల్గొండ జిల్లాలో 150 సెంటర్లు ఏర్పాటు చేశారు. యాదాద్రి జిల్లాలో 14 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 6078 మంది అభ్యర్థులు ఎగ్జామ్స్​కు హాజరుకానున్నారు. సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో 136 పరీక్షా కేంద్రాల్లో 45,975 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. కోదాడ రీజినల్‌‌‌‌ పరిధిలో 19, సూర్యాపేట రీజినల్‌‌‌‌లో 30 , నల్గొండ రీజినల్ లో 59, మిర్యాలగూడలో 28 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 45,975 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు.

అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం 


గ్రూప్​–-2 పరీక్ష కోసం అన్ని ఏర్పాట్లు చేశాం. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నాం. అభ్యర్థులు కూడా రూల్స్​ప్రకారం సెంటర్​కు రావాలి. ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ప్రశాంతంగా ఎగ్జామ్స్ రాయాలి.  - హనుమంతరావు, కలెక్టర్, యాదాద్రి